
నాసా పంపిన తాజా చిత్రం
వాషింగ్టన్: అనుకున్నంతా అయ్యింది. ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సాఫ్ట్ల్యాండింగ్‌కు బదులు బలంగా కూలిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ధారించింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇటీవల ప్రయాణించిన రీకానిసెన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలను విడుదల చేసింది. 7వ తేదీన జాబిల్లికి సుమారు 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్‌కు ఇస్రోతో సమాచార సంబంధాలు తెగిపోవడం తెలిసిందే.
విక్రమ్ కచ్చితంగా ఎక్కడ పడిపోయిందో గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందని, రీకానిసెన్స్ ఆర్బిటర్ సుమారు 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఫొటో తీయడం ఇందుకు కారణమని నాసా శాస్త్రవేత్త జాన్ కెల్లర్ తెలిపారు. విక్రమ్ ల్యాండింగ్ ప్రాంతం వద్ద వెలుతురు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అక్టోబరు 14న మరోసారి ఆర్బిటర్ ఫొటోలు తీస్తుందని తెలిపారు. విక్రమ్‌తోపాటు, రోవర్ ప్రజ్ఞ్యాన్ 14 రోజుల పాటు మాత్రమే పనిచేస్తాయని ఇస్రో స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విక్రమ్ 7వ తేదీ కూలిపోగా దాంతో మళ్లీ సంబంధం ఏర్పరచుకునేందుకు 21వ తేదీ తుది గడువు. నాసా రికానిసెన్స్ ఆర్బిటర్ ఈ నెల 17 విక్రమ్ ల్యాండింగ్ ప్రాంతం వద్ద హై రెజల్యూషన్ ఫొటోలు తీయగా వాటిని విశ్లేషించేందుకు మరో పది రోజల సమయం పట్టింది. అప్పటికే ఆ ప్రాంతంలో చీకటి పడటం వల్ల ల్యాండర్‌ను స్పష్టంగా గుర్తించడం కష్టమవుతుందని, కెల్లర్ అంటున్నారు.