‘1’ ‘నేనొక్కడినే’ చిత్రం టీజర్ను 10 లక్షల మంది చూశారట
సినిమా విడుదలకు ముందు టీజర్లను విడుదల చేయడం ప్రస్తుతం సినిమా ప్రచారంలో ప్రధాన అంకం. ఇంటర్నెట్ ద్వారా ఆ టీజర్లను తిలకించే ప్రేక్షకుల సంఖ్యను బట్టి... సినిమాపై ఉన్న అంచనాలు పరిగణించబడుతున్నాయి.
సినిమా విడుదలకు ముందు టీజర్లను విడుదల చేయడం ప్రస్తుతం సినిమా ప్రచారంలో ప్రధాన అంకం. ఇంటర్నెట్ ద్వారా ఆ టీజర్లను తిలకించే ప్రేక్షకుల సంఖ్యను బట్టి... సినిమాపై ఉన్న అంచనాలు పరిగణించబడుతున్నాయి. గతంలో పలువురు స్టార్ హీరోల సినిమా టీజర్లు సంఖ్యాపరంగా సెన్సేషన్ సృష్టించాయి. ప్రస్తుతం ఆ రికార్డులన్నింటినీ మహేష్‌బాబు ‘1’ ‘నేనొక్కడినే’ చిత్రం టీజర్ అధిగమించింది.
ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.
‘‘మూడు రోజుల్లో లక్షల మంది ఓ సినిమా టీజర్‌ని చూడటమంటే సాధారణమైన విషయం కాదు. ఊహకందని ట్రెమండస్ రెస్పాన్స్ ఇది. దర్శకుడు సుకుమార్ అంచనాలకు అందనంత గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. లండన్‌లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తిగావచ్చింది. జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహణం: ఆర్.రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, నిర్మాణం: 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్.