హంతకుడు దొరికాడు

Telugu Weekly Crime Story In Funday - Sakshi

క్రైమ్‌ స్టోరీ

అది రాజగోపాలంపేట పోలీసు స్టేషన్‌. నగర శివారు ప్రాంతంలో ఉంది. చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఏమాత్రం భంగం వాటిల్ల కుండా చూసుకునే స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర అంటే సామాన్య ప్రజలకు ఎనలేని గౌరవ భావం. అతను వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 
ఆ పోలీసు స్టేషన్‌ ప్రాంతంలోనే ఒక ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో చదివే భరత్‌ ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బైక్‌ మీద కాలేజీకి వెళ్ళిన అతను రాత్రయినా ఇంటికి రాక పోయేసరికి ఇంట్లో కంగారు మొదలయ్యింది. అతని తండ్రి రాఘవరావుకు మరీను! సెల్‌కు ఫోన్‌ చేస్తుంటే స్విచ్‌ ఆఫ్‌ అని వస్తుండటంతో రాఘవరావు మనసు ఏదో కీడు శంకిస్తోంది. భరత్‌ స్నేహితులకు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఆ రాత్రంతా ఎవరూ ఇంట్లో నిద్రపోలేదు. తెల్లవారింది. అయినా భరత్‌ జాడ కానరాలేదు. ఇక లాభం లేదని రాఘవరావు నేరుగా రాజగోపాలంపేట పోలీసు స్టేషన్‌కు దారి తీశాడు. 

ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర కంప్లైంట్‌ రాయించుకొన్నాడు. భరత్‌ ఫొటో అడిగి తీసుకున్నాడు. నిశితంగా ఒకసారి ఫోటోను పరిశీలిస్తూ... దిగులు పడకండని రాఘవరావుకు భరోసా ఇచ్చాడు. తన సహాయకుడు శ్రీధర్‌ను పిలిచి భరత్‌ ఫోటో ఇచ్చి అతను చదివే కాలేజీకి పంపించాడు రవీంద్ర.
మధ్యాహ్నం దాదాపు రెండు గంటలు కావస్తోంది. రవీంద్ర అప్పుడే భోజనం చేసుకుని వచ్చి కాలేజీ తాలూకు ఫిర్యాదులేమైనా ఉన్నాయా అని పాత ఫైళ్ళు తిరగేస్తున్నాడు. ఇంతలో టేబుల్‌ మీదున్న లాండ్‌ ఫోన్‌ మ్రోగింది.’’హలో’’ అన్నాడు రవీంద్ర. ‘‘నా పేరు చంద్రయ్య సార్‌! రాజగోపాలంపేట ఊరవతల దిగుడు బావిలో మెట్లమీద ఎవరో ఒకతను పడి ఉన్నాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. మీరు వెంటనే రావాలి సార్‌!’’ అన్నాడు. 

