జనం నిరసనాస్త్రం ‘నోటా’

ABK Prasad Article On NOTA Votes - Sakshi

రెండో మాట

రాజకీయ శక్తుల్లో నానాటికీ పేరుకుపోతున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని లంచగొండితనాన్ని, సంతలో పశువులను కొన్నట్టే ఓట్లను కొనవచ్చునన్న ధీమాను ధనికవర్గ వ్యవస్థ పెంచుతూ వచ్చిన దాని ఫలితమే ‘నోటా’గా పరిణమించింది. పాలకుల తప్పుడు ఆచరణకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఎన్నికల ఓటింగ్‌ నిర్వహణ ప్రక్రియలో ‘నోటా’ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకునే అవకాశం కల్పించవలసి వచ్చింది. ఇటీవలే అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా లక్షలమంది ఓటర్లు నోటాకు ఓటువేయడం రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల అభిశంసనగానే గుర్తించాలి. నోటా ఇప్పుడు ప్రజలకు మిగిలిన ఏకైక ఆయుధం.

‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ (తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో) ఎన్నికల ప్రక్రియ ఆద్యంతమూ డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా ఈ డబ్బులు పంపిణీ చేశారు. అధికారుల తనిఖీల్లో భారీ స్థాయిలో తెలం గాణలో నగదు పట్టుబడింది. ఇంత పెద్ద మొత్తంలో ధన ప్రభావం ఇంత వరకూ జరగలేదు. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం కూడా పూర్తిగా విఫలమయింది. ఓటర్ల జాబితాల్లోనూ భారీగా అక్ర మాలు జరిగాయి. రేపో మాపో పంచాయతీ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇది గుణపాఠం కావాలి’’
– 30 ప్రసిద్ధ ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థల (ఎన్జీవోస్‌) ‘ఎలెక్షన్‌ వాచ్‌’ సంయుక్తంగా జరిపిన నిఘా నివేదిక వెల్లడి (15.12.2018)

‘‘తెలంగాణలో 2014 నాటి ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ నాకు నచ్చలేదని (నో టు–ఎబౌ) ‘నోటా’ గుర్తుకు తొలిసారిగా ఓటర్లు వేసిన ఓట్ల సంఖ్య భారీగా 47 శాతానికి చేరి మొత్తం ‘నోటా’ ఓట్ల సంఖ్య 2.5 లక్షలకు పెరి గింది. అలాగే రాజస్తాన్‌లో సంప్రదాయ పార్టీలైన సమాజ్‌వాదీ, ఎన్‌సీపీ, ఆర్‌.ఎల్‌.డి., కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీలకు వచ్చిన ఓట్ల కన్నా ‘నోటా’ ఓట్లు 4,67,781 ఓట్లుగా నమోదైనాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో ‘నోటా’ ఓట్లు 5,42,295లుగా, ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’ పంచుకున్న ఓట్లు 2,82,744గా, మిజోరాంలో స్థానిక పార్టీలకన్నా 0.5 శాతం ఓట్లు ఎక్కువ గాను నోటా పంచుకుంది’’
– కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటన

ఇంతై, ఇంతింతై వటుడింతై నభో మండలానికి యాత్ర కట్టాడన్న సామెతగా గత 70 ఏళ్ల గణతంత్ర భారతంలో ఏ తొలి రెండు మూడు జనరల్‌ ఎన్నికలు మినహా ఆ తరువాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో పాలకపక్ష రాజకీయాలు, నాయకులు ప్రజా ప్రయోజనాలకు, నీతికి, విలువలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నందుననే ప్రకటిత ప్రజా స్వామ్యానికి ప్రత్యామ్నాయాన్ని క్రమంగా ప్రజలు ఎన్నుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పాలకుల భాగోతాన్ని, ఎన్నికల కమిషన్‌ అచేతనత్వాన్ని కనిపెడుతూ వచ్చింది. రాజకీయ శక్తుల్లో నానాటికీ పేరుకుపోతున్న అవినీతిని, పాల కుల ఆశ్రిత పక్షపాతాన్ని లంచగొండితనాన్ని, సంతలో పశువులను కొన్నట్టే ఓట్లను కొనవచ్చునన్న ధీమాను, నమ్మకాన్ని ధనికవర్గ వ్యవస్థ పెంచుతూ వచ్చిన దాని ఫలితమే ‘నోటా’గా పరిణమించింది. ప్రజా స్వామ్యం గురించిన పాలకుల ఆచరణకు ‘సుప్రీం’ అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఎన్నికల ఓటింగ్‌ నిర్వహణ ప్రక్రియలో ‘నోటా’ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకునే అవకాశం కల్పించవలసి వచ్చింది. ఈ అవకా శాన్ని (నోటా) ప్రజాస్వామ్య వ్యవస్థను, దానికున్న పవిత్రమైన విలు వను అపహాస్యం చేయడంగా భావించకూడదు. ప్రజలకున్న ఏకైక ఆయుధం ‘నోటా’ అన్న భావన క్రమంగా అల్లుకుపోవడానికి రాజకీయ వ్యవస్థ అవినీతే ప్రధాన కారణం.

