డోపింగ్‌ చట్టబద్దమా నేరమా?

madabhusi sridhar write article on anti doping - Sakshi

విశ్లేషణ

దేశంలో యాంటీ డోపింగ్‌ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో లేనందున క్రీడాకారులు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది.

తాత్కాలికంగా శక్తిని పెంచే ఉత్ప్రేరక మత్తు మందులను వాడి ఆటల్లో గెలిచే అవినీతి విస్తరిస్తున్నది. క్రీడాస్ఫూర్తితో జీవి తాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలనే నీతి సూత్రాలు చిన్నప్పటి పెద్దమాట. ఇప్పుడు ఏదో రకంగా గెలవడమే కర్తవ్యంగా క్రీడాకారులు భావిం చడం విచారకరం. దీన్ని డోపింగ్‌ అంటున్నారు. తప్పుడు ప్రేరకాల నేరాన్ని (డోపింగ్‌) అరికట్టడానికి మనం ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం? మన విధా నం న్యాయంగా లేదని విమర్శిస్తూ దీపక్‌ సాంధూ అనే క్రీడాభిమాని ఒక ఆర్టీఐ దరఖాస్తులో విమర్శించారు. దేశంలోనూ రాష్ట్రాలలోనూ ప్రేరకాల వాడకాన్ని కనిపెట్టి నిరోధించడానికి కఠిన విధానాలను అనుసరించడంలేదని ఆయన అంటున్నారు.  

ప్రపంచ ప్రేరక వ్యతిరేక సంస్థ (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) 2015లో ఒక నియమావళిని రూపొందించింది. పరీక్షలు నిర్వహించి తొండి చేసి గెలవాలని చూసే మోసపూరిత ఆటగాళ్లను పట్టుకొని నిషేధించేందుకు ప్రమాణాలను నిర్దేశించింది. పరిశోధన, రసాయన మందుల పరి మాణం ఎంత ఉండాలని కూడా వివరించింది. క్రీడాకారుని శరీరంలో ప్రవేశించిన మందు పరిమాణాన్ని, అతనికి ప్రేరకం అందిన వనరులను కని పెట్టే ప్రక్రియను కూడా నిర్దేశించింది. 

మనదేశంలో ఈ ప్రేరకాల నిరోధక పద్ధతులు, ప్రయోగశాలలో కనిపెట్టి అరికట్టే ప్రయోగశాలలు ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎందుకు లేవన్నది ప్రధానమైన ప్రశ్న. అందువల్ల జాతీయస్థాయి పోటీలకు చేరుకునే వారు అందుకు కింది స్థాయిలో ప్రేరకాలు వాడితే పట్టుకోవడానికి విధానమే లేకుండా పోయింది. అంటే పరోక్షంగా జిల్లా, రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలలో ప్రేరకాలు వాడి గెలిచేం దుకు మనదేశంలో వీలుంది. దాన్ని చట్ట వ్యతిరేకతగా భావించడానికి వీల్లేదు. అంటే ప్రేరకాల వాడకం జాతీయస్థాయి కింది అన్ని స్థాయిల్లో చట్టబద్ధం, ఆ తరువాత నేరం. మనకు జాతీయ ప్రేరక నిరోధక సంస్థ, జాతీయ ప్రేరక పరీక్షా ప్రయోగశాల ఉన్నాయి. కాని ప్రాంతీయస్థాయిలో ఈ ప్రయోగశాలలు లేక, అక్కడి క్రీడాకారులను పరీ   క్షించే విధానం లేక, ప్రేరకాలు వాడే వారు జాతీయస్థాయి దాకా చేరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నాడా సంస్థ పరిశీలన ప్రకారం 2015, 2016 సంవత్సరాలలో పోటీనుంచి ఎంతమందిని తప్పించారు? ఎంతమందిని అనుమతించారు? ఎన్ని ప్రయోగాలు జరిపారు, ఎందరు ప్రేరకాలు తీసుకున్నారని తేలింది? వారిపై తీసుకున్న చర్యలు, నిషేధంవంటి వివరాలు కోరారు దీపక్‌ సాం«ధూ. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గానీ ఏ జవాబూ ఇవ్వలేదు.  

ప్రజాసమాచార అధికారి కొన్ని సంబంధిత పత్రాల ప్రతులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే ఇచ్చిన 122 పేజీల పత్రాలలో ఒక్కటి కూడా ధృవీకరణ లేదని దీపక్‌ సాంధూ విమర్శించారు. ముంబై ఐబీబీఎఫ్‌ వారి ప్రజాసమాచార అధికారి సంతకం చేయలేదు, స్టాంపుకూడా కొట్టలేదు. క్రీడా సంస్థల జాబితా ఇచ్చారుగాని వారు 2015–16 సంవత్సరంలో నాడా సంస్థకు రాసిన ఉత్తరాల ప్రతులు ఇవ్వలేదని, 10.8.2017న తాను రాసిన లేఖకు జవాబు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెక్షన్‌ 4(1) సి ప్రకారం కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేప్పుడు లేదా ప్రకటించేటప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ఆ విధానాలకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలముందు తమంత తామే ఉంచవలసి ఉంటుంది. 

ప్రాంతీయ రాష్ట్రస్థాయిల్లో అసలు ప్రేరకాల వాడకాన్ని నిరోధించే విధానమే ప్రభుత్వం రూపొం దించలేదు. దీనివల్ల జాతీయస్థాయికి వచ్చేదాకా అసలు ఈ పరీక్షే లేకుండా పోయింది. దీనివల్ల ప్రతి భావంతులైన, సహజంగా ఆడగల స్తోమతగల అర్హులైన ఆటగాళ్లు పోటీలో మిగిలే అవకాశమే లేదు. జిల్లాస్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో చివరకు ప్రాంతీయ స్థాయిలో కూడా ఆటగాళ్లు ఈ ప్రేరకాల ప్రభావంతో ఆడి, సహజంగా ఆడే పోటీదారులపై గెలిచిపోతూ ఉంటారు. ఒకవేళ జాతీయ స్థాయిలో పట్టుబడినా అప్పటికే ఆ క్రీడాకారుడు సహజ క్రీడాకారులను వెనక్కితోసి జాతీయ స్థాయికి చేరి ఉంటాడు. కానీ నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. 

ఈ అనారోగ్యకరమైన విధానాన్ని మార్చి అన్ని స్థాయిలలో ప్రేరకాల వాడకాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలని కమిషన్‌ సిఫార్సుచేసింది. సమాచారం అభ్యర్థించిన దీపక్‌ సాంధూ అడిగిన విషయాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలనకు సమర్పించాలని, అందులో ఆయన కోరిన పత్రాలను ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది. దీపక్‌ సాంధూ దాఖలుచేసిన అన్ని సమాచార దరఖాస్తులకు సంబంధించిన దస్తావేజులను చూపాలని ఆదేశించింది. (దీపక్‌ సాంధూ వర్సెస్‌ ఇండియన్‌ బాడీ బిల్డర్స్‌ ఫెడరేషన్‌  ఇఐఇ/ అౖఐN/అ/ 2017/140574 కేసులో 21.11.2017 న ఇచ్చిన తీర్పు ఆధారంగా).

- మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top