ఇంతలో శ్రీధర్‌ రావడంతో జీపు తీయమంటూ పురమాయించాడు తరువాత అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు. 
ఘటనా స్థలానికి పోలీస్‌ జీపు చేరుకుంది. ‘‘నేనే సార్‌! చంద్రయ్యను... పశువుల కాపరిని. ఒక కుక్క ఎప్పుడూ నాతో పాటూ ఉంటుంది. అది అటూ ఇటూ తిరుగుతూ బావి దగ్గరకు వచ్చి ‘భౌ.. భౌ’మని అరవసాగింది ఏమిటా అని నేను తొంగి చూశాను. ఎవరో ఒకతను మెట్లమీద రక్తపు మడుగులో  పడి ఉండడం చూసి, చాలాసార్లు పిలిచాను. అతను పలకలేదు. వెంటనే మీకు ఫోన్‌ చేశాను’’ అన్నాడు.  
చంద్రయ్య ముందుగా బావిలోకి దిగుతూ శ్రీధర్‌ దిగడానికి సహకరించాడు. ఇద్దరూ కలిసి ఆగంతకుణ్ణి బయటకు తీశారు. రవీంద్ర భృకుటి ముడిపడింది. అతను భరత్‌.
భరత్‌ శ్వాసను శ్రీధర్‌ పరీక్షిస్తుండగా, రవీంద్ర తన మొబైల్‌తో వీడియో తీయసాగాడు. ‘‘సర్‌... శ్వాసాడుతోంది’’ అన్నాడు శ్రీధర్‌. అంతా ఆశ్చర్యపోయారు. 
ఇంతలోనే అంబులెన్స్‌ చేరుకుంది. చంద్రయ్య సహాయంతో భరత్‌ను అంబులెన్స్‌లోకి ఎక్కించాడు శ్రీధర్‌. రవీంద్ర సూచనలతో అంబులెన్స్‌ సిటీ హాస్పిటల్‌కు వాయువేగంగా బయలుదేరింది. 
రాఘవరావుకు ఫోన్‌ చేసి హాస్పిటల్‌ చిరునామా ఇచ్చాడు రవీంద్ర. తరువాత చంద్రయ్యతో మెప్పుకోలు వచనాలు పలుకుతూ భరత్‌ బైకు గురించి ఆరా తీశాడు. తనకేమీ తెలియదన్నాడు చంద్రయ్య. 
రవీంద్ర రావడం చూసి రాఘవరావు దంపతులు.. వారి కూతురు భూమిక కన్నీరు మున్నీరయ్యారు. 

‘‘సర్‌ భరత్‌ను ఐసీయూలో చేర్చారు. రక్తం ఎక్కిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు’’ అంటూ రెండు చేతులా దండం పెట్టసాగాడు రాఘవరావు. 
‘‘నిన్న అనగా బావిలో పడ్డ మనిషి బతికి ఉండడమే గొప్ప అదృష్టం. చంద్రయ్య చూశాడు గనుక సరిపోయింది. అధైర్య పడకండి సర్‌. మిమ్ముల్ని చూసి మీ వాళ్ళు మరింత ఇదైపోతారు’’ అని ఓదార్చుతూ... బైకు మాత్రం కనబడలేదని దాని గురించిన సమాచారం ఇతర పోలీసు స్టేషన్లకు కూడా ఇచ్చామని చెప్పాడు రవీంద్ర. 
భరత్‌ సంఘటన తరువాత ఆ కాలేజీ లెక్చరర్‌ భాస్కర్, స్టూడెంట్‌ రాధిక కాలేజీకి రావడం లేదని శ్రీధర్‌ ఫోన్లో రవీంద్రకు చెప్పాడు. రవీంద్రకు అనుమానం కలిగింది. తన పోలీసు బుర్రకు పదును పెట్టి వారిద్ధరి వ్యవహార శైలి కనుక్కోమని శ్రీధర్‌కు కోడ్‌ భాషలో చెప్పాడు.
∙∙ 
‘‘సర్‌! గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ ...’’ అంటూ భాస్కర్, రాధికల గురించి తను సేకరించిన విషయాలు చెప్పాడు శ్రీధర్‌.
రవీంద్ర గబగబా అడుగులు వేసుకుంటూ హాస్పిటల్‌ ఆవరణలోకి ప్రవేశించగానే భాస్కర్‌ గుండె ఝల్లుమంది. ‘పోలీసులు సామాన్యులు కారు’ అని మనసులో అనుకుంటూ... పెదవులపై చిరునవ్వు అద్దుకుని రవీంద్రను విష్‌ చేస్తూ... ‘‘సార్‌!...నేనే మీకు ఫోన్‌ చేద్దామనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు. రాధికను ఐసీయూ నుంచి వార్డులోకి మార్చారట. నేనూ ఇప్పుడే వచ్చాను’’ అంటూ రాధిక బెడ్‌ దగ్గరకు ఇద్దరూ కలిసి వెళ్ళారు. 
‘‘నౌ షీ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ డేంజర్‌’’ అంటున్నాడు రాధిక తండ్రితో డాక్టర్‌.
‘‘ఏం జరిగింది’’ అన్నాడు రవీంద్ర. 

‘‘సార్‌! నా పేరు సత్యనారాయణ. భరత్‌ మా అమ్మాయి వెంట పడటం గమనించాను. ‘నాకు ప్రేమ పట్ల ఆసక్తి లేదు మనం స్నేహితులుగానే ఉందామ’ని సున్నితంగా తిరస్కరించింది మా అమ్మాయి. అయినా అతను వినకపోవడంతో ఈ విషయాన్ని భాస్కర్‌ గారికి చెప్పిందట. భరత్‌ను బుద్ధిగా చదువుకోవాలని, ఇష్టంలేని అమ్మాయిని మానసికంగా వేధించరాదని, పద్ధతి మార్చుకోకుంటే ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్య తీసుకోవాల్సి వస్తుందని మందలించాట్ట’’
‘‘మరి రాధిక ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది?’’ అంటూ అతని మాటల మధ్యలోనే అడిగాడు రవీంద్ర. 

‘‘అదే నేను చెప్పబోతున్నాను సార్‌! భరత్‌ పూర్తిగా మారిపోయినట్టు... మంచి స్నేహితులుగా ఉందామని మా అమ్మాయిని నమ్మించాడు. నిన్న స్పెషల్‌ క్లాస్‌ అయ్యాక మా అమ్మాయిని తీసుకుని భరత్‌ బైక్‌ మీద బయలుదేరాడు. దారిలో భరత్‌ మళ్లీ ప్రేమ ప్రస్తావన తెచ్చాడట. అలాంటి ఉద్దేశం లేదని ఇంతకు ముందే చెప్పాకదా అందట. అతను బండిని వేగంగా పోనిస్తూ ఘర్షణకు దిగాడట. మళ్ళీ మొదటికి వచ్చావా నీవు మారావని నీ బైక్‌ ఎక్కాను. బైక్‌ ఇక్కడే ఆపు... దిగిపోతానని వేడుకుందట మా అమ్మాయి. 
‘నీ ప్రేమను పొందలేక పోయాను... నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. ఇద్దరం కలిసే చద్దాము’ అని బైక్‌ను అతి వేగంగా దిగుడు బావి వైపు పోనిచ్చాడట. అది గమనించి రాధిక పక్కకు దూకేసిందట. 

రాధిక చిన్న చిన్న గాయాలతో మెల్లగా లేచి బావి వద్దకు వెళ్లి చూసిందట. బైక్‌ బావి గట్టుకు ఆనుకుని పడిపోయి ఉందట. భరత్‌ రక్తపు మడుగులో బావి మెట్ల మీద పడి ఉండటం చూసి పలుమార్లు పిలిచిందట. భరత్‌లో ఉలుకూ పలుకూ లేకపొయ్యేసరికి భయపడి గాబరాగా ప్రధాన రోడ్డు వరకు లేని ఓపికను కూడదీసుకొని పరుగెత్తి, అక్కడ ఒక ఆటో పట్టుకుని ఇల్లు చేరుకుంది.
అమ్మాయి పరిస్థితి చూడగానే మేము గాబరా పడిపోయాం. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి గాయాలకు కట్లు కట్టించాను. భరత్‌ చనిపోయి ఉంటాడనుకుని... నేరం తన మీద వస్తుందేమోనని... నా పిచ్చితల్లి నేను వాడే నిద్ర మాత్రలు మింగింది’’ అంటూ భోరుమన్నాడు సత్యనారాయణ. 

‘‘రాధికను రక్షించే క్రమంలో మీరు చెప్పింది అబద్ధమని ఎందుకు అనుకోకూడదు?’’ అడిగాడు రవీంద్ర పోలీసు ఆఫీసరు తరహాలో. 
మౌనంగా రోదించసాగాడు సత్యనారాయణ. 
‘‘భరత్‌ ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాడు అతనికి çస్పృహ వస్తే కాని నిజం బయటపడదు’’ అన్నాడు రవీంద్ర. