భారత్‌లోనూ ఎస్‌సీఎల్‌ కదలికలు...!

India Will Also Have SCL Movements - Sakshi

 ఐరోపా నుంచి ఆసియా దాకా రాజకీయ క్లయింట్లు

అయిదు ఖండాలు...32 దేశాలు..వందకు పైగా ఎన్నికల ప్రచారాలు.. ఇదీ డేటా లీక్‌  వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ  కేంబ్రిడ్జి అనాలిటికా (సీఏ)కు మాతృసంస్థగా ఉన్న స్ట్రేటజిక్‌ కమ్యు నికేషన్‌ లాబరేటరీస్‌ (ఎస్‌సీఎల్‌) గ్రూపు ట్రాక్‌రికార్డ్‌. ఎన్నికలకు సంబంధించి వివిధ దేశాల్లో తాము నిర్వహించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ సంస్థే ప్రకటించుకున్న  విషయమిది.  2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచార వ్యూహాలకు  ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారాన్ని వారికి తెలియకుండా ఉపయోగించినట్టు, బ్రెగ్జిట్‌ సందర్భంగా బ్రిటన్‌లో  నిర్వహించిన పాత్రపై ఇప్పటివరకు సీఏపైనే ఫోకసంతా కేంద్రీకృతమైంది.

అయితే 2013 నుంచి ఎస్‌సీఎల్‌ కంపెనీ డాక్యుమెంట్లు విశ్లేషించాక ఓ ఆన్‌లైన్‌ ఇంగ్లిష్‌ వెబ్‌పత్రిక  భారత్‌తో సహా వివిధ దేశాల్లో ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో ఈ సంస్థ ప్రమేయాన్ని వెల్లడించింది. ఐరోపా, ఉత్తర,దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల వ్యాప్తంగా 32 దేశాల్లో ఎస్‌సీఎల్‌ పనిచేసినట్టు తెలిపింది. ఆయా దేశాల్లో క్లయింట్లుగా ఉన్న రాజకీయనాయకులు, పార్టీల అవసరాలను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సర్వీస్‌ను ఈ సంస్థ అందజేసింది.

భారత్‌లో..
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారత్‌లో 300 మంది పర్మినెంట్‌ సిబ్బంది, 1,400 కన్సల్టెంట్‌ స్టాఫ్‌ను ఎస్‌సీఎల్‌  నియమించినట్టు ఆ సంస్థ డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. తమది అత్యంత అధునాతన రాజకీయ పరిశోధన, డేటా కేంద్రంగా అభివర్ణిస్తూ ఎన్నికలకు పూర్వమే  ప్రధాన రాజకీయపార్టీల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది.ఈ ప్రతిపాదిత ‘ఆపరేషన్‌ సెంటర్‌’లో సీనియర్‌ లాయర్లు, మీడియా పర్యవేక్షక వృత్తినిపుణులు, పరిశోధనాధారిత సమాచారాన్నిచ్చే నిపుణులు, పార్టీ కార్యకర్తలకు సలహాలు, సూచనలిచ్చే బృందాలు,సిబ్బందితో సేవలు అందించనున్నట్టు తెలిపింది. తమ క్లయింట్లు మేనేజ్‌ చేసుకునే విధంగా యాప్‌ తయారుచేసి ఇస్తామని, దాని ద్వారా ఆయా సర్వీసులు పొందవచ్చునని సూచించింది.

దీని ద్వారా ప్రచారవ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేసి సంబంధిత పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగేలా దోహదపడేలా ఏర్పాట్లు చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎస్‌సీఎల్‌ లేదా సీఏ సంస్థల సేవలను దేశంలోని ఏ రాజకీయపార్టీ అయినా ప్రత్యక్షంగా ఉపయోగించుకుందా లేదా అన్నది ఇంకా స్పష్టంకాలేదు. ఇలాంటి సెంటర్లనే బ్రిటన్, థాయ్‌లాండ్, కెన్యా, ఇండోనేషియాలలో నెలకొల్పినట్టు ఎస్‌సీఎల్‌ డాక్యుమెంట్‌ స్పష్టం చేస్తోంది.

