సిరియా వద్ద ఉన్న రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకువచ్చేలా రష్యాతో కుదిరిన కీలక ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతించారు.
వాషింగ్టన్: సిరియా వద్ద ఉన్న రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకువచ్చేలా రష్యాతో కుదిరిన కీలక ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతించారు. దౌత్య ఒప్పందానికి అనుగుణంగా సిరియా అధ్యక్షుడు అసాద్ నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జెనీవాలో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్జీ లవ్రోవ్ సమావేశమై సిరియా వద్ద నిల్వ ఉన్న రసాయనిక ఆయుధాల గురించి చర్చించారు.
తాజా పరిణామాలపై ఒబామా మాట్లాడుతూ.. సిరియా తమ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోందని అన్నారు. ఈ దిశగా తాము పురోగతి సాధించామని చెప్పారు. రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా వాటిని ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ఒబామా తెలిపారు. ఐక్యరాజ్య సమితి, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్తో కలసి సిరియా వ్యవహరాలను అమెరికా సమీక్షిస్తోంది. సిరియాలో జరిగిన రసాయనిక దాడుల్లో 1400 మంది మరణించారు.