గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం: ఎంపీ గుత్తా | Greater TRS to the curb: MP Gutta | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం: ఎంపీ గుత్తా

Jan 12 2016 1:39 AM | Updated on Sep 3 2017 3:29 PM

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం: ఎంపీ గుత్తా

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం: ఎంపీ గుత్తా

నగర ప్రజలు కేసీఆర్, కేటీఆర్ మాయ మాటలను నమ్మి మోసపోరాదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం వేయడం ఖాయమని

 నాగోలు : నగర ప్రజలు కేసీఆర్, కేటీఆర్ మాయ మాటలను నమ్మి మోసపోరాదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కళ్లెం వేయడం ఖాయమని నల్లగొండ ఎంపీ, ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాజీ ఎంపీ పొన్నం ప్రభా కర్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌లతో కలిసి ఎల్‌బీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
 
  మెట్రోరైలు, కృష్ణాజలాల సరఫరా తదితర పథకాలకు కాంగ్రెస్ హయాంలోనే శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేని టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే  ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారన్నారు. వారు నాయకులను ఆకర్షిస్తే మనం ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని, ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతూ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు. అధికారంలో ఉంది తామైనందున నగరం అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ గెలవాలనే వాదనతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. నగరంలో వైఫై, ఐటీఆర్ ప్రాజెక్ట్ కింద ఉద్యోగాలు, స్కై ఓవర్‌ల నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, గతంలో ఢిల్లీ, బీహార్ ప్రజలు బీజేపీకి ఎలా బుద్ధి చెప్పారో గ్రేటర్‌లో కూడా టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.
 
  జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి తల్లికి ద్రోహం చేయవద్దని, నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందని, అన్ని స్థానాలలో పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ, సీఎల్‌పీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు.  సమావేశంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దీప్‌లాల్‌నాయక్, మహేష్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ధన్‌రాజ్, రాఘవేందర్‌రెడ్డి, ముస్కు శేఖర్‌రెడ్డి, గట్టు జ్యోతి నర్సింహ్మారావు, కైసర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
 
 కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
 బిగ్‌బజార్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. సభకు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యతో తరలిరావాలని పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement