ఉత్తరాది ఆధిపత్యం ప్రమాదకరం

Mallepalli Laxmaiah Writes Guest Columns On Election 2019 Results - Sakshi

కొత్త కోణం

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ కొనసాగుతున్న అంతరాలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు ప్రాంతాలమధ్య ఉన్న మత, సామాజికపరమైన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. భాష, సంస్కృతి విషయంలో ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలను యావత్‌ దేశంపై బలవంతంగా రుద్దే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉత్తరాది ఆధిపత్య ధోరణి తారస్థాయికి చేరింది. అయితే దక్షిణ భారత దేశాన్ని చిన్నచూపు చూడటంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దొందూ దొందే కావడం గమనార్హం.

‘‘భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఎంతో వైవిధ్యం ఉన్నది. ఉత్తర దేశం మూఢనమ్మకాలతో మునిగి ఉంటే, దక్షిణ ప్రాంతం హేతు దృక్పథంతో ఉన్నది. ఉత్తరం ఛాందసవాదంలో ఉంటే, దక్షిణం ప్రగతిశీలమైన బాటలో ఉన్నది. విద్య విషయంలో దక్షిణం ముందడుగు వేస్తుంటే, ఉత్తరభారతం వెనుకబడి ఉంది. సాంస్కృతిక పరంగా దక్షిణం ఆధుని కతను సంతరించుకుంటే, ఉత్తరం ప్రాచీన దశలోనే ఉంది’’ ఇవి 1955 లోనే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నోటివెంట దొర్లిన అక్షర సత్యాలు. భాషా ప్రయుక్తరాష్ట్రాల విషయమై రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ సంఘానికి అందజేసిన నివేదికలోని అంశమిది. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎన్నో ఇతర అంశాలను ప్రభా వితం చేస్తుందని అంబేడ్కర్‌ అంత ముందుగానే ఆలోచించగలిగారు. 

ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపైన ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఇది ప్రజాస్వామిక దృక్పథానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అంబేడ్కర్‌ చెప్పిన మాటలు ఈ నాటికీ అక్షరసత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తు న్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఈ అంతరాలు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మీద ఎంతో ప్రభా వాన్ని కలిగిస్తున్నాయి. ఒకరకంగా ఉత్తర భారతదేశంలో మొలకెత్తిన తిరోగమన భావజాలాలన్నింటినీ దక్షిణాదిపై రుద్దుతున్నట్టు చరిత్ర రుజువుచేస్తోంది. ముఖ్యంగా మతపరమైన, సామాజికపరమైన వైవి«ధ్యా లను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఒక ఘర్షణ వాతావర ణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దక్షిణాది మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనుసరించిన విధా నాలు దక్షిణాదిని కలవరపరుస్తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను యావత్‌ దేశంపై బలవం తంగా రుద్దే పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్రపరిణామాలకు దారితీస్తుందనడా నికి అనేక ఉదాహరణలున్నాయి.

ఉత్తరాదిలో ఒక వర్గం ఆలోచనలను, దేశం మొత్తం ఆచరించాలనే ధోరణిని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఒక మతం ప్రాతిపదికగా దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ప్రభుత్వ విధానాలను దక్షిణ భారత దేశం ఏనాడూ ఆమోదించలేదు. కారణం ఈ నేలకున్న చారిత్రక చైతన్య లక్షణం కావచ్చు. లేదంటే ఈ ప్రాంతంలో ఉద్భవించిన అనేకానేక ఉద్య మాలు కావచ్చు. ఈ ప్రాంతాన్ని ఇవే నిత్యచైతన్యస్రవంతిలో ఓలలాడేలా చేశాయి. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ ఇక్కడ చోటు తక్కువనే చెప్పాలి. దక్షిణాదిలో సాగిన కుల వ్యతిరేక పోరాటాలూ, సాంఘిక సంస్కరణో ద్యమాలూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపథంలో నడిపాయి. హిందూ మతంలోని మూఢవిశ్వాసాలనూ, కుల అణచివేతనూ, వివక్షనూ ఈ ఉద్యమాలు తిప్పికొట్టాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఆయో తీదాస్, రామస్వామి నాయకన్, కేరళ అయ్యంకాలి, ఆనాటి హైదరా బాద్‌ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామ స్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని అందించారు. 

అయితే సరిగ్గా ఈ చైతన్యమే ఉత్తరాదిలో కొరవడిందని ఆనాడు అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. సరిగ్గా అదే నేడు అడుగడుగునా రుజువ వుతూ వస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక సూత్రం. కానీ బీజేపీ, దాని నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వ శక్తులూ హిందూ మత రక్షణకు బదులుగా, ఇతర మతాలను ధ్వంసం చేయాలనుకోవడం మనకు ఇటీవలికాలంలో అత్యంత ఆందో ళన కలిగించిన అంశం. ఇతర మతాల ప్రజల ఆహారపుటలవాట్ల మీద గోమాంసం పేరుతో వందల మందిపై దాడిచేయడం, కొందరిని హత్య చేయడం మొదలెట్టి దేశమంతటా ఇటువంటి దాడులు జరపాలని భావించారు. కానీ అదిసాధ్యం కాలేదు. దక్షిణ భారతీయులు  హిందువు లైనప్పటికీ ఇతర మతాల ఆచార వ్యవహారాలను తక్కువగా చూడలేదు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం మీద దాడిచేయాలనుకోలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఒకే అంశంపై ఉన్న వ్యత్యాసాన్ని వరల్డ్‌ వాల్యూ సర్వే బయటపెట్టింది. దీని ప్రకారం హిందూ మతం ఒక్కటే అనుసరిం చదగినదని ఉత్తరాది అధికంగా భావిస్తే, దక్షిణాదిలో దానిని అంగీక రించే వాళ్ళ శాతం తక్కువ. అదేవిధంగా అన్ని మతాలూ సమానమనే భావనలో కానీ, ఇరుగుపొరుగు వాళ్ళు ఇతర మతస్థులు ఉండకూడదనే విషయంలోగానీ, రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ముఖ్యంగా ముస్లింల పట్ల అవలంబిస్తున్న వైఖరిలో రెండు ప్రాంతాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని, ఈ సర్వే వెల్లడించింది.

