తపాలా తప్పులకూ పరిహారమే!

Sridhar Writes on Postal Department Mistakes - Sakshi

విశ్లేషణ
ఒకప్పుడు పోస్ట్‌ ఆఫీస్‌ అన్నా, పోస్ట్‌ మ్యాన్‌ అన్నా నమ్మకానికి మారుపేర్లు. కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది.

తపాలా కార్యాలయం అంటే ప్రతి గ్రామంలో ఒక చైతన్య కేంద్రం. అందరికీ ఆత్మీయ సందేశాలను అందించే ఒక ఆప్త బంధువు. డబ్బు దాచుకోవచ్చు. కుటుంబానికి డబ్బు మనీయార్డర్‌ చేయవచ్చు. దేశమంతటా మారుమూల గ్రామాలలో సైతం విస్తరించిన పోస్టాఫీసులు ప్రజల మిత్రులు పోస్ట్‌ మ్యాన్‌ ఊళ్లో వాళ్లందరికీ పరిచితుడు. ఎవరెవరు ఎక్కడుంటారో తెలిసినవాడు.

కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది. ఉత్తరం చేరకపోవడం చాలా అరుదుగా జరిగేది. డబ్బు ఠంచనుగా అందేది. మానాన్న గారు చిన్నాయన గారి చదువుకోసం వందరూపాయలు మనీయార్డర్‌ పంపడం తెలుసు. అది ఆయనకు 99 శాతం వరకు సకాలానికే అందేది. ఇప్పుడంతా తిరగబడింది. అనేకానేక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సమాచార హక్కు ఈ శాఖలో జరుగుతున్న దురన్యాయాలను నిర్లక్ష్య ఆలస్యాలను, ఖాతాల్లో డబ్బు మాయం దుర్మార్గాలను ఎండగట్టడానికి ఒక అద్భుతమైన పరికరంగా ఉపయోగపడుతున్నది. అడిగేవాడు లేకుండా విర్రవీగుతున్న తపాలా దురుద్యోగులకు సమాచార హక్కు దరఖాస్తులు సింహస్వప్నాలు.  ఉద్యోగానికి, లేదా కోర్సులో చేరడానికి ఆఖరి తేదీలోగా దరఖాస్తు పంపితే వారికి ఎందుకు చేర్చలేదని జనం నిలదీసి అడుగుతున్నారు. రిజిస్టర్డ్‌ పోస్ట్‌ చేసిన వస్తువులు ఉత్తరాలు, ప్రధానమైన పత్రాలు ఎందుకు మాయమై పోతున్నాయని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. వేలాది పోస్టాఫీసుల్లో అవినీతిని ఊడ్చివేయడానికి ఆర్టీఐ కొత్త చీపురు కట్టగా పనిచేస్తున్నది.

తపాలా సేవలను వినియోగించి భంగపడిన ఒక పౌరుడు ఆర్టీఐ అభ్యర్థనలో కొన్ని ప్రశ్నలు సంధించాడు. 2015 నవంబర్‌లో పంపిన రిజిస్టర్డ్‌ పోస్టు వస్తువు ఎందుకు చేరలేదు, తాను ఇచ్చిన మూడు ఫిర్యాదులపై ఏ చర్య తీసుకున్నారు అని. అది మరో డివిజన్‌కు సంబంధించిన విషయమని ఆ డివిజన్‌ ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించారని సీపీఐఓ జవాబిచ్చాడు. సరైన సమాచారం ఇచ్చాడని మొదటి అప్పీలు అధికారి సమర్థించారు.

ఫిర్యాదుల విచారణ పోర్టల్‌కు ఫిర్యాదు కూడా చేశాడు. రూ. 63ల నష్టపరిహారం తీసుకోవాలని అతనికి చెప్పారు. డిపార్ట్‌మెంట్‌ రూల్‌ ప్రకారం రూ. 63ల రిజిస్టర్డ్‌ చార్జీలతో పాటు వంద రూపాయల కనీస పరిహారం ఇవ్వవలసి ఉన్నా ఇవ్వలేదు. సరైన, పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సీపీఐఓ చేసిన తప్పులు.  కనుక జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే నోటీసు జారీ చేసింది కమిషన్‌.

చాలా కీలకమైన పత్రాలను తన మేనల్లుడికి పంపానని, దానికి 480 రూపాయలు ఖర్చయిందనీ, దానితో పాటు 50 రూపాయల పుస్తకాన్ని పంపానని దరఖాస్తుదారుడు వివరించాడు. ఈ కవర్‌ అందకపోవడం వల్ల తన మేనల్లుడు ఒక పరీక్షకు హాజరు కాలేకపోయాడని, తదుపరి ఏడాది పరీక్షకు హాజరు కావలసి వచ్చిందని పరి హారం చెల్లించాలని కోరాడు. పరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరించాలని మరో నోటీసుకూడా జారీ చేసింది కమిషన్‌.

పోస్టాఫీసు అధికారి మాత్రం రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ఎందుకు అందలేదో విచారించి రూపొందించిన నివేదిక ప్రతిని ఆర్టీఐ అడిగిన వ్యక్తికి ఇచ్చామని చెప్పారు. విలువైన వస్తువులు పంపే వ్యక్తులు దానికి బీమా చేయించాలని, తాము పోయిన వస్తువు విలువను పరిహారంగా ఇచ్చే వీల్లేదని, రూల్స్‌ ప్రకారం కేవలం వంద రూపాయలు పరిహారం రూ. 63ల చార్జీలు మాత్రమే ఇస్తామని వివరించారు. సమాచారం త్వరగా ఇచ్చినప్పటికీ అది తప్పుడు సమాచారం కనుక పరిహారం ఇవ్వవలసిన కేసు అని కమిషన్‌ నిర్ధారించింది.

సెక్షన్‌ 19(8)(బి) కింద రూ. 3,630ల పరిహారం (పూర్తి సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు 2 వేలు, పరి హారం 100, ప్రయాణ ఖర్చుల కింద రూ. 1,000లు, కోల్పోయిన వస్తువుల విలువ రూ. 53లు) ఇవ్వాలని కమిషన్‌ ఆదేశిం చింది.  సేవల వితరణలో నిర్లక్ష్యం కారణంగా వినియోగదారుడికి నష్టం జరిగితే పరి హారం ఇవ్వడం ఏ సర్వీసు సంస్థకయినా తప్పదు. ఇదే పౌర నష్టపరిహార న్యాయసూత్రం. కానీ చిన్న చిన్న పరిహా రాలకోసం వినియోగదారులు కోర్టుకు వెళ్లడం లేదా మామూలు కోర్టుకు వెళ్లడం భరించలేని భారం అవుతుంది. కనుక డిపార్ట్‌మెంట్‌లోనే కొన్ని పరిహార సూత్రాలు ఏర్పాటు చేసుకుని న్యాయంగా పరిహారం చెల్లించాలి.

పోస్ట్‌ చేసే వారు విలువైన వస్తువులను పంపేటప్పుడు వాటిని విధిగా బీమా చేయాలనే అంశానికి బాగా ప్రచారం ఇవ్వాలి. తరువాత ఆ బీమా సొమ్ము బాధితుడికి ఇవ్వడానికి తపాలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. అసలు పరిపాలనే మరిచిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకన్న ఘోరంగా తపాలా కార్యాలయాలు తయారు కావడం దురదృష్టకరం. కనుక పౌరులు విధిలేక ఆర్టీఐ ఆసరా తీసుకుంటున్నారు. దానికి కూడా సరైన సమాధానాలు ఇవ్వకుండా అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌ 19 అనేక పరిష్కారాలను కల్పిస్తున్నది.

అందులో ఒకటి నష్టపరిహార నియమం. సమాచారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, పూర్తిగా ఇవ్వనందున, ఇచ్చినా ఆ సమాచారం తప్పుల తడక కావడం వల్ల కలిగిన నష్టాలకు అందుకు పౌరుడి పైన పడిన భారాన్ని కూడా ఆర్టీఐ భంగపరిచిన అధికార సంస్థ చెల్లించాలని 19(8) (బి) నిర్దేశిస్తున్నది. అయితే ఈ నష్టమే కాకుండా, ఇతర నష్టాలను, లోపాలను కూడా భర్తీ చేయాలని ఆ నియమంలో ఉంది.

నిజానికి ఈ కేసులో పౌరుడి బంధువు పరీక్షకు హాజరుకాలేకపోవడం వల్ల ఏడాది సమయాన్ని కోల్పోయాడు. ఈ పరిహారాన్ని లెక్కించడం చాలా కష్టం. నామమాత్రంగా నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడు కూడా సరిగ్గా తన నష్టాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. అది కూడా జరగడం లేదు. (CIC/POSTS/ A/2017/167339 రాకేశ్‌ గుప్తా వర్సెస్‌ పోస్టాఫీస్‌ కేసులో సీఐసీ 9 జనవరి 2018 న ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top