అక్రమ డంప్‌ నిర్వాహకులపై చర్యలు

Minister KTR Video Conference with District Collector - Sakshi

ప్రజా అవసరాలకనుగుణంగా ఇసుక డిపోల ఏర్పాటు

అక్రమాలకు పాల్పడే ఏజెంట్లపై పీడీ యాక్ట్‌

‘ముద్ర’ అమలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం

వీసీలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: అక్రమంగా ఇసుక డంప్‌లు ఏర్పాటుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుండి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, గనులు భూగర్భ శాఖ zడైరెక్టర్‌ బీఆర్‌వీ సుశీల్‌కుమార్‌లతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. స్యాండ్‌ ట్యాక్సీని అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజా అవసరాల మేరకు సమస్య పరిష్కరించేలా ఇసుక డిపోలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక డిపోల ఏర్పాటుకు కలెక్టర్ల ద్వారా టీఎస్‌ఎండీసీకి ప్రతిపాదనలు పంపితే 48 గంటల్లో అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇసుకను సొంత అవసరాలకు వాడుకునేందుకు తీసుకెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని, ఇసుకను డంపులుగా ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపట్టే వారితో పాటు వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్యాండ్‌ ట్యాక్సీ అమలులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెట్టి నిబంధనల ప్రకారం నడుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్యాండ్‌ ట్యాక్సీ అమలులో రీచ్‌ల వద్ద ధరలు ఒకేలా ఉంటాయని, రవాణా చార్జీల్లో మాత్రమే మార్పు ఉండాలని సూచించారు. ఇసుక సమస్య ఉన్న దగ్గర మినరల్‌ రిసోర్సెస్‌కు అనుగునంగా టీఎస్‌ఎండీసీ, మైనింగ్‌ శాఖల సంయుక్త ఆద్వర్యంలో పరివాహక ప్రాంతాన్ని గుర్తించి నివేదికను పోలీసు, రెవెన్యూ శాఖలకు అందజేయాలని తెలిపారు. ఆ తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా ఇసుక డిపోల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని మంత్రి వివరించారు.

జిల్లాలో సమస్య తీవ్రత
జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్‌ రొనల్డ్‌రోస్‌ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. టీఎస్‌ఎండీసీ ద్వారా డిపోలకు సరఫరా చేయడం ద్వారా ధరల భారం పెరుగుతోందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్‌లో ఇసుక సమస్య కారణంగా ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని, కార్మికులు సైతం ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇసుక కొరత కారణంగా రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సైతం స్థానిక నాయకుల నుండి ఒత్తిడి వస్తోందని తెలిపారు.

సీనరేజీ చార్జీలతో రోడ్ల మరమ్మతు
టీఎస్‌ఎండీసీ ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చిన సీనరేజీ చార్జీలను సంబంధిత రీచ్‌లు ఉన్న ప్రదేశాల్లో రోడ్ల మరమ్మతుకు, స్థానిక అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. టీఎస్‌ఎండీసీ ద్వారా జిల్లాలో సీనరేజీ చార్జీలు రూ.84 లక్షలు జమ అయ్యాయని కలెక్టర్‌ చెప్పగా మంత్రి ఇలా స్పందించారు. ఇసుక రీచ్‌ల నుండి వాహనాల్లో ఇసుక తరలించే క్రమంలో రోడ్లు విపరీతంగా దెబ్బతిని ఉంటాయని, స్థానికుల విజ్ఞప్తి మేరకు అక్కడే నిధులు అక్కడే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మినరల్‌ ఫండ్‌కు సంబంధించిన మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రెండు వారాల్లో ఆదేశాలిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ఖర్చు చేయొద్దని స్పష్టం చేశారు.

నకిలీ గల్ఫ్‌ ఏజెంట్లపై పీడీ యాక్టు
ప్రభుత్వం గుర్తించిన గల్ఫ్‌ ఏజెంట్లు కాకుండా ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ నుండి ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు చర్చకు వచ్చిందన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఇంకా మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ముద్ర అమలుపై..
ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర రుణాల మంజూరు, అమలుపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీ పథకాల అమలు, పీఎంఈజీపీ రుణాలపై నెలకోసారి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. సిక్‌ అవుతున్న పరిశ్రమలను ముందుగానే గుర్తించి మూతపడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీకి కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో పాటు ఎస్పీ డి.అనురాధ, డీఎస్పీ భాస్కర్, స్యాండ్‌ ట్యాక్సీ సంస్థ రాష్ట్ర అధికారి నిశ్చల్, మైనింగ్‌ ఏడీ ప్రవీణ్‌రెడ్డి, పరిశ్రమల కేంద్ర జీఎం సురేష్‌కుమార్‌ హాజరయ్యారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top