
ఇక్కడ పురుషుల డామినేషన్ ఎక్కువ
చిత్రపరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువని నటి జ్యోతిక వ్యాఖ్యానించారు.
తమిళసినిమా: చిత్రపరిశ్రమలో పురుషుల డామినేషన్ ఎక్కువని నటి జ్యోతిక వ్యాఖ్యానించారు. ఈమె 1999లో నటిగా కోలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. కథానాయకిగా స్టార్ హీరోలందరితోనూ నటించిన జ్యోతిక నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు విరామం ఇచ్చారు. కొంత కాలం భర్త, పిల్లలు అంటూ సంసార జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన ఈమెకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా 36 వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ అయిన జ్యోతిక ఆ చిత్ర విజయంతో తన నట కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా మగళీర్ మట్టుం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుట్రం కడిదల్ చిత్రం ఫేమ్ బ్రహ్మ దర్శకత్వంలో నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. జ్యోతిక మాట్లాడుతూ మగళీర్ మట్రుం రోడ్‌ట్రిప్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు.
అలాంటి ట్రిప్‌లో తన అత్తమామలను, స్నేహితులను తను ఎలా చూసుకుందన్న ఇతివృత్తంతో సాగే చిత్రం అని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ తెరపైకి రానటువంటి కథతో వస్తున్న చిత్రం మగళీర్ మట్టుం అని చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానని, సూర్యకు కూడా నచ్చడంతో ఆయన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించడానికి సిద్ధం అయ్యారని తెలిపారు. చిత్ర తొలి రోజు షూటింగ్‌ను బుట్టపడవలో చేశామన్నారు. ఆ సన్నివేశంలో తను సరిగా డైలాగ్స్ చెప్పలేకపోతే వారే తనను కంఫర్ట్ జోన్‌కు తీసుకొచ్చారని తెలిపారు. ఈ చిత్రంలో తాను బుల్లెట్ నడిపే సన్నివేశం చోటు చేసుకుంటుందన్నారు.
దియా గొప్పగా ఫీలయ్యేది
తన కూతురు దియాను బుల్లెట్‌పై స్కూల్‌కు తీసుకెళ్లి డ్రాప్ చేయడంతో తన చాలా గొప్పగా ఫీలయ్యేదని చెప్పారు. తమ కొడుకు దేవ్‌కు మాత్రం సూర్యనే హీరో అని తెలిపారు. అయితే నాచ్చియార్ చిత్రం చూసిన తరువాత దేవ్ తనను కూడా హీరోగా భావిస్తాడనే నమ్మకం ఉందన్నారు.
ఇది పురుషాధిక్య పరిశ్రమ
ఒక్క విషయం మాత్రం చెప్పాలి. పురుషాధిక్యం ఎక్కువ గల పరిశ్రమ ఇది. హీరోలు నటించిన ఎంత చెత్త సినిమా అయినా నాలుగైదు రోజులు ఆడుతుందన్నారు. అదే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అయితే ఎంత మంచి కాన్సెప్ట్‌తో రూపొందినా ఇక వారం తరువాతే వసూళ్లను రాబట్టుకోగలుగుతుందన్నారు. అదే విధంగా మహిళా రచయితలకు ప్రాముఖ్యత తక్కువేనన్నారు. ఈ పరిస్థితి మారాలని వ్యాఖ్యానించారు. సుధ కొంగర లాంటి మహిళా దర్శకురాలికి నటుడు మాధవన్ అవకాశం కల్పించపోతే ఇరుదుచుట్రు లాంటి విజయవంతమైన చిత్రం వచ్చేది కాదన్నది గుర్తించాలని జ్యోతిక పేర్కొన్నారు.