ప్రత్యేక హోదాపై బాబు మోసం | YSRCP leader Parthasarathi criticises Chandra babu | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై బాబు మోసం

Aug 1 2015 2:59 AM | Updated on Mar 28 2019 8:41 PM

ప్రత్యేక హోదాపై బాబు మోసం - Sakshi

ప్రత్యేక హోదాపై బాబు మోసం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని దగా, మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ నేత కొలుసు ధ్వజం
* హోదా సాధ్యం కాదని బీజేపీ కేంద్రమంత్రులు చెబుతుంటే.. ఇంకా వారితో టీడీపీ చెలిమా?
* కేంద్రం నుంచి తప్పుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారు?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని దగా, మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీకార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రప్రభుత్వంలోని మంత్రులు స్పష్టంగా చెబుతుంటే.. ఇంకా వారితో టీడీపీ చెలిమి చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏపీకి అర్హతల్లేవని కేంద్రమంత్రులు చెప్పడం సరికాదన్నారు. ఏపీకి అర్హతలున్నాయా? లేదా? అని చూసి ప్రత్యేక హోదా ఇస్తామని ఆరోజు చెప్పలేదని, విభజన జరిగే రోజున ఈ రాష్ట్రానికి జరిగేనష్టాన్ని పూడ్చేందుకు రాజ్యసభలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని హామీఇచ్చారని పార్థసారథి గుర్తుచేశారు. ప్రత్యేకహోదా అనేది ఏపీకున్న అర్హతలను బట్టో లేక దయాదాక్షిణ్యాలతోనో ఇచ్చేది కాదన్నారు. ఈ అంశంపై సీఎం రాష్ర్టప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి తప్పుకుంటామని, ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.
 
పదేళ్లపాటు ఇస్తామన్న హామీని మరిచారా?
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను పదేళ్లపాటు ఇస్తామని వెంకయ్యనాయుడు గతంలో రాజ్యసభలో విభజన బిల్లు విషయంలో చెప్పారని, ఇపుడు మాత్రం సాధ్యంకాదని చెబుతున్నారని పార్థసారథి తప్పుపట్టారు. ప్రత్యేక హోదాకోసం ప్రతిపక్షం పోరాడట్లేదని కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీని, ఆ పార్టీతో చెలిమి చేస్తున్న టీడీపీని వదిలేసి వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచీ ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నారని ఆయన తెలిపారు. తిరుపతి తుడా కార్యాలయం నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను తొలగించి ఆ స్థానంలో చంద్రబాబు తన ఫొటోను ఏర్పాటు చేసుకోవడం చౌకబారుతనానికి నిదర్శనమని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement