కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు...వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
హైదరాబాద్ : కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు...వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శుక్రవారం గాంధీ ఆస్పత్రి చోటు చేసుకుంది. మల్కాజ్గిరికి చెందిన గోపీ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యం చేయించుకునేందుకు వేచి ఉన్న సమయంలో అతనిపై కుక్కలు దాడి చేశాయి. నడవలేని స్థితిలో ఉన్న గిరిపై దాడి చేసి శరీరంపై ఇష్టమొచ్చినట్లు కరిచాయి. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం గోపీని పట్టించుకోలేదు. సకాలంలో చికిత్స అందించేందుకు ముందుకు రాకపోవటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కుక్కలు దాడితో ఆస్పత్రిలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిత్యం కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలను అరికట్టేందుకు ఆస్పత్రి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడుతున్నారు. కాగా ఇటీవల కాలంలో కుక్కల దాడిలో గాయపడి నీలోఫర్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన వారి సంఖ్య 1300కి చేరిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది.