అప్పటి నుండి భయం పట్టుకుంది

Venati Shobha Sexual Problems Solutions In Funday - Sakshi

సందేహం

మెనోపాజ్‌ లక్షణాల గురించి రెండు, మూడు సార్లు వినడం జరిగింది. అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఒకలాంటి భయం పట్టుకుంది. మెనోపాజ్‌ సమస్యలను తగ్గించడానికి ఎలాంటి  ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలి, మెనోపాజ్‌ దశలో బరువు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సీయన్, నెల్లిమర్ల
నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్‌ ఒక సంవత్సరం పాటు రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్‌ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల పనితీరు మందగించిపోయి వాటి నుంచి స్రవించే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ దాదాపుగా పూర్తిగా ఆగిపోవడం వల్ల మెనోపాజ్‌ లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమయంలో శరీరంలో నుంచి ఉన్నట్లుండి వేడిగా ఆవిర్లు రావడం, అంతలోనే చెమటలు పట్టడం (హాట్‌ ఫ్లషెస్‌), గుండె దడగా ఉండడం, ఒళ్లు నొప్పులు, అలసట, మతిమరుపు, డిప్రెషన్, మూత్రసమస్యలువంటి లక్షణాలు ఒకొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడవచ్చు.
మెనోపాజ్‌ దశలో అందరూ బరువు పెరగాలని ఏమిలేదు. ఈ సమస్యలను పూర్తిగా రాకుండా నివారించలేము. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఆహారంలో సోయాబీన్స్‌ వాటి ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు, పాలు, పెరుగువంటివి తీసుకోవడం, ఉండే పరిసరాలు చల్లగా ఉండేట్లు చూసుకోవడం, యోగా, నడక, ధ్యానం వంటివి తప్పనిసరిగా చేయడం వల్ల మెనోపాజ్‌ దశ నుంచి చాలావరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే బరువు పెరగకుండా, ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి. ఇంకా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను మాత్రల రూపంలో లేదా స్ప్రేలాగా, జెల్‌లాగా తక్కువ మోతాదులో వాడుకోవచ్చు.

మా అత్తగారికి పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అపుడప్పుడూ కళ్లు తిరిగి పడిపోతుంది. దీని గురించి వైద్యం మీద కాస్త అవగాహన ఉన్నవారిని సంప్రదిస్తే ‘డిఫికేషన్‌ సింకప్‌ కావచ్చు’ అంటున్నారు. ఇది నిజమేనా? డిఫికేషన్‌ సింకోపి  ఎందుకు వస్తుంది? చికిత్స పద్ధతుల గురించి తెలియజేయండి.
– డి.మాలతి, సంగారెడ్డి
పొత్తి కడుపులో నొప్పి రావటానికి, కళ్లు తిరిగిపడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ అత్తగారి వయసు ఎంత? బీíపీ, షుగర్‌లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది రాయలేదు. కొంతమందిలో కొన్నిరకాల ఒత్తిడులకు గురైనప్పుడు లేదా  ఏదైనా ఉన్నట్లుండి తీవ్రమైన నొప్పికి గురైనప్పుడు రక్తంలో కొన్ని రకాల హార్మోన్స్‌ విడుదలయ్యి, కొన్ని నరాలను స్పందింపజేసి మెదడుకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించడం జరుగుతుంది. అలాగే గుండె తక్కువగా కొట్టుకుంటుంది. 
దీనివల్ల  మెదడుకి ఉన్నట్లుండి రక్తసరఫరా, ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. దీనినే వేసోవేగల్‌ షాక్‌ అంటారు. అలాగే కొందరిలో మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడటం వల్ల కళ్ళు తిరిగి పడుతుంటారు. దీనినే డిఫికేషన్‌ సింకప్‌ అంటారు. ఇది ఎందుకు, ఎవరికి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేము. కారణాలను బట్టీ చికిత్స పద్ధతులు ఉంటాయి. మొదట మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మొదట మీ అత్తగారిని డాక్టర్‌కి చూపించి పొత్తికడుపు నొప్పికి, కళ్ళు తిరిగిపడటానికి గల కారణాలను విశ్లేషించుకొని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది.

నేను చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్‌ అవుతుంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ఈ సమయంలో ‘స్ట్రెస్‌’ పడితే ‘చైల్డ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ సమస్య ఏర్పడుతుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం? ‘ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌’ అంటే ఏమిటి?
– ఆర్‌.శ్రావణి, జహీరాబాద్‌
సాధారణంగా గర్భంలో బిడ్డ తొమ్మిదినెలల పాటు పెరిగేటప్పుడు బిడ్డ శారీరక  ఎదుగుదలే కాకుండా మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. తల్లి ఆరోగ్యపరిస్థితి, మానసిక పరిస్థితిని బట్టి బిడ్డ మానసిక ఎదుగుదల కొద్దిగా ఆధారపడి ఉంటుంది. తల్లిలో ఉండే స్ట్రెస్‌లెవెల్స్‌ను బట్టి, స్ట్రెస్‌ మరీ తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు బిడ్డ మానసిక ఎదుగుదల మీద ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, తల్లి సరిగా ఆహారం, మందులు తీసుకోకపోవడం వల్ల కూడా బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడవచ్చు. చైల్డ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఏర్పడటానికి తల్లి మానసిక ఒత్తిడి ఒక్కటే కారణం కాదు.

దీనికి తల్లి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునే కొన్ని యాంటిడిప్రెసెంట్‌ మందుల వల్ల తల్లిలో స్మోకింగ్, ఆల్కహాల్‌...కొన్ని జన్యుపరమైన కారణాలు ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల రావచ్చు. కాబట్టి గర్భం దాల్చక ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మందులు డాక్టర్‌ సంరక్షణలో తీసుకోవటం, గర్భిణి సమయంలో యోగా, నడక, ప్రాణాయామం, ధ్యానం వంటివి పాటిస్తూ, సరైన పౌష్ఠికాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. దీనినే ‘ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌’ అని అంటారు. ఇందులో మరీ ఎక్కువ బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం.

డా. వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top