
సర్కారీ స్కూళ్లు సూపర్ హిట్
పదో తరగతి ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు.
టెన్త్ ఫలితాలు విడుదల.. 84.15 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు. టెన్త్ పరీక్షలు రాసిన బాలురులో 82.95 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 2.42 శాతం అధికంగా 85.37 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సగటున 84.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,33,701 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,07,938 మంది, ప్రైవేటుగా పరీక్షలకు హాజరైనవారు 25,763 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,27,414 మంది (84.15 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది (85.63 శాతం) కంటే ఈసారి 1.4 శాతం ఉత్తీర్ణత తగ్గడం గమనార్హం.
ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన ఉత్తీర్ణత
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 2,005 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో 1,200 ప్రైవేటు పాఠశాలలుకాగా.. 800 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మిగతావి గురుకులాలు. మొత్తంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలిచాయి. ఇక బీసీ సంక్షేమ గురుకులాలు 94.63 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలు 69.65 శాతం, కేజీబీవీలు, జెడ్పీ, ఎయిడెడ్, ఆశ్రమ పాఠశాలలు 84.15 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 28 ఉన్నాయి. అందులో 20 ప్రైవేటు పాఠశాలలుకాగా.. 5 ఎయిడెడ్, 2 జెడ్పీ, ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి.
జగిత్యాల టాప్
జిల్లాల వారీగా ఫలితాలను చూస్తే జగిత్యాల జిల్లా 97.35 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. 93.73 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. 64.81 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. కాగా ప్రైవేటుగా టెన్త్ పరీక్షలకు హాజరైన 25,763 మంది విద్యార్థుల్లో 35.92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
‘జీరో’ప్రభుత్వ స్కూళ్లు లేకుండా చర్యలు: కడియం
వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలలన్నీ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడతామని, సున్నా ఫలితా లు లేకుండా చూస్తామని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాల, రెండు జెడ్పీ స్కూళ్లలో సున్నా ఫలితా లు వచ్చాయని, అయితే వాటి లో ఒకచోట ఇద్దరే విద్యార్థులు, మరోచోట నలుగురు, ఇంకోచోట 9 మందే ఉన్నా రని.. వారే పాస్ కాలేదని చెప్పారు. ఇలా కొద్దిమందే పిల్లలున్నా.. తరగతులను ఎలా కొనసాగించార న్నది సమీక్షించి తగిన చర్యలు చేపడ తామని.. అవసరమైతే సమీప పాఠశా లల్లో విలీనం చేస్తామని తెలిపారు.
‘లెక్కలు’ తప్పాయి!
టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానివారిలో చాలా మంది గణితం సబ్జెక్టులోనే ఫెయిలయ్యారు. పరీక్షలకు 5,07,938 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకాగా.. గణితంలో 4,46,183 మందే పాసయ్యారు. అంటే 61,755 మంది ఫెయిలయ్యారు. గతేడాదితో పోల్చినా గణితంలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది గణితంలో 88.93 శాతం మంది ఉత్తీర్ణులుకాగా.. ఈసారి ఉత్తీర్ణులు 87.87 శాతమే. ఇక ఫిజిక్స్ పేపరు కఠినంగా రావడంతో జనరల్ సైన్స్‌లో 29,483 మంది ఫెయిలయ్యారు.
బీసీ గురుకులాలు ముందంజ
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల నుంచి పదోతరగతి పరీక్షలకు 1,079 మంది విద్యార్థులు హాజరుకాగా... అందులో 1021 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 94.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 18 గురుకులాలకుగాను 4 గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.
వెనుకబడిన ఇతర గురుకులాలు
బీసీ గురుకులాలు మినహా ఇతర గురుకులాలు గతేడాది కంటే తక్కువ ఫలితాలు సాధించా యి. 125 సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి పరీక్షలకు హాజరైన వారిలో 89.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. గిరిజన సంక్షేమ గురుకులాలకు సంబంధించి 84.15 శాతం పాసయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకులాల విభాగంలో 20 గురుకులాలు వంద శాతంఫలితాలు సాధించాయి.
ఇంగ్లిషు మీడియంలో ఇరగదీశారు!
టెన్త్ ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిషు మీడియంవారు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. విడిగా చూస్తే ఇంగ్లిషు మీడియంలో గతేడాది కన్నా కొంత ఉత్తీర్ణత తగ్గినా.. ఈ సారి తెలుగు మీడియం కంటే ఏకంగా 10 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంవారు 78.66 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఇంగ్లిషు మీడియంవారు 88.33 శాతం ఉత్తీర్ణత సాధించారు.