అడివంటుకుంటుంది

Mallepalli Laxmaiah Writes Guest Columns On Scheduled Tribes And Traditional Forest Dwellers - Sakshi

కొత్త కోణం

ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. బ్రిటిష్‌ కాలం నుంచి దోపిడి మరో రూపం తీసుకున్నది. 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్‌ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి.

ఆదివాసీల జీవితం అడవి చుట్టూతా అల్లుకొని ఉంటుంది. ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, అడవిలోని అణువణువూ వారి పాదముద్రలతో పునీతమై ఉంటుంది. అడవిలేనిదే ఆదివాసీలు లేరు, ఆదివాసీలు లేనిదే అడవీ మనలేదు. అంతెందుకు వారి భాష, వారి యాస, వారి కట్టూ, బొట్టూ, ఇంకా చెప్పాలంటే వారి సంస్కృతే ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఒక ప్రత్యేకమైన జీవన విధానం వారి సొంతం. అడవిలో పుట్టి అడవిపైనే ఆధారపడి, అక్కడ దొరికే ఆకులూ అలములూ తిని, రోగమొస్తే, రొప్పొస్తే ఆసుపత్రి కూడా అందుబాటులో లేక ఏ ఆకుపసరుతోనో సరిపెట్టుకొని ఆ అడవిలో పిల్లో, పిట్టో, పందో దొరికినా  నిండు రాతిరిలో పండు వెన్నెల్లో ఊరుమ్మడిగా వండుకు తినేసి హాయిగా ఏ అరమరికలూ లేకుండా బతికే స్వేచ్ఛాపరులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆదివాసీలే.

తమ ఆకలితీర్చి ఆదరించిన అడవినే నమ్ముకొని చలికి వణికీ, వానకి తడిసీ, ఎండకు ఎండినా శతాబ్దాలుగా ఆ అడవిని వీడి బతకడం చేతకాని వారు ఆదివాసీలే. మనం మరిచిపోయిన సహజీవనం, సమానత్వ భావనలకి చిహ్నం ఆదివాసీలే. ఇప్పటికింకా ఆ ఉమ్మడి జీవితం వారిలో తప్ప మరెక్కడా మచ్చుకైనా అగుపించదు. ఆదివాసీలతో పాటు అక్కడి జంతువులూ సహజీవనం చేస్తాయి. పురుగూ, పుట్టా, పక్షీ, పిట్టా అన్నీ వారికి మచ్చికే. ఒక్కమాటలో చెప్పాలంటే వారున్నంత వరకూ అక్కడి ఏ చెట్టునీ, ఏ కొమ్మనీ ఎవ్వరూ నరకలేరు. అలాగే, ఏ జంతువునీ ఎవ్వరూ చంపలేరు. వారి వల్లైతే ఏ అడవి మృగానికీ హానీ జరగదు. అంతగా వారు ప్రకృతిలో కలిసిపోయారు. చివరకు వారి దేవతలూ, దేవుళ్ళూ సైతం ప్రకృతి తప్ప మరొకటి కాదు. ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఇది ఈనాటి చరిత్రకాదు. వందల సంవత్సరాల ఆదివాసీల సంస్కృతే ఇది.  

ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే మరోమారు ఆ అడవిబిడ్డల ప్రస్తావన ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. వారి శ్రమను కొల్లగొట్టేవారు. కానీ ఇప్పుడు ఆదివాసీల పాదాల కింద ఉన్న మట్టినే తొలిచేయాలని చూస్తున్నారు బడా పెట్టుబడీదారులు, అభివృద్ధి పేరిట అడవిలో ఉన్న ఖనిజాలను, ఇతర ఉత్పత్తులనూ దోచుకోవడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్‌ కంపెనీలు మూకుమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు ఆదివాసీలు జంతువులను వేటాడితే ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీలు ఆదివాసీలను వేటాడటం మొదలు పెట్టారు. వేదకాలంలో మొదలైన ఈ వేట ఈనాటికీ కొనసాగుతున్నది. అప్పుడు యజ్ఞయాగాలను రక్షించుకోవడానికి అడవిని తమ అధీనం లోకి తెచ్చుకోవడానికి రాక్షసులనే ముద్రవేసి, శ్రీరాముడు, పాండవులు అరణ్యవాసాల పేరిట వేటసాగించారు.ఆ తర్వాత మనకు అందిన చరిత్ర ప్రకారం కాకతీయ రాజులు సమ్మక్క, సారక్కల రాజ్యం మీద దాడిచేసి రక్తపాతం సృష్టించారు. బ్రిటిష్‌ కాలం నుంచి ఈవేట మరో రూపం తీసుకున్నది.  