ఇంతకుముందు ‘సుప్రీం’ 2013–2014 (సెప్టెంబర్‌)లోనే ఓటింగ్‌ క్రమంలో ఓటర్లకు ఫలానా ‘అభ్యర్థుల్ని తిర స్కరిస్తున్నా’నని తిరస్కార ఓటును (నోటా) నమోదు చేసే హక్కును తొలిసారిగా కల్పించింది. మొదటిసారిగా ఈ హక్కును 2014లో అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్ని కల్లో వినియోగంలోకి తెచ్చారు. ఈ హక్కును వినియోగించుకునేందుకు ప్రిసైడింగ్‌ ఆఫీసరు అనుమతి అక్కర్లేదు. ఆయా రాష్ట్రాల మొత్తం ఓటర్ల సంఖ్యలో ‘నోటా’ ఓట్ల సంఖ్య తక్కువగానే కన్పించవచ్చు. కానీ ‘నోటా’ ఓటర్ల సంఖ్య క్రమంగా ప్రతి ఎన్నికలకు పెరుగు తోందన్నది గమనార్హం. కూలంకషంగా ఎన్నికల సంస్కరణల నిర్వహణ జరిగేంతవరకూ, ‘నోటా’కు విలువ ఉంటుంది. కేజ్రీవాల్‌ పార్టీ ‘ఆప్‌’ అభ్యర్థి దివంగత కమెడియన్‌ జస్వాల్‌ భట్టీ భార్య, నటీమణి సావిత్రి భట్టీ ఇటీవల ‘నోటా పార్టీ’ని నెలకొల్పింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా కరెన్సీ నోట్లను ప్రక టించింది. ఈ విన్యాసానికి ప్రధాన కారణం– ప్రజలకు ప్రజాస్వా మ్యంలో విశ్వాసం లేక కాదు. ఇది పాలకులు అసంఖ్యాక బడుగు, బల హీన వర్గాల, మైనారిటీ ప్రజల బాగోగులను విస్మరించి ధనికవర్గ ప్రయో జనాలకు కాపలాదారులుగా వ్యవహరిస్తుండటానికి ప్రతిస్పందనే.

చివరికి 9 మాసాలకు ముందుగానే శాసనసభను నిరంకుశంగా రద్దు చేసే హక్కును రాజ్యాంగం పాలకులకు కల్పించకపోయినా దూకు డుమీద ముందుకుసాగడం, ఆ ప్రక్రియలో భాగంగా లక్షలాదిమంది పేర్లు తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు నిరసనగా ఓటర్లు, ప్రతిపక్షాలు వీధుల్లోకి రావలసిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 22 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతు కావటం నిజ మేనని అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ‘అర్హత ఉండీ, జాబితాలో పేర్లు లేక, ఓట్లు వేయలేకపోయిన వారిని నేను క్షమాపణ వేడుకుంటున్నా. మరోసారి ఇలా జరక్కుండా జాగ్రత్తప డతాం. వ్యవధి లేకుండా, ముందస్తుగానే అసెంబ్లీ రద్దు కావటం, సమ యం లేక ఎన్నికల్ని ఆరుమాసాల్లోనే పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటం, తదితర కారణాలవల్ల గల్లంతైన ఓటర్లపైన దృష్టిపెట్టేంత సమయం లేకపోయింద’ని సరిదిద్దుకోలేని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఒకవైపున ఇదే ఉన్నతాధికారి ఎన్నికల ప్రణాళికలో పార్టీలు ఉచిత హామీలను ఓటర్లకు ఇవ్వజూపరాదని స్పష్టం చేసినా, అధికారపక్షం అసెంబ్లీ వ్యవధి ముగియడానికి 9 నెలలు ముందే ఆకస్మికంగా దానిని రద్దుచేసి ఎన్నికలను తీసుకొచ్చింది. అంతేకాకుండా రూ. 50,000 కోట్లు వ్యయం కాగల ఉచిత హామీలను పోటాపోటీలమీద ప్రకటించి కూర్చుంది. ‘ఉచిత హామీల’ వల్ల గెలుపు ఖాతా తెరుచుకోవడానికి ఎన్నికల అడ్డదారి దొరక వచ్చునేమోగానీ పాలకులు ‘అక్కరకురాని చుట్టాలు’గానే ప్రజల దృష్టిలో మిగిలిపోతారు. అందుకనే అలాంటి ఉచిత హామీలను గెలిచే పార్టీ చేసినవైనా, ఓడిపోయే పార్టీ చేసేవైనా వాటికి ఆచరణ విలువ ఉండాలి. ప్రాజెక్టుల లేదా ఇతర మేజర్‌ హామీలను అమలుపరచడంలో జాప్యానికి లేదా ఏళ్ల తరబడి సాచివేతకు ఎన్నో కారణాలు చూపడం పాలకులకు అలవాటు.