ఇటీవల ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ హిందూ మతం, హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా దక్షిణ, ఉత్తర ప్రాంతాల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ హిందూ మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూనే, ముస్లిం ప్రజల సంక్షే మంపై దేశంలో ఏ ప్రభుత్వం చూపించని శ్రద్ధను కనబరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకోసం అమలుచేస్తున్నది. అంతేకాకుండా 200కు పైగా రెసిడెన్షియల్‌ పాఠశాల లను ముస్లింల కోసం నిర్వహిస్తున్నదంటే ఇది దక్షిణ భారతదేశం అవలంభిస్తున్న మత సహనానికి నిదర్శనం. అట్లాగే కర్నాటక, కేరళ, తమిళనాడులలో తెలంగాణలో లాగా ఇంత ప్రాధాన్యత ఇవ్వకపో యినా, ద్వేషభావం కలిగించలేదు. దీనికి విరుద్ధమైన వైఖరిని బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అనుసరిస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లోగానీ, ముస్లింలను కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా పోటీకి నిలపలేకపోయింది. ఎందుకంటే అక్కడి హిందు వుల్లో కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడానికి, ఇతర హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను రాజకీయం చేశారు. చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరభారతదేశ ప్రజాస్వామిక వ్యతి రేక ధోరణిని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గతంలోనే ఉదహరించారు. యావద్దేశానికి హిందీ అధికార భాషగా ఉండాలనే విషయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో సభ్యులు 78–78 అనే సంఖ్యతో సమం చేశారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆనాటి నాయకత్వం తమ పార్టీ సభ్యులతో చర్చలు జరిపి ఒప్పించి, వ్యతిరేకించే వారిలో ఒకరిని సభకు హాజరుకాకుండా చూడడంవల్ల 78–77 తేడాతో హిందీ భాష అధికార భాష కాగలిగింది. 

రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఉత్తర భారత దేశంపైన ఆధారపడే స్థితిని కల్పించారు. లోక్‌సభలో ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో ఉండడం వల్ల ఇప్పటికే పీ.వీ.నరసింçహారావు మినహా మరే దక్షిణ భారత నేత కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగలేక పోయారు. దేవెగౌడ కొద్దికాలమే ప్రధాని పదవిలో ఉండగలిగారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉత్తర భారతీయులే ఎక్కువగా అధిష్టించారు. రాష్ట్రపతి పాలనగానీ, ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేసే ప్రక్రియ కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరిగిందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగానే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందని భావించక తప్పదు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్‌ హయాంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పడి, తెలుగు ఆత్మగౌరవమనే ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నినదిస్తే, స్పందించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇమడక పోవడంవల్లనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవసర మైంది. తమిళనాడులో ఢిల్లీని ఎదిరించే రాజకీయాలతోనే అక్కడి పార్టీలైన డీఎంకే, అన్నాడిఎంకే పనిచేస్తున్నాయి. కర్నాటకలో కూడా జెడీఎస్‌ ఒక ప్రాంతీయ పార్టీగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో అవమానానికి గురవుతున్నారు. 

దేవెగౌడ ఒక సమయంలో ప్రత్యక్షంగా నాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చెప్పడం సందర్భోచితం అని భావిస్తున్నాను. ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీ ఒక నియంతల కుటీరం. అది రాజ కీయంగానూ, నివాసపరంగానూ, సమాజపరంగానూ రాజధానిగా సరిపోదు. దక్షిణాది నాయకులంటే, అక్కడి రాజకీయనాయకత్వానికి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం కూడా చాలా చులకనగా చూస్తారు’’ అని వాపోయారు. ఇటువంటి సందర్భాలు దక్షిణాది నాయ కులందరికీ అనుభవమే తప్ప అబద్ధం కాదు. ఇటీవల ఈ ఆధిపత్య ధోరణి, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు మరింత ఎక్కువైందని స్పష్ట మౌతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధుల నుంచి పూర్తిగా దాటవేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేరళ రాష్ట్రంలో ఘోరమైన వరదలు వచ్చి, వేల కోట్ల నష్టం వాటిల్లి, వంద లాది మంది మృత్యువాత పడితే ఆదుకోవడంలో చూపిన అలక్ష్యం ఎవ రినైనా కుంగదీయకపోదు. ఒకవైపు సామాజిక, సాంస్కృ తిక అంత రాలూ, రెండో వైపు వివక్ష, నియంతృత్వ పోకడలు భవి ష్యత్‌లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింత అగా«థాన్ని సృష్టించక మానవు. రాజ్యాంగ నిర్మాతల  ఆశయాలను, రాజ్యాంగ విలువలను పాలకులూ ప్రజలూ పాటిస్తే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top