అమితాబ్ నన్ను టైగర్ అని పిలిచే వారు

అమితాబ్ నన్ను టైగర్ అని పిలిచే వారు - Sakshi


రాజమండ్రి  : ‘మూడో తరగతి చదువుకునే రోజుల్లోనే మహానటుడు అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించాను, ఆయన నన్ను టైగర్.. అని ప్రేమతో పిలిచేవారు’ అని వర్ధమాన హీరో ఆనందవర్ధన్ చెప్పారు. సుమారు పాతిక సినిమాల్లో బాలనటుడిగా నటించిన ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస ఆనందవర్ధన్. ప్రఖ్యాత నేపథ్య గాయకుడు దివంగత పీబీ శ్రీనివాస్ మనుమడు. ‘ఆకాశవాణి’ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన షూటింగ్‌లో భాగంగా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

 

 మా నాన్న ఫణీందర్ ఛార్టర్‌‌డ అకౌంటెంట్. నిత్యం రామాయణం కథను చెబుతూండేవారు. అది వినీవిని నేనే ఆ కథ చెప్పే స్థాయికి ఎదిగాను. ఈనోటా, ఆనోటా నా గురించి విన్న దర్శకుడు గుణశేఖర్ ‘బాల రామాయణం’ సినిమాలో నాకు వాల్మీకి పాత్ర ఇచ్చారు. అదే సినిమాలో బాల హనుమంతునిగా కూడా నటించాను. అప్పుడు నా వయసు ఐదేళ్లు. అదే నా మొదటి సినిమా. అదురూబెదురూ లేకుండా నటించాను.

 

 తరువాత ప్రియరాగాలు, సూర్యవంశం ఇలా సుమారు 25 సినిమాల్లో బాలనటుడిగా చేశాను. సూర్యవంశం హిందీ వెర్షన్‌లో మరో బాల నటుడు అమితాబ్ ఎదురు కాగానే ఏడవటం మొదలుపెట్టాడు. తరువాత ఆ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ‘చూడు టైగర్, నటన అంటే చేతులు తిప్పడం కాదు. కళ్లతో చేయవలసిన పని’ అని అమితాబ్ అనేవారు. ఆయన ఇచ్చిన సలహా నాకు ఎప్పటికీ శిరోధార్యం.

 

 బాల నటునిగా జగపతిబాబు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో నటించాను. బాలకృష్ణతో ఓ జానపద సినిమా చేశాను కానీ, నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఒకటి నుంచి ఐదో తరగతి చదివినప్పుడు రోజుకు రెండు మూడు షెడ్యూల్స్ కూడా చేసేవాడిని. తాతగారు పీబీ శ్రీనివాస్ నన్ను నటుడిగా చూడాలనుకునేవారు. ‘నటుడికి పరిశీలన చాలా అవసరం. ఒక ప్రత్యేక బాణీ కూడా ఉండాలి’ అని అనేవారు. ఆయన ఆశీస్సులు నిజమవుతాయని, తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top