
రథ సారథులు వీరే..
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా,
కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా, ఖమ్మం కలెక్టర్ లోకేశ్‌కుమార్‌ను తిరిగి ఆయా జిల్లాల కలెక్టర్లుగానే కొనసాగించగా.. మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. మిగతా 26 జిల్లాలకు పూర్తిగా కొత్త వారిని కలెక్టర్లుగా, 31 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కలెక్టర్లు, ఎస్పీలుగా అవకాశం లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది జిల్లాలకు మహిళా కలెక్టర్లు నియామకమయ్యారు. ఇక రాజీవ్‌శర్మ కొత్త జిల్లాలకు నియమించిన కలెక్టర్లను ఉత్తర్వుల జారీకి ముందు సోమవారం సాయంత్రమే సచివాలయానికి పిలిపించుకుని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. మంగళవారం ఉదయం జిల్లాల ప్రారంభోత్సవం జరగగానే కొత్త కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరిస్తారు.
కాగా ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వాకాటి కరుణను వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా బదిలీ చేసినట్లు తెలిసింది. నల్లగొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి, కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్, ఆదిలాబాద్ కలెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డిలకు దసరా తర్వాత కొత్త పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇక వరంగల్‌తో పాటు మరో ఐదు నగరాలకు పోలీసు కమిషనర్లను కూడా నియమించారు.
కొత్త పోలీస్ కమిషనర్లు, డీసీపీలు..
వరంగల్ కమిషనర్ అకున్ సబర్వాల్; కరీంనగర్ కమిషనర్ కమలహాసన్‌రెడ్డి;సిద్దిపేట కమిషనర్ శివకుమార్;నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ; రామగుండం కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్; ఖమ్మం కమిషనర్ షానవాజ్ ఖాసీం; సెంట్రల్ జోన్ డీసీపీ జ్యోయల్ డేవిస్; మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్; శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి