వేల సార్లు రేప్‌...ఎన్నోసార్లు అబార్షన్లు

Please, Let Me Go: she was raped by THOUSANDS of men - Sakshi

లండన్‌ : 14వ ఏట నుంచి 15 ఏళ్ల పాటు ఆమె జీవితం ఓ నరకయాతన. వేలాది మంది ఆమెను రేప్‌ చేశారు. 11 సార్లు గర్భవతి అయ్యారు. ఏడు సార్లు అబార్షన్లు చేయించుకున్నారు. అయినప్పటికీ ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. రాక్షస తండ్రులకు పుట్టిన ఆ ఇద్దరు బిడ్డలను ప్రేమించడంలో శేష జీవితాన్ని గడిపేందుకు ఆమె ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. (సాక్షి ప్రత్యేకం) ఆమె పేరు కైతిలిన్‌ స్పెన్సర్‌. ఆమె వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆమె అసలు పేరును బహిర్గతం చేయడం లేదు.

స్పెన్సర్‌కు 14 ఏళ్లున్నప్పుడు తొలిసారి ఆమెపై లైంగిక దాడి జరిగింది. అలా అమె ఇంట్లోనే మొదలైన లైంగిక దాడి నిరాటంకంగా 15 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఎన్నో ముఠాల చేతులు మారారు. ఒక చోటు అని లేకుండా దేశం నలుమూలల లైంగిక దోపిడీకి గురయ్యారు. పక్కను పంచుకున్న విటుల సంఖ్యకు లెక్కలేదు. రోజుకు నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఒక్కోసారి పది మంది, ఒక్కోసారి అంతకుమించి క్యూలు కూడా కట్టేవారట. అంతమందిని తట్టుకునేందుకు మద్యాన్నే కాదు, డ్రగ్స్‌ కూడా ఇచ్చేవారట.

ఆ విషాదగాథను ఆమె మాటల్లోనే చెప్పాలంటే....‘ ఈ 15 ఏళ్ల కాలంలో వేలాది మంది.. వేల సార్లు నన్ను రేప్‌ చేసి ఉంటారు. నన్ను ఊరూరా ఎత్తుకెళ్లి తిప్పిన ముఠాల్లో భారతీయులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇరాక్, ఇరాన్‌ దేశస్థులే ఎక్కువ ఉన్నారు. ఓ స్థానిక బ్రిటిష్‌ నాయకుడు కూడా ఉన్నారు. ఈ ముఠాలతో రాజకీయ నాయకులకు సంబంధం ఉండడం ఏమిటని ఆశ్చర్యపడ్డాను. (సాక్షి ప్రత్యేకం) సెక్స్‌ రాకెట్‌ ముఠా పట్టుపడిందనే వార్తలను అప్పుడప్పుడు పత్రికల్లో చూసేదాన్ని. 15,16 మందితో కూడిన ముఠా పట్టుపడిందని పోలీసులు వివరించేవారు. ఒక్కో ముఠాలో అంతకంటే ఎక్కువ మందే ఉంటారు. ఎప్పుడు కూడా వారికి సరైన శిక్షలు పడేవి కావు.

నాకు చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ అంటే ఇష్టం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పని చేసేవారు. వారికి శ్రమ తగ్గించడం కోసం త్వరగా జీవితంలో స్థిరపడాలనుకున్నాను. ఓ రోజు మోడలింగ్‌ ప్రకటన చూసి ఫోన్‌ చేశాను. అవతలి వ్యక్తి ఇంటికొచ్చి ఫొటోలు తీస్తానని చెప్పాడు. నేను సరేనన్నాను. అప్పటికే పెళ్లి అయి పిల్లలున్న ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. (సాక్షి ప్రత్యేకం) నన్ను భయపెట్టి, బెదిరించి రేప్‌ చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేశాడు. ఇంటికి వస్తున్నాను. బయటకు వెళ్దాం రెడీగా ఉండమని చెప్పాడు.

నేను రాను, పోలీసులకు చెబుతానన్నాను. చెబితే చంపేస్తానన్నాడు. ఇంటికి వచ్చాడు. బెదిరించి కారులో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్‌ గదిలో ముగ్గురు రాక్షసులు కాచుకు కూర్చున్నారు. మూకుమ్మడిగా రేప్‌ చేశారు. అప్పటి నుంచి రోజూ రేప్‌కు బలవుతూ వచ్చాను. నా బాధను ఏ రోజుకారోజు డైరీలో రాసుకుంటూ వచ్చాను. ఓ రోజున ఆ డైరీని మా అమ్మ చూసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పోలీసు అధికారి వచ్చాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎక్కడ గిచ్చారు, ఎక్కడ గిల్లారు. ఎక్కడ కొరికారు చూపించంటూ భయపెట్టారు. (సాక్షి ప్రత్యేకం) ఇదేమిటని ప్రశ్నిస్తే.. కోర్టులో ఇలాగే అడుగుతారని, అక్కడ సరైన సమాధానం చెప్పడానికి ముందస్తు శిక్షణ అని అన్నారు. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి మా అమ్మ దగ్గరికెళ్లి ‘మీ కూతురు ఈ ప్రాంతంలో పేరు మోసిన వేశ్య’ అంటూ వెళ్లిపోయారు.

నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోనే వదిలేసి మరో ఇంటికి మారిపోయారు. కొంతకాలానికి నేనే హాస్టల్‌కు మారిపోయాను. అక్కడి నుంచి నా జీవితం మరింత భయానకంగా తయారయింది. బెదిరింపులు పెరిగాయి. విటుల దాడి పెరిగింది. వారి వికృత చేష్టలు పెరిగాయి. చివరకు లైంగిక జబ్బులు సోకడంతో నన్ను ముఠా సభ్యులు దూరంగా ఉంచారు. విటులు రావడం తగ్గి పోయింది. ఈ పరిస్థితుల్లోనే నేను పోలీసు స్టేషన్‌కు వెళ్లి నాకు తెలిసిన మానవ అక్రమ రవాణా ముఠాల గురించి ఫిర్యాదు చేశాను. వాళ్లను గుర్తు పట్టడంలో పోలీసులకు సహకరిచాను’ అని స్పెన్సర్‌ వివరించారు.

మానవ అక్రమ రవాణా ముఠా కేసుల్లో తొలుత ఆమెను లండన్‌ పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా చేర్చారు. అయితే ఆమెకు మతిపరుపు పెరగడం, ఒకసారి చెప్పినదానికి, మరోసారి చెప్పిన దానికి పొంతన లేకుండా పోవడంతో ఆమెను సాక్షిగా తొలగించారు. ఆ తర్వాత ఆమె ఓ పబ్లిషర్‌ సాయంతో స్థిరపడి తన జీవితాన్ని పుస్తకంగా రాశారు. (సాక్షి ప్రత్యేకం) ‘ప్లీజ్‌ లెట్‌ మీ గో’ అనే పేరుతో ఇప్పుడు ఆ పుస్తకం మార్కెట్‌లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బానిసలుగా పనిచేస్తుంటే వారిలో 90 శాతం మంది మహిళలేనని, వారిలో కూడా బాలికలే ఎక్కువ మందని, వారిలో 99 శాతం మంది సెక్స్‌ బానిసగా పనిచేస్తున్నారని, మానవ అక్రమ రవాణా ముఠాల కారణంగానే వారు బానిసలుగా మారుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంఘంతో కలసి సర్వే నిర్వహించిన ‘వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌’ ఇటీవల ఓ నివేదికలో  వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top