అప్పటి వరకూ ఆదివాసీలు తమకుతామే రాజులు, పాలకులు. కానీ బ్రిటిష్‌ వారు ప్రభుత్వాలపేరిట స్వేచ్ఛగా ఉండే ఆదివాసులను చట్టాల చట్రంలోకి తీసుకువచ్చారు. ఇందుకు భారత దేశంలోని ఆధిపత్య కులాలు, సంస్థానాధీశులతో కలిసి ఆదివాసీల దోపిడీకి సహకరించారు. ఆ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు తిరుగుబాట్లు చేసారు. అందులో బీహార్‌ ప్రాంతంలోని జార్ఖండ్‌లో బిర్సా ముండా నాయకత్వంలో సాగిన తిరుగుబాటు చరిత్రలో ఒక పెనుతుఫాను. అదే విధంగా బెంగుళూరు ప్రాంతంలో, మహారాష్ట్రలో అనేక చోట్ల ఆదివాసులు తమ తిరుగుబాటు జెండాలు ఎగురవేశారు. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణ ప్రాంతంలో కొమురంభీం, ప్రతిఘటనా పోరాటాలు ఆనాటి పాలకులను గడగడలాడించాయి.

అయితే కొమురంభీం పోరాటాన్ని చవిచూసిన నిజాం ప్రభుత్వం హేమన్‌డార్స్‌ అనే బ్రిటిష్‌ సామాజిక శాస్త్రవేత్తను ఆహ్వానించి, ఆది వాసీల ఆందోళనకి కారణాలను వెతకాలని, పరిష్కారాలను సూచించాలని ఆదేశించింది. 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం రాజ్యాంగ సభ ఏర్పాటైంది. దానితో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌తో సహా ఎంతో మంది దళితులతో పాటు, ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగంలో ఎన్నో సూచనలనూ, నిబంధనలనూ పొందుపరిచారు. వారి రక్షణ కోసం చేసిన నిబంధనలన్నింటినీ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో చేర్చి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 1950 లో రాజ్యాంగం అమలులోకి వస్తే, 1965–66 వరకు ఆదివాసీల గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.

అంతేకాకుండా ఆదివాసీయేతర వ్యక్తులు ముఖ్యంగా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, షావుకార్లు తమ దృష్టినంతా ఆదివాసీప్రాంతాల మీదకు మళ్ళించారు. అడవిలో ఉన్న వృక్ష సంపదను కాంట్రాక్టర్లు దోచుకొని పోతే, షావుకార్లు తమ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను ఉద్దెరకు ఇచ్చి, అటవీ ఉత్పత్తులను ఆదివాసీలనుంచి కాజేయడం మొదలుపెట్టారు. ఈ దోపిడీయే ఆదివాసీల మరో పోరాటానికి ఊపరిలూదింది. అదే నక్సలైట్‌ పోరాటం. పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ, శ్రీకాకుళంలోని ఉద్దానం, ఏజెన్సీ ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలూ, గోదావరీ లోయ అంతా ఫారెస్టు కాంట్రాక్టర్లు, షావుకార్లకు వ్యతిరేకంగా ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఇది ఆనాటి ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేసింది. ఆలోచింపజేసింది.

