వలస కూలీలు ఓటర్లు కారనుకున్నారా?

Madabhushi Sridhar Article On Migrant Workers - Sakshi

విశ్లేషణ

నెత్తిన మూటలు, పక్కన పదేళ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, ముసలాయన, మొత్తం కుటుంబం కాలినడకన మైళ్ల ప్రయాణానికి సిద్ధం. వారికెంత ఆత్మస్థైర్యం, ఎంత సహనం? కొందరు నడవలేకపోయారు చని పోయారు. దేశంలో పదినుంచి నలభై కోట్లదాకా వలస కూలీలు ఉన్నారు. లెక్కలు లేవు. వారి పట్ల రాజ్యపాలనా వ్యవస్థ దారుణంగా విఫలమైంది. మాకు కరోనా అంటే భయం లేదు. కానీ పేదకూలీలను మనుషులు అని కూడా గుర్తించని ప్రభుత్వం అంటే చాలా భయం, ఆకలికీ, నిరుద్యోగానికీ, వందల మైళ్ల నడకకూ భయపడడం లేదు. మేం కూడా ఓట్లు వేస్తాం. మాకు విలువే లేదా? అని ఒక కూలీ అడిగాడు. వలసకూలీలకు ఓట్లు లేవనుకున్నారా లేక వారు ఓట్లే వేయరనుకున్నారా?

అవినీతి, అసమర్థత, ఆలోచనలేని నిర్ణయాలు వైరస్‌ కన్నా అల్పంగా ఎవరికీ కనిపించవు. వైరస్‌కన్నా ప్రమాదకరంగా సూక్ష్మంగా ఉండే అసమర్థతను ఎవరు చూస్తారు? కరోనా వైరస్‌ కోవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మందు అని అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ దీని వెనుక కోట్లాది వలస కూలీలను అసలు పట్టించుకోకపోవడమనే భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు సజీవ సాక్ష్యాలు, కాదు కాదు, జీవన్మృత సాక్ష్యాలు. 8 గంటలకు టీవీలో ప్రసంగించి అర్ధరాత్రి 12 నుంచి లాక్‌డౌన్‌ అన్నీ బంద్‌ అన్నారు. ఆహా భేషైన నిర్ణయం. ఎక్కడెక్కడో చిక్కుకున్న కోట్లాది మంది కూలీల పని హఠాత్తుగా ఆగింది. రైళ్లు, బస్సులు, వాహనాలేవీ కదలవు. పొట్ట చేతబట్టుకుని నగరాలకు వచ్చిన కూలీలు ఎక్కడికి ఎలా వెళ్లగలరు? వీరి బతుకులను ఏం చేయాలనే ప్రణాళిక లేకుండా, వారు బతికి ఉన్నారని, బతికి ఉండేట్టు చూడాలనే ధ్యాస లేకుండా లాక్‌డౌన్‌ చేసారు. కరోనా ఖాళీని ఏలినవారిని కీర్తించడానికి సద్వినియోగం చేస్తున్నారు. కూలిపోయిన కూలీల గురించి పట్టించుకోవడం ఎందుకనే నిర్లక్ష్యం ఇది.

నగరాలనుంచి గ్రామాలకు వందలాదిమంది నడిచిపోతున్న కఠిన జీవన దృశ్యాలు ఇప్పటికీ హృదయ విదారకంగా పత్రికల్లో టీవీల్లో వస్తూనే ఉన్నాయి. కోట్లాదిమందికి హఠాత్తుగా కూలీ ఉద్యోగం కూడా కూలిపోయింది. బతకాలంటే ఊరికి పోవడం ఒక్కటే మార్గం. నడవడం తప్ప మరో దారి లేదు. వీధిమూల చిన్న చాయ్‌ దుకాణాలు పెట్టుకునే వాళ్లు, తోపుడు బండ్లమీద తినుబండారాలు అమ్ముకునే వాళ్లు. ఇవ్వాళ్ల సంపాదించిన డబ్బు, తిండికి.. రేపటి వంటలకు పెట్టుబడికి మాత్రమే సరిపోతాయి. రేపు చిన్నవ్యాపారం నడవక వేరే పని లేక రేపు తినగలిగినా మరునాటికి తిండి లేక ఎన్నాళ్లిలా? రాష్ట్ర సరిహద్దులలో పొరుగు ప్రభుత్వం సొంతూరు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేస్తే అదృష్టం. కొన్ని రాష్ట్రాలు చేసాయి. కొన్ని చోట్ల వదాన్యులు డబ్బు పోగు చేసి వేరే రాష్ట్రాలనుంచి, జిల్లాలనుంచి వచ్చిన కూలీలకు తిండి పెడుతున్నారు. రోజుకు వందలాది మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. తిరుపతిలో తితిదే దేవస్థానం వారు కొన్ని రోజులు ఆహారం వండి పెట్టారు. చాలా గొప్పపని.

మార్చి 22న ఉండాల్సిన బుద్ధి ఏప్రిల్‌ 20 దాకా రాలేదు. దాదాపు నెలరోజుల ఆకలి.. కూలీల వలసల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ కేంద్రాలు పెట్టాలనిపించింది. కేంద్రానికి సాయం చేయాలనిపించింది. సహాయ నిధులు ప్రకటించారు. భోజన సరఫరా ఏర్పాట్లు చేసారు. అదీ కొందరికి మాత్రమే. ఇవన్నీ అరకొర వ్యవహారాలు. అందరికీ అందించే సమగ్ర ప్రణాళికలేవీ లేవు. చేతగానితనానికి ఒకే నెపం కరోనా లాక్‌ డవున్‌. రాష్ట్రాల మధ్య వలస కార్మికుల ప్రయాణాలను అనుమతించబోమని, ఉన్న రాష్ట్రంలోనే వారికి ఉపాధి గ్యారంటీ పనులు ఇవ్వడానికి కొన్ని మార్గదర్శకాలను ఏప్రిల్‌ 20న కేంద్రం విడుదల చేసింది. కార్మికులు దగ్గరలో ఉన్న కేంద్రాలలో రిజిస్టర్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారున్న చోటికి వెళ్లి రిజిస్టర్‌ చేయాలనే బాధ్యతను యంత్రాంగం పైన మోపలేదు.

సరైన ప్రణాళిక ప్రకారం కూలీలను గుర్తించి వారు తిరిగి వారి ఊళ్లకు వెళ్లేదాకా లేదా వారికి పని దొరికి వారంతట వారే సంపాదించుకునే దాకా వారిని పోషిం చడం. లేదా వారిని సొంతరాష్ట్రాలకు తరలించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, మతాదాయ సంస్థల బాధ్యత. కేరళలో వచ్చి పడిన లక్షలాది వలసకూలీల బాంక్‌ అకౌంట్ల వివరాలతో డేటా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డేటా సేకరిస్తే తగిన ప్రణాళికలు సాధ్యం. బ్యాంక్‌లో డబ్బు వేసినా తీసుకోవడానికి వీరు వెళ్లగలరా? ప్రసంగాలు, మార్గదర్శకాలు, సలహాలు, ప్రకటనలు జారీచేయడం అనే సులువైన పబ్లిసిటీ వ్యూహాలు దాటి కేంద్రం నిర్మాణాత్మకంగా పనులు చేసి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటే బాగుండేది. పాలకులు ముందుచూపు లేని బదిరాంధులు కాకపోతే బాధ్యతలు తెలుస్తాయి.

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top