మాధురీ దీక్షిత్కు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి శంకర్ ఆర్. దీక్షిత్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు.
ప్రఖ్యాత బాలీవుడ్ నటి, అలనాటి అందాల సుందరి మాధురీ దీక్షిత్కు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి శంకర్ ఆర్. దీక్షిత్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ''ఆయన లేని లోటు తీర్చలేనిదే. కాకపోతే ఆయన సంపూర్ణంగా జీవించారు. ఈ సందర్భంగా మాకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని మాధురి ఒక ప్రకటనలో తెలిపింది.
శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఓషివాడాలోని ఒక శ్మశానవాటికలో శంకర్ దీక్షిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మాధురితోనే ఉండేవారని, గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి, ముంబైలోని జుహు నివాసంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారని మాధురి మేనేజర్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తామన్నారు. శ్రీదేవి ట్విట్టర్ ద్వారా మాధురికి సంతాపం తెలిపారు.