
‘విశ్వాసం’ మంటగలిసింది
విచక్షణ కోల్పోయిన కొందరు బాలురు కుక్క పిల్లల్ని కట్టేసి, మంటల్లో పడేసి సజీవంగా కాల్చేశారు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు..
- కుక్కపిల్లల సజీవ దహనం
- వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్
- ముషీరాబాద్ డివిజన్ దాయరకమాన్‌లో ఘటన
- జంతు ప్రేమికురాలి ఫిర్యాదుతో కేసు నమోదు.. పోలీసుల అదుపులో ముగ్గురు
హైదరాబాద్: విచక్షణ కోల్పోయిన కొందరు బాలురు కుక్క పిల్లల్ని కట్టేసి, మంటల్లో పడేసి సజీవంగా కాల్చేశారు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.. దీనిపై జంతు ప్రేమికురాలైన ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘విశ్వాసం’ మంటగలసిన ఈ పైశాచిక ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై మంగళవారం కేసు నమోదు కాగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ డివిజన్ దాయరకమాన్ పక్కన పఠాన్‌లకు చెందిన శ్మశానవాటిక ఉంది.
అందులో అనేక కుక్కలు జీవిస్తుంటాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పది మంది బాలురు చిన్న చిన్న కుక్క పిల్లల్ని పట్టుకున్నారు. వాటి కాళ్లను తాళ్లతో కట్టేసి ఒక దగ్గరకు చేర్చారు. వీరిలో కొందరు వాటిని బతికుండగానే కాల్చాలని చెప్పారు. దీంతో కర్రలు, కట్టెల్ని పొగేసి మంటపెట్టి మూడు కుక్క పిల్లల్ని సజీవంగా ఆ మంటల్లో వేశారు. మంటల్ని తట్టుకోలేని కుక్క పిల్లలు దీనంగా అరుస్తూ బయటకొచ్చేందుకు ప్రయత్నించినా.. వదిలిపెట్టకుండా మళ్లీ పట్టుకుని మంటల్లో వేయడంతో పాటు అవి బయటకు రాకుండా కర్రలతో అదిమిపెట్టి సజీవ దహనం చేశారు.
ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఆపై 2.22 నిమిషాలు, 2.50 నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ దృశ్యాలను నల్లకుంటలోని పద్మకాలనీకి చెందిన న్యాయవాది శ్రేయ పరోపకారి చూశారు. ఈమె పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ వలంటీర్‌గా, కేంద్ర పర్యావరణ శాఖ ఆధీనంలోని ఏడబ్ల్యూబీఐలో గౌరవ యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. పాశవికమైన ఈ ఉదంతంపై మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై బి.భాస్కరరావు ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్-1960’లోని 11(1)(ఎ), 11(1)(ఎల్) సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా ముగ్గురు బాలురను గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్‌లో వ్యాపారం చేసే ఓ వ్యాపారి కుమారుడి సెల్‌ఫోన్ నుంచి వీడియోలను రికవరీ చేశారు.
నాంపల్లి పోలీసులకు మరో ఫిర్యాదు
మరోవైపు ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో వీధి కుక్కల్ని కాలుస్తున్న వీడియోలతో మరో వ్యక్తి నాంపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. 22 సెకన్ల నిడివి ఉన్న సదరు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో రెండు కుక్కలపై కాల్పులు జరిపినట్లు ఆ వీడియోలో ఉంది. బహిరంగ ప్రదేశంలో లారీల మధ్య ఉన్న దాంతో పాటు ఓ ప్రాంగణంలో మరో శునకంపై కాల్పులు జరిపినట్లు రికార్డైంది. మొదటి కుక్క పారిపోగా, రెండోది అక్కడేపడి చనిపోయినట్లు కనిపిస్తోంది. ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి పోలీసులు ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పాలని ఫిర్యాదుదారుడిని కోరారు. ఆ విషయం తనకు తెలియదని అతడు చెప్పడంతో వీడియో మూలాలు కనుక్కోవడం సైబర్ క్రైమ్ అధికారులతోనే సాధ్యమని, వారికే ఫిర్యాదు చేయాలని సూచించి పంపారు.