అందుకని ప్రజలకు తామిచ్చిన హామీలు అయిదేళ్లయినా నెరవేర   నప్పుడు ఎన్నికలు ముగిసిన మర్నాడే, అంతకుముందు హామీపడిన ప్రాజెక్టుగాని, పథకాలుగాని మందకొడిగా నత్తనడకలో సాగుతున్నం  దుకు కారణం ఏమిటి?  చెప్పిన హామీకి కట్టుబడి బొక్కసం నుంచి నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైనందునా, లేదా బొక్కసంలోనే అసలు నిధులు లేకనా అన్నది పాలకుడికి తెలియాలేగానీ అందుకు ఉన్నతాధికారులను నిందించి, వారిపై ఆగ్రహించి, కళ్లురిమి, పళ్లు నూరి నందున లాభం లేదు. హామీలివ్వడం, ఆదేశాలివ్వడం పాలకుడికి ఖర్చు లేని పని, ఓట్లు దండుకోవడానికి ‘సులభ గణితం’ సరిపోతుం దేమో కానీ పాలకుల గణాంకాలు లెక్క తప్పి హామీలు ‘గుంటపూలు’ పుడ్తు న్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంతో నమ్ముకుని ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టుగా కళ్లుకాయలు కాచేలా మంచి రోజుల కోసం 70 ఏళ్లు కూడా చాలక, ఇంకా ఇంకా ఎదురుతెన్నులు చూస్తున్న సామాన్య ప్రజాబాహుళ్యానికి, ఉత్తుత్తి హామీలకు విమోచన ఎప్పు డన్నది ఈ దోపిడీ వ్యవస్థలో ఎప్పటికీ ‘శేష ప్రశ్న’గానే మిగిలిపోతుంది.

ఇంతకూ హామీపడిన పథకాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్ర మాలు అనుకున్న రీతిలో ఎందుకు అమలు జరగవో, అమలు కోసం అడ్డు తగులుతున్న కారణాలు తెలుసుకోవాలంటే ఎన్నికల్లో (2014) పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తులు సగటున ఎలా పెరుగుతూ వచ్చాయో తెలుసుకోవాలని ‘ఎలెక్షన్‌ వాచ్‌’ కోరుతోంది. అభ్యర్థుల ఆస్తులు సగ టున రూ. 8.59 కోట్లు కాగా, అవి 2018లో తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ తలొక్కరికి రూ. 15.03 కోట్లకు పెరిగిపోయింది. 40 మంది శాసనసభ్యులు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అంతకుమిం చిన ఆస్తులున్నట్టు ప్రకటించారు. కాగా ఆస్తులు పెంచుకున్నవారిలో అగ్రభాగాన ఉన్న ముగ్గురి ఆస్తుల విలువ రూ. 90 కోట్లనీ, అప్పులు రూ. 91 కోట్లనీ ప్రకటించుకున్నారు. కాగా 88 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు, 19 మంది నేషనల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కాగా, వారిలో ఒక్కొ క్కరికి రూ. 10.84 కోట్లు ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లు వెల్లడించాయి. వీరిలో ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకైతే రూ. 314 కోట్ల పై చిలుకు ఆస్తులు న్నాయి, ఎమ్‌ఐఎమ్‌ ఎమ్మెల్యేలు 7 గురికి సగటున ఒక్కొక్కరికి రూ. 10.84 కోట్లు ఆస్తులున్నాయి. ఒక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి రూ.161 కోట్ల ఆస్తి ఉంది. ఇలా మొత్తం 119 మంది తెలంగాణ శాసనసభ్యుల్లో 106 మంది కోటీశ్వరులే. ఎన్నికైన వారిలో 70 మంది (61 శాతం) పైన క్రిమి నల్‌ కేసులున్నాయి.

ఇప్పుడు చెప్పుకోండి– ‘నోటా’ ఓటర్లు వందల సంఖ్య నుంచి, వేలకు వేలు లక్షలకు, లక్షలు కోట్ల సంఖ్య వైపుగా విస్తరించడానికి ప్రస్తుత ప్రజాస్వామ్యం మేడిపండుగా, అవినీతికి మారుపేరుగా అవతరించడం కారణమా లేక ధనిక వర్గ వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకనా అన్నది అసలు ప్రశ్న. దుర్యోధనుడికి ఏది మంచో తెలు సుగాని, దానివైపు అతడి మనస్సు మళ్లదట, చెడు ఏదో తెలుసుగాని దానినుంచి అతడి మనస్సు తప్పుకోదట.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top