దాని ఫలితంగానే ఆదివాసీల భూములను ఆదివాసీ యేతరులు కొల్లగొట్టకుండా ఉండేందుకు, ఆదివాసీ భూములపై సర్వహక్కులూ ఆదివాసీలకే ఇస్తూ, ఆదివాసీ భూములను ఆది వాసీ యేతరులు కొనకూడదు, అమ్మకూడదు అంటూ ఒక చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దానితో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఐటీడీఏ, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఇది ఆదివాసీల తిరుగుబాటు ఫలితమేనని అందరూ అంగీకరించి తీరాల్సిందే. అయితే ఆదివాసీల జీవితాల్లో ఒక అడుగు ముందుకు పడినప్పటికీ వారికి దున్నుకునే భూమి మీద హక్కులేకుండా పోయింది. ఆదివాసీలు దున్నుకుంటున్న భూములకు పట్టాలివ్వడానికి మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం పెనుఉప్పెనలా దూసుకొచ్చింది. దాని ఫలితమే 1981లో ఏప్రిల్‌ 20న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన. తాము సాగుచేసుకొని బతుకుతున్న భూములకు పట్టాలివ్వాలని ఆదివాసీలు డిమాండ్‌ చేసారు. ఏప్రిల్‌ 20న జరపతలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వాళ్ళు పట్టు వదలకుండా ఇంద్రవెల్లి తరలివచ్చారు. పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వందమం దికి పైగా ఆదివాసీలను కాల్చి చంపారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొందరికి పట్టాలు దక్కాయి.  

అయితే 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్‌ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. దానికి కాంగ్రెస్‌తో సహా బీజేపీ దాకా అన్ని పార్టీలూ వత్తాసు పలికాయి. కానీ ఆదివాసీలు మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ళ తరఫున కొంత మంది స్వచ్ఛంద కార్యకర్తలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆదివాసీలకు అనుకూలమైన తీర్పులు పొందగలిగారు. ఈ క్రమంలోనే 2006లో అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పీ.ఏ ప్రభుత్వం ఆదివాసీల రక్షణ కోసం అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కార్పొరేట్‌ కంపెనీలకు కొరక రాని కొయ్యగా తయారైంది. దానితో కార్పొరేట్‌ కంపెనీలు కొత్త కుట్రలకు తెరతీశాయి. ఆదివాసీలు అడవుల్లో జీవించడం వల్ల వన్యప్రాణి రక్షణకు భంగం కలుగుతుందనే వాదనలు లేవనెత్తారు.

ఇది కార్పొరేట్‌ కంపెనీలు ప్రత్యక్షంగా చేయకుండా, వన్యప్రాణి సంరక్షకుల పేరుతో కొన్ని ఎన్‌జీఓలను సృష్టించారు. అటువంటిదే ఒక సంస్థ ఇటీవల సుప్రీంకోర్టులో వన్యప్రాణి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనేక మంది అక్రమంగా అడవుల్లో ఉంటున్నారనీ, వారిని అక్కడినుంచి పంపించి వేయాలనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానితో తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు ఈ కేసుని ఆదివాసీల తరఫున వాదించాల్సింది పోయి చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి. తత్ఫలితంగా ఫిబ్రవరి 13 వ తేదీన సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పునిచ్చింది. అక్రమంగా అడవుల్లో ఉన్న వాళ్లను జూలై 24 లోగా ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దాదాపు అన్ని రాష్ట్రాలూ కలిపి కొన్ని లక్షల మంది ఆదివాసీలుంటారు. నిజానికి ఇప్పటికే ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ భూములను కబ్జా చేసుకొని అక్రమంగా ఉంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అయిదు లక్షల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటి గురించి విచారణాలేదు. తీర్పులూ లేవు. అయితే సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని అమలు చేయడం ప్రభుత్వాలకు అంత సులువుకాదు. ఒకవేళ కార్పొరేట్‌ కంపెనీలకు వెసులుబాటు కల్పించడానికి ఉపయోగపడే ఈ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాలు భావిస్తే అడవి అడవి అంతా భగ్గుమంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పును సవరించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే తదుపరి పరిణామాలు ప్రభుత్వం చేయిదాటిపోవడం ఖాయం.


వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top