అమెరికా రహస్యాలను ఎలా దొంగిలించాడు?
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) రహస్య కుట్రలను స్నోడెన్ బయటపెట్టినప్పుడు.. నిజంగా అమెరికా ఇలాంటి పనులు చేస్తుందా? చాలా మంది విస్తుపోయారు.
టొరంటో: ఉగ్రవాద నిరోధం, సామాజిక, దేశ భద్రత, మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక అకృత్యాలకు అడ్డుకట్ట.. ప్రజలపై సామూహిక నిఘా (మాస్ సర్వేలెన్స్) పెట్టడానికి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు చెప్పుకొచ్చే కారణాలివి. మరి సర్వేలెన్స్ వల్ల ప్రపంచంలో శాంతి నెలకొందా? అంతకంతకూ అంశాంతి పేట్రేగిందా?
కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వహిస్తోన్న ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థల సహకారంతో నిఘా వర్గాలు వ్యక్తులపై కన్నేసి, వారి ప్రైవేట్ జీవితాల్లోకి సైతం చొచ్చుకుపోతుంది. ఆ సమాచారాన్నంతటికీ ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తుంది. తద్వారా ఆ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను వీలైతే బ్లాక్ మెయిల్స్ చేసో, మాట వినకుంటే అడ్డు తొలిగించుకునో తమ కార్యకలాపాలను నిరాటంకంగా సాగిస్తాయి. చాలావరకు ఆ కలాపాలు.. బలవంతపు అప్పులిచ్చి చేసుకునే భారీ వ్యాపార ఒప్పందాలు, విదేశీ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు తదితరాలుంటాయి.
ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల్లోకి చొరబడి తన దైన పాత్ర నిర్వహిస్తున్న అమెరికా.. దాని మిత్రదేశాలు ఆ పనిని ఎలా చేస్తాయో ఆధారాలతో సహా ప్రపంచానికి తెలియజెప్పాడు అమెరికన్ కంప్యూటర్ ప్రొఫెషనల్ ఎడ్వర్డ్ స్నోడెన్. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) రహస్య కుట్రలను స్నోడెన్ బయటపెట్టినప్పుడు.. నిజంగా అమెరికా ఇలాంటి పనులు చేస్తుందా? అని కొందరు అమెరికన్ పొలిటీషియన్సే విస్తుపోయారు. స్నోడెన్ జీవితంపై లూక్ హార్డింగ్ రాసిన 'ది స్నోడెన్ ఫైల్స్' పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకున్న బయోగ్రాఫికల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా 'స్నోడెన్' సెప్టెంబర్ 16న విడుదల కానుంది.
అగ్రరాజ్యాన్ని గడగడలాండించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆ దేశ రహస్యాలు ఎలా తస్కరించాడు? అత్యంత విలువైన సమాచారంతో దేశసరిహద్దులు ఎలా దాటాడు? ఎవరి సహకారంతో ఆ సమాచారాన్ని విజయవంతంగా బహిర్గతం చేశాడు? ఈ క్రమంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఏ విధంగా సహకరించింది? తదితర అంశాల ఆధారంగా దిగ్గజ దర్శకుడు ఒలీవర్ స్టోన్ రూపొందించిన 'స్నోడెన్' సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. గతేడాది 'ది వాక్'తో హిట్ కొట్టిన జోసెఫ్ గోర్డన్ లెవిట్ స్నోడెన్ పాత్రలో జీవించి మెప్పించాడు. స్నోడెడ్ ప్రేయసిలిండ్ననే మిల్స్ పాత్రను షలీన్ ఉడ్లే పోషించింది. టామ్ విల్కిన్సన్, స్కాట్ ఈస్ట్ వుడ్ లు మిగతా పాత్రధారులు స్టార్ హీరో నికోలస్ కేజ్ అతిథి పాత్రలో మెరుస్తారు.134 నిమిషాల నిడివిగల 'స్నోడెన్' సినిమా బడ్జెట్ 50 మిలియన్ డాలర్లు. సెప్టెంబర్ 9న టొలంటో ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ లో స్నోడెన్ ప్రీవ్యూను ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా 16న అమెరికాలో రిలీజ్ కానుంది. అయితే భారత్ లో ఎప్పుడనేది ఇంకా తెలియాల్సిఉంది.
ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్ జూన్ 21, 1983లో ఉత్తర కరోలినాలోని ఎలిజబెత్ నగరంలో పుట్టాడు. తాతల కాలం నుంచి అతని సహోదరి దాకా కుటుంబంలో దాదాపు అందరూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులే. సర్కారు ఉప్పుతింటూ పెరిగిన స్నోడెన్ సడన్ కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)లో, యూఎస్ఏ గవర్నమెంట్ కోసం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశాడు. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ)లో చేరాడు. ఐదుకళ్ల నిఘా కూటమి(ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయెన్స్- యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)తో కలిసి ఎన్ఎస్ఏ పౌరులపై సాగిస్తోన్న అక్రమవ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని చోరీచేసి హాంకాంగ్ పారిపోయిన స్నోడెన్.. 2013లో ఆ రహస్య సమాచారాన్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాడు. అంతే, అమెరికా సహా పలు దేశాల్లో అల్లకల్లోలం చెలరేగింది. గూఢచర్యానికి పాల్పడి, దేశరహస్యాలను శత్రువులకు చేరవేశాడంటూ స్నోడెన్ పై అమెరికాలో లెక్కకుమిక్కిలి కేసులు నమోదయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న స్నోడెన్ ను పట్టుకునేందుకు చాలా దేశాలు ప్రయత్నించాయి. ఒక్క రష్యా తప్ప. గడిచిన మూడేళ్లుగా రష్యాలోని రహస్యప్రాంతంలో తలదాచుకుంటున్న స్నోనెడ్ ను ఎప్పటికైనా పట్టుకుని శిక్షించాలని అమెరికా భావిస్తోంది.