దేశంలో ఎస్‌సీఎల్‌ అడుగు జాడలు...
భారత్‌లో ఒకే ఒక ప్రాజెక్టు గురించి తన వెబ్‌సైట్‌లో సీఏ సంస్థ వెల్లడించింది. అయితే మనదేశంలో హైదరాబాద్‌ మొదలుకుని బెంగళూరు, కోల్‌కతా, పట్నా, పుణె, ఇండోర్, అహ్మదాబాద్, కటక్, ఘజియాబాద్, గువహటి నగరాల్లో ఎస్‌సీఎల్‌ కార్యాలయాలున్నట్టు వెల్లడైంది. 2003 నుంచి ఈ గ్రూపు కనీసం 8 ‘అసైన్‌మెంట్ల’పె పనిచేసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎస్‌సీఎల్‌  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేక సర్వేలు నిర్వహించినట్లు ఆ సంస్థ డాక్యుమెంట్‌ను బట్టి తెలుస్తోంది.

  • 2012లో ఉత్తరప్రదేశ్‌లో ఓ జాతీయపార్టీ కోసం కులాలవారీగా జనాభా వివరాల సేకరణ
  • 2011లో యూపీ వ్యాప్తంగా కుటుంబాల (హోస్‌హోల్డ్స్‌) వారీగా  20 కోట్ల మంది ఓటర్ల కులాలను బట్టి ఓటర్ల గుర్తింపు
  • 2010 బిహార్‌ ఎన్నికల సందర్భంగా జేడీ(యూ) పార్టీ కోసం ఎన్నికల పరిశోధన, వ్యూహాల రూపకల్పన
  • 2009 లోక్‌సభ ఎన్నికలపుడు పలువురు అభ్యర్థుల ప్రచార నిర్వహణ
  • 2007లో యూపీలో ఓ జాతీయపార్టీ కోసం పూర్తిస్థాయి రాజకీయ సర్వే నిర్వహణ
  • 2007లో కేరళ, బెంగాల్, అసోం, బిహార్, జార్ఘండ్, యూపీలలో ఎన్నికల ప్రచారానికి పరిశోధన
  • 2003 మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఊగిసలాటలో ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఓ జాతీయ పార్టీ కోసం  అధ్యయనం, ఓపీనియన్‌ పోల్‌ నిర్వహణ
  • 2003 రాజస్థాన్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీ సంస్థాగత బలం, ఆ రాష్ట్రంలో ఓటు వేసేవారి ప్రవృత్తి, అలవాట్లు, రాజకీయంగా చురుకుగా ఉన్న వ్యక్తుల  ప్రవృత్తి పై అధ్యయనం

అయితే ఎస్‌సీఎల్‌కు గతంలో భాగస్వామిగా ఉన్న అవ్‌నీష్‌రాయ్‌ మాత్రం  ఈ ప్రాజెక్టులు తానే చేపట్టినట్టు, ఈ పరిశోధనపై  ఎస్‌సీఎల్‌ ఆమోదముద్ర వేసిందని చెబుతున్నారు.

ఇవీ సేవలూ...
భారత్‌లో రిసెర్చి, డేటా హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయపార్టీలకు వివిధరకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎస్‌సీఎల్‌ 2014 ఎన్నికల సందర్భంగా పేర్కొంది.

రాజకీయపార్టీల మద్దతుగా
ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించి ఓటింగ్‌ సందర్భంగా ప్రభావితం చేసేందుకు వీలుగా రాజకీయపార్టీలకు మద్దతుగా పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడం, ఓటర్ల సమీకరణ, న్యాయపరమైన మద్దతు, ఎన్నికల ప్రణాళిక, నిర్వహణ, మీడియా పర్యవేక్షణ, పార్టీ కమ్యూనికేషన్ల వ్యవస్థ పటిష్టం చేయడం...

రాజకీయ పరిశోధన సర్వీసులు
కులాలపై పరిశోధన, ఓటర్ల ప్రవృత్తిపరంగా పోలింగ్, పార్టీ ఆడిట్‌ నిర్వహణ,ప్రభుత్వ కార్యక్రమాలు, సమస్యల విశ్లేషణ, అభ్యర్థుల ఎంపికపై పరిశోధన, చారిత్రకాంశాల విశ్లేషణ, ఎన్నికల్లో విజయంపై ముందస్తు అంచనాలు, జోస్యం వంటివి...

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top