పరువు పోయింది... ఇప్పుడెలా? | tdp leaders discuss heavily over suspension issue of mla roja | Sakshi
Sakshi News home page

పరువు పోయింది... ఇప్పుడెలా?

Mar 17 2016 1:10 PM | Updated on Sep 3 2017 7:59 PM

పరువు పోయింది... ఇప్పుడెలా?

పరువు పోయింది... ఇప్పుడెలా?

హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కె రోజాను ఏడాది పాటు సస్పెండు చేస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడింది. అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రోజా వాయిస్ ను శాసనసభలో వినకూడదన్న ఆలోచనతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ నేతలకు హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. రోజాను సస్పెండు చేయడం ద్వారా మొత్తం ప్రతిపక్షాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలన్న రాజకీయ కుట్రకు హైకోర్టు తీర్పు ద్వారా బ్రేక్ పడటం టీడీపీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఆ పార్టీ నేతలు తర్జనభర్జనలో పడ్డారు. చంద్రబాబుతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమై ఇప్పుడేం చేయాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. న్యాయవాదుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్షంపై కక్ష సాధించడానికి అసెంబ్లీలో అధికార పక్షం తప్పుడు మార్గాల్లో పయనిస్తోందని తాజా హైకోర్టు తీర్పుతో తేలిపోయిందని, ఈ విషయం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సమావేశంలో పాల్గొన్న నేతలు వివరించారు. ఈ కేసుపై అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచన చేశారు. అలాగే హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటే ఏమవుతుందన్న విషయంపైనా నేతలు చర్చలు జరిపారు. తాజా ఉత్తర్వులపై అప్పీల్ చేయడం ద్వారా పరువు కాపాడుకోగలమా అన్న దిశగా ఆలోచన చేసిన తర్వాత ఆ విషయంలో మరో మహిళా సభ్యురాలితో అప్పీల్ చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు.

మరోవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అధికారపక్షంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. శాసనసభ లాబీల్లో ఎమ్మెల్యేల రకరకాలుగా చర్చించుకుంటున్నారు. శాసనసభ వేదికగా నిబంధనల పేరుతో తమకు సర్వాధికారాలు ఉన్నాయంటూ ఇంతకాలం చేసుకుంటున్న ప్రచారమంతా డొల్ల అని తేలడంతో పరువు పోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. నిబంధనల పేరుతోనో, శాసనసభలో సంఖ్యాబలం ఉందన్న నెపంతోనో, ప్రతిపక్షం గొంతు నొక్కాలన్న తమ నేతల ప్రయత్నాలు హైకోర్టు తీర్పుతో బెడిసికొట్టాయని ఒక సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు తమ ప్రతిష్ఠను దిగజార్చాయని పేర్కొన్నారు. ఏదైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంచిది కాదని ఇప్పటికైనా అధికారపార్టీ నేతలు గుర్తిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం అధికారం లేకపోయినా ఏడాది పాటు సస్పెండ్ చేసి అభాసుపాలు కాగా, స్పీకర్‌పై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ ప్రతిబంధకంగా మారిన నిబంధనలను సైతం తొలగించడంతోనే ప్రతిపక్షం విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎంత కసితో కక్ష సాధింపు ధోరణితో ఉందే అర్థమవుతోందని అన్నారు.

కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 340 నిబంధన కింద రోజాను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయగా, ఆ నిబంధన ప్రకారం ఆ సమావేశాలు ఎన్ని రోజులు సాగుతాయో అంతకాలం మాత్రమే సస్పెండు చేయాలని ఆ నిబంధన చెబుతోందని, ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని అదేరోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానిపై కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా రోజాకు ఇవ్వలేదు. తనను సస్పెండ్ చేసిన తీర్మానం ప్రతి కోసం మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకుని రోజాను శాసనసభ ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రోజా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు కేసును విచారించడం జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement