సాంకేతిక రహస్యం తెలిసిన శాస్త్రవేత్త

Writer Sri Ramana Tribute To Doctor Somaraju Susheela - Sakshi

అక్షర తూణీరం

నివాళి

డాక్టర్‌ సోమరాజు సుశీల సైంటిస్ట్‌గా సాధించిన అపు రూపమైన అంశాలు చాలా మందికి తెలియదు. తొలి నాళ్లలో కాకినాడ, విజయ వాడలలో ఆమె విద్యా భ్యాసం సాగింది. చిన్నత నంలో విజయవాడ రేడి యోలో సుశీల ఆటలు, పాటలు సాగాయి. దాంతో చదువు సంస్కారం అబ్బాయి. పెద్దయ్యాక హైదరా బాదు ఉస్మానియా యూనివర్సిటీలో సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీలో డాక్టరేట్‌ చేశారు. అది పాషాణం లాంటి చదువని తెలిసిన వారంటారు. ఉస్మానియా నించి తొలి డాక్టరేట్‌ సుశీల. కొద్దికాలం లెక్చరర్‌గా పని చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పెళ్లికొడుకుని వివా హమాడారు. గోదావరి కృష్ణ సంగమించాయి. ఇద్దరూ కలిసి ‘చల్‌ మోహన రంగా’ అంటూ పూనే నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీస్‌లో ఉద్యోగంలో చేరి పోయారు.

కొన్నాళ్ల తర్వాత, ఎన్నాళ్లిలా నెల జీతా లమీద పని చేస్తాం, మనం తిని నలుగురికి పెడితే కదా బతుక్కి ఓ అర్థం– అనిపించింది ఆ జంటకి. పైగా ఏ మాత్రం జీవితం పట్ల భయంలేని వయస్సు. దానికి తోడు మనస్సు. తను పరిశోధన చేసి కొంత కృషి చేసిన సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీ అంశమైన ‘ధర్మిస్టర్స్‌’ తయారీ మీద పని చేద్దామనుకున్నారు. వాటి అవసరం చాలా ఉంది గానీ దేశంలో ఎక్కడా చేసే వసతి లేదు. ఇంపోర్ట్‌ చేసు కోవడం, ఎక్కువ ధరకి కొనడం మాత్రమే ఉంది.

కొత్త కొత్త టెక్నా లజీలను రీసెర్చి ద్వారా తయారు చెయ్యడం, వాటిని కోరిన వారికి అమ్మ డం– ఆ రోజుల్లో నేషనల్‌ లాబ్స్‌ పని. డాక్టర్‌ సుశీల బాగా సర్వే చేసి, ధర్మిస్ట ర్స్‌కి మంచి గిరాకీ ఉందని వాటి ఫార్ములా తీసుకోవాలనుకుంది. తీరా డబ్బిచ్చి కొన్నాక ఆ సంస్థ కాగి తం మీద ఫార్ములా చెప్ప గలిగింది గానీ, ప్రత్యక్షంగా చేసి చూపించలేక పోయింది. అప్పుడే డాక్టర్‌ సుశీల ప్రఖ్యాత శాస్త్రవేత్త వై. నాయు డమ్మని కలిసింది. ఒక పెద్ద లాబొరేటరీస్‌ నిర్వాకం తెలిస్తే అప్రతిష్ట. అందుకని ఎక్కడా బయట పెట్టద్దు. ఇక్కడే మీకు కావల్సిన వసతులు ఇస్తాం. మీరే సాధించండి’ అని నాయు డమ్మ మనసారా దీవించారు. అప్పట్లో టెక్నాలజీకి ఈమె చెల్లించిన సొమ్ము ఎక్కువేమీ కాదు. పట్టు దలగా కార్యరంగంలోకి దిగారు. 

అంతకుముందు హేమాహేమీలవల్ల సాధ్యం కాని వ్యవహారం ఓ అర్ధరాత్రి ఎడిసన్‌ ఇంట కరెంటు దీపం వెలిగినట్టు, ధర్మిస్టర్‌ అన్ని గుణాలతో అవత రించింది. ‘లాబ్‌లో అందరికీ ఉత్కంఠగానూ, రహ స్యం కనిపెట్టాలని ఆశగానూ ఉండేది. అందుకని కిటికీ అద్దాలకు లోపల కాగితాలు అంటించి జాగ్రత్త పడేవాళ్లం’ అని చెప్పారు డాక్టర్‌ సుశీల. ఆమె కొన్ని శాంపిల్స్‌ కొంగున ముడి వేసుకుని ‘చల్‌ మోహన రంగా’ అంటూ రావుతో భాగ్య నగరం వచ్చేశారు. చిన్న సొంత పరిశ్రమని ‘భాగ్య ల్యాబ్స్‌’ పేరుతో ప్రారంభించారు డాక్టర్‌ సుశీల. మొట్టమొదటి పారి శ్రామికవేత్తగా ఆంధ్రలో జెండా పాతారు.

ఇంతకీ ధర్మిస్టర్స్‌ అంటే– అవి చూడ్డానికి అగ్గిపుల్లల పరిమా ణంలో, పింగాళీ పుల్లల్లా ఉంటాయ్‌. వాటిని గ్యాస్‌ బెలూన్‌లో ఉంచి ప్రతి ఎయిర్‌పోర్ట్‌ నించి రోజూ మూడు పూటలా ఎగరవేస్తారు. అది ఎత్తుకువెళ్లి, అక్కడి టెంపరేచర్, తేమలాంటి అంశాలను రికార్డ్‌ చేసుకువస్తుంది. ఆ సమాచారాన్ని పైలట్స్‌కి అంది స్తారు. ఇవి కొన్ని విదేశాల్లో తయారవుతాయి. కానీ వాటిని తయారించే బట్టీలు పది పదిహేను కోట్లు ఖరీదు అవుతాయ్‌. డాక్టర్‌ సుశీల కేవలం క్యాండిల్‌ వెలు గులో చేసేవారు. దాదాపు నలభై ఏళ్లు పైబడి, ఒక్క భాగ్య లాబ్స్‌ మాత్రమే భారత ప్రభుత్వానికి సరఫరా చేసింది. ఆ పరమ రహస్యం తెలిసిన ఒకే ఒక శాస్త్రవేత్త అప్పటికీ ఇప్పటికీ డాక్టర్‌ సోమరాజు సుశీల మాత్రమే. ఆమె ఔననుకుంటే వాజ్‌పేయి హయాంలో భట్నాగర్‌ అవార్డో, పద్మశ్రీనో వచ్చేది. అనుకోలేదు. ఇది తెలుగుజాతికి, భారతావనికి గర్వం కాదా? 

ఆలస్యంగా రమారమి యాభై వయస్సులో కథకురాలై అద్భుతాలు సృష్టించారు. డా‘‘ సుశీల ఇల్లేరమ్మ కథలు ఆమెను చిరంజీవిని చేస్తాయి. చిన్న పరిశ్రమలు, ముగ్గురు కొలంబస్‌లు, ఇతర కథలు అన్నీ బెస్ట్‌ సెల్లర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. వాళ్లింట్లో, వాళ్ల ఫ్యాక్టరీలో వారే కథల్లో పాత్రలు. అందర్నీ చిరంజీవులుగా చేశారు. చెయ్యి తిరిగిన వంటగత్తె. తెలుగు, ఉత్తరాది వంటలు దివ్యంగా వండేవారు. కేవలం ఏడెనిమిది నిమిషాల్లో మైసూ ర్‌పాక్‌ కోపులు కోసేవారు. దానికి తగ్గట్టు మంచి అతిథేయురాలు. సంగీతంలో ప్రవేశం ఉంది. ఇంట్లో అత్తగారు, భర్త, పిల్లలు, కోడలు, అల్లుడు డా. సుశీల ఇష్టాయిష్టాలను అనుసరించి ప్రేమించారు. బోలెడు సత్కార్యాలు చేశారు. 55 పెళ్లిళ్లు ఆమె చేతుల మీదుగా చేసిన రికార్డు ఉంది. కొన్ని నెలల క్రితం ‘ప్రయాణం’ అంటూ ఒక వచన కవిత్వం రాశా రావిడ. రైల్లో మలిమజిలీ ముందు సామాను సద్దు కోవడంతో జీవితాన్ని పోల్చారు. ఆ రచనతో గొప్ప కవిగా నిలిచారు. తెలుగువారి ఆణిముత్యం, దేశాభి మాని డాక్టర్‌ సోమరాజు సుశీలకి అక్షర నివాళి.
(మొన్న 26న డాక్టర్‌ సుశీల కన్నుమూశారు)

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top