అనగనగా మక్కా | makkah masjid special story on 400 years compleat | Sakshi
Sakshi News home page

చార్‌ సౌ నిషాని చరితకు చుక్కాని

Dec 27 2017 11:01 AM | Updated on Sep 4 2018 5:32 PM

makkah masjid special story on 400 years compleat - Sakshi

మక్కా మసీద్‌.. భాగ్యనగర చరిత్రలో ఓ కలికితురాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మసీదుల్లో ఒకటి. ఈ మహా కట్టడం మరో ఘనతను సాధించింది. దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసి 400 ఏళ్లవుతోంది. 1617 డిసెంబర్‌లో పునాది రాయి పడి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 77 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. ముగ్గురు కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనూ పూర్తికాని ఈ నిర్మాణం.. రాజ్యంపై దండెత్తి ధ్వంసానికి పాల్పడిన మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పూర్తి చేయడం విశేషం. షాద్‌నగర్‌లోని ఓ కొండ రాళ్లను ఈ నిర్మాణంలో వినియోగించారు. మరికొన్నింటిని మక్కా నుంచి తెప్పించారు. అందుకే ‘మక్కా మసీద్‌’గా ప్రాచుర్యం పొందింది. ఈ మహాసౌధంపై ఆసక్తికర అంశాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

1591లో మహ్మద్‌ కులీకుతుబ్‌ షా చార్మినార్‌ నిర్మించి హైదరాబాద్‌ నగరాన్ని ఏర్పాటు చేశాడు. చార్మినార్‌కు సమీపంలో 1597లో జామియా మసీద్‌ నిర్మించాడు. నగరంలో తొలిæ మసీద్‌ ఇదే. క్రమేణా జనాభా పెరగడంతో ప్రార్థనలకు మసీద్‌ సరిపోలేదు. విషయం తెలుసుకున్న కులీకుతుబ్‌ షా మరో మసీద్‌ నిర్మించాలని 1610లో ఆదేశించారు. అయితే నివేదిక ఇచ్చేలోపే 1612లో ఆయన మృతిచెందాడు. అనంతరం ఆయన అల్లుడు సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా సంస్థాన బాధ్యతలు తీసుకున్నాడు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అతిపెద్ద మసీద్‌ నిర్మించాలని తాను సహా మీర్‌ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరితో కమిటీ ఏర్పాటు చేశాడు.   

1617లో శంకుస్థాపన..   
సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా 1617 డిసెంబర్‌లో మసీద్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో దాదాపు మట్టిని వినియోగించారు. కానీ మక్కా మసీద్‌ నిర్మాణంలో మట్టిని వాడలేదు. నగర సమీపంలోని కొండల రాళ్లను పరీక్షించి, షాద్‌నగర్‌ కొండ రాళ్లను వినియోగించాలని నిర్ణయించారు. వీటి రంగు కాస్త ఎరుపుగా, పటిష్టంగా ఉన్నాయని వాడారు. నిర్మాణం మొత్తం ఒకే కొండ రాళ్లతో చేయాలని ఆవే రాళ్లను వినియోగించారు. అందుకే మసీద్‌ రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది.

మొఘల్‌ల దాడులతో జాప్యం...  
సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌ షా హయాంలో నిర్మాణం పూర్తి కాలేదు. కుతుబ్‌ షా తర్వాత 1626లో ఆయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్‌ షా చిన్న వయసులోనే సంస్థాన బాధ్యతలు చేపట్టాడు. ఈయన కాలంలో మొగల్‌ పాలకుల దాడులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ మసీద్‌ నిర్మాణ పనులు జరిగాయని చరిత్రకారులు పేర్కొన్నారు. అబ్దుల్లా మరణానంతరం 1672లో అబుల్‌ హసన్‌ తానేషా హయాంలో నిర్మాణ పనులు ఎక్కువగా జరగలేదు. 1689లో కుతుబ్‌ షాహీల సంస్థానం మొఘల్‌ల  వశమైంది.

మొఘల్‌లహయాంలో పూర్తి..
దేశంలోనే అతిపెద్ద మినార్లు మక్కా మసీద్‌కు నిర్మించాలని తొలుత ప్లాన్‌ చేశారు. కానీ మినార్ల నిర్మాణం చేపట్టలేదు. 1694లో ఔరంగజేబు మిగిలిన పనులు చేయించి, నమాజ్‌లకు అనుమతించాడు. ఇలా మక్కా మసీద్‌ నిర్మాణానికి 77ఏళ్లు పట్టింది. కుతుబ్‌షాహీ ముగ్గురు పాలకుల హయాంలోనూ ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి కాలేదు.

ఆ పేరెలా వచ్చింది?  
మక్కా మసీద్‌కు బైతుల్‌ అతీక్‌ అనే పేరు పెట్టాలని మొదట నిర్ణయించారు. అయితే సౌదీ అరేబియాలోని మక్కా నగరం నుంచి రాళ్లను తీసుకొచ్చి నిర్మాణంలో వినియోగించారు. అందుకే మక్కా మసీద్‌ అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఆసఫ్‌జాహీ ప్రథమ పాలకుడు మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌ మృతదేహాన్ని మసీద్‌ దక్షిణ భాగంలో ఖననం చేశారు. ఇదే పరంపరలో ఆసఫ్‌జాహీ ఆరో పాలకుడు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ వరకు అక్కడే ఖననం చేశారు.

రాళ్లెత్తిన కూలీలెవరు?
మసీద్‌ నిర్మాణానికి కొండను పగలగొట్టి పెద్ద పెద్ద రాళ్లను ఏనుగులకు కట్టి తీసుకొచ్చారు. చిన్న రాళ్లను ఎడ్లబండ్లపై తెచ్చారు. దేశవిదేశాల్లోని శిల్పకారులను పిలిపించారు. దాదాపు 8వేల మంది కూలీలు (మూడు తరాల మనుషులు) మసీద్‌ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతమున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కూలీలు మసీద్‌ నిర్మాణానికి రాళ్లు మోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement