భారత్‌కు బాసటగా ప్రపంచ దేశాలు

European Union Response On IAF Attack - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళాలు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడికి ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. భారత దళాల దాడులను యూరోపియన్‌ యూనియన్‌ సమర్థించింది. పాకిస్తాన్‌ భూభాగంపై గల ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని ఈయూ పేర్కొంది. ఉగ్రవాదాన్ని అంతంచేయడంలో భారత చర్యను తాము సమర్థిస్తున్నామని ఈయూ అధికార ప్రతినిధి మాజా కొసిజనీక్‌ తెలిపారు. భారత వైమానిక దాడులపై ఆస్ట్రేలియా స్పందించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడం అత్యవసరమని ఆ దేశ విదేశాంగ మంత్రి మారిజ్ పేనే అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌.. వెంటనే వాటిని నిర్మూలించాలని  ఆదేశించారు. 

పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ సహా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ తక్షణమే చెక్ పెట్టాలని ఆస్ట్రేలియా కోరింది. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మారిజ్ పేనే పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి, ఆ తరువాత భారత వైమానిక దాడుల నేపథ్యంలో ఆమె స్పందిస్తూ..
 
‘‘పాకిస్తాన్‌లో స్థావరం పొందుతున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను నిర్మూలించేందుకు పాక్‌ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేయాలి. లష్కరే తొయిబా మూకలను కూడా తుదముట్టించాలి. పాక్ గడ్డపై కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఇకపై చట్టపరంగా, భౌతికంగా ఏమాత్రం చోటివ్వకూడదు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించి, వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇదొక్కటే మార్గం...’’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు దిగరాదని భారత్, పాకిస్తాన్‌లను ఆస్ట్రేలియా కోరింది. కాగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్‌ మంచిపని చేసింది అఫ్గానిస్తాన్‌ వ్యాఖ్యానించింది. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానికి దళాలు చేసిన దాడులన అఫ్గాన్‌ సమర్థించింది. ఇరు దేశాలు సమయం పాటించాలని చైనా సూచించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top