చావుకు దగ్గరవుతున్న డెడ్‌సీ | Dead sea reaching death point, jordan is the culprit | Sakshi
Sakshi News home page

చావుకు దగ్గరవుతున్న డెడ్‌సీ

Nov 24 2016 2:36 PM | Updated on Sep 4 2017 9:01 PM

చావుకు దగ్గరవుతున్న డెడ్‌సీ

చావుకు దగ్గరవుతున్న డెడ్‌సీ

పేరుకు తగ్గట్లుగా డెడ్‌సీ ఇప్పుడు చావుకు దగ్గరవుతోంది.

ఈ భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఏమో జరుగుతోంది. అక్కడ ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్‌ మధ్యనున్న డెడ్‌సీ ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్‌ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోతోందని 'ఎకోపీస్‌ మిడిల్‌ ఈస్ట్‌' గ్రూప్‌నకు చెందిన పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
డెడ్‌సీ అంటే సముద్రం కాదు.. ఓ సరస్సు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతాయన్నది వారి నమ్మకం. కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్‌ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు. ఈ సరస్సు నీటిలో 34 శాతం ఉప్పు ఉండటం వల్ల ఇందులో మనుషులు మునగరు... తేలుతారు. మామూలు సముద్రాల్లో ఉండే ఉప్పుకన్నా ఇందులో 9.6 శాతం ఉప్పు ఎక్కువ. ఈ  నీటిని నోట్లో పోసుకుంటే ఉప్పులాగా కాకుండా విషంలా ఉంటుంది. ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌సీ అని పేరు వచ్చింది. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది. 
 
ఇందుకు బాధ్యత ఒక్క దేశానిది కాదు. దానిచుట్టూ ఉన్న ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాలది. ఈ సరస్సు తరిగిపోవడానికి ప్రధాన బాధ్యత జోర్డాన్‌ దేశానిదని చెప్పవచ్చు. డెడ్‌సీ సరస్సుకు నీరు వచ్చి చేరేది ఎక్కువగా జోర్డాన్‌ రివర్‌ నుంచి. అయితే కొన్నేళ్ల క్రితం ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాల కోసం జోర్డాన్‌ నది నుంచి పైప్‌లైన్‌ వేసి నీటిని మళ్లించడం వల్ల ఆ నది నుంచి డెడ్‌సీకి నీరొచ్చే మార్గం నిలిచిపోయింది. దానికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే వేడి, పొడి వాతావరణం కూడా నీరు ఎక్కువగా ఆవిరై పోవడానికి కారణం అవుతోంది. దీన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్‌ దేశాల మధ్య 1994లోనే 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతదూరం వచ్చి ఆగిపోయాయో ప్రపంచ దేశాలకు తెలియదు. 
 
ఈ సరస్సు పరిస్థితిని ప్రపంచం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో పలు దేశాలకు చెందిన 30 మంది స్విమ్మర్లు ఈ ఏడాది మొదట్లో ఈ సరస్సులో తొమ్మిది మైళ్లు ఈదారు. కళ్లకు స్విమ్మింగ్‌ జోళ్లు కట్టుకున్నా యాసిడ్‌ పోసినట్లు కళ్లు భగభగ మండిపోయాయని కొంత మంది స్విమ్మర్లు తెలిపారు. మోరిజ్‌ కుస్ట్‌నర్‌ అనే పర్యావరణ ఫొటోగ్రాఫర్‌ 'ద డయ్యింగ్‌ డెడ్‌ సీ' పేరిట ఇప్పుడు సిరీస్‌ తీస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement