'నాకు ప్రేమకథలు లేవు'
'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రంతో తెలుగు తెరపై చిట్టి పొట్టి మాటలతో సందడి చేసిన చిన్నారి గుర్తున్నాడా.
'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రంతో తెలుగు తెరపై చిట్టి పొట్టి మాటలతో సందడి చేసిన చిన్నారి గుర్తున్నాడా. ఇప్పుడు హీరో అయ్యాడు. 'వినవయ్యా రామయ్యా' చిత్రంతో వెండితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సిటీకి వచ్చిన 'నాగ్ అన్వేష్' సాక్షితో ముచ్చటించారు....ఆ ముచ్చట్లు అతని మాటల్లోనే.. ఎప్పుడో ఊహ తెలియని వయస్సులో 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాను. కొన్ని చిత్రాల్లో నటించాను. చదువు కోసం గ్యాప్ తీసుకొని మళ్లీ 'వినవయ్యా రామయ్యా' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాను. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడం సీనియర్ నటులతో నటించే అనుభవం ఉండడం వల్ల హీరోగా తొలి చిత్రమే అయినా పెద్దగా కష్టం అనిపించలేదు. దాంతో పాటు చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, తులసి వంటి సీనియర్ నటుల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం దక్కింది.
సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్...
నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ సౌందర్య. ఆమె నటించిన చిత్రాలన్నీ చూశాను. అలానే అమెతో ప్రత్యక్షంగా నటించిన అనుభవం ఉంది. ఆ సినిమా టైంలో ఓ చిన్న సంఘటన జరిగింది. నాకు ఇప్పటికి గుర్తున్న విషయం అది ఒకటే. సీన్‌లో భాగంగా సౌందర్య నన్ను కొట్టాలి. అయితే ఆమె కొట్టినట్లు నటిస్తే నిజంగా నాకు ఆమె దెబ్బ గట్టిగా తగిలింది. ఆ దెబ్బకు నేను ఒకటే ఏడుపు. దాంతో వెంటనే ఆమె మరల నన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చింది. అలా ఆ షూటింగ్ జరుగుతున్నంత సమయం సీన్ పూర్తయిన వెంటనే ఆమె నన్ను తన ఒళ్లో కూర్చొబెట్టుకొని ఆడించేది.
నాకు ప్రేమ కథలు లేవు...
కాలేజీ రోజుల్లో బేసిగ్గా అందరి కుర్రాళ్లకు ప్రేమ కథలు చాలానే ఉంటాయి. అమ్మాయిల వెంటపడడం, వారిని ఆటపట్టించడం చాలా మంది అబ్బాయిలు చేసే పనే. నేను మాత్రం చాలా నెమ్మది. దాంతోపాటు బొద్దుగా ఉండేవాడిని. దీంతో ఇల్లు, కాలేజీ ఇదే ప్రపంచం. అందుకే కాలేజీ రోజుల్లో నాకు ఎలాంటి ప్రేమకథలు లేవు. 'వినవయ్యా రామయ్యా'చిత్రంలో హీరోకి నాకు ఎలాంటి పోలిక లేదు.
మార్పు కొత్తగా ఉంటుంది...
ఎవరికైనా ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వస్తే అందులో కనిపించే మార్పు చాలా కొత్తగా ఉంటుంది. కొంత వరకు సంతోషాన్ని ఇస్తుంది. కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాలేజీ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బులు పెట్టుకొని వెళ్లేవాడిని. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యానుగా ఆ అవసరం లేదు. అప్పుడు పట్టించుకోని అమ్మాయిలు ఇప్పుడు మాత్రం సోషల్ నెట్‌వర్క్ పేజీల్లో తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు సరదాగా ఉండే ఫ్రెండ్స్...ఇప్పుడు ప్రత్యేకంగా చూడడం ప్రారంభిస్తున్నారు. ఇందులో గొప్పగా చెప్పుకోవడానికి ఉంది.. ఇబ్బంది కలిగించే విషయమూ ఉంది.
మంచి నటుడు అనిపించుకోవాలి
హీరోగా చేస్తున్నంత మాత్రాన నా స్థాయి ఏంటో నాకు తెలుసు. కాబట్టి నాకు సరిపోయే కథలకే మొదటి ప్రాధాన్యం. నేను ఎక్కువగా ఇష్టపడేది కామెడీ. ఆ తరహా కథలు వస్తే మేగ్జిమమ్ ఒకే చేస్తా. పది మందిని కొట్టడంలో హీరోయిజం కనిపిస్తే, నాకు సరిపోయే పాత్రలు చేస్తూ అందులో పెర్ఫార్మెన్స్ చూపిస్తే నటుడు కనిపిస్తాడు. నేను రెండోది ఇష్టపడతాను.
- విశాఖ ఫీచర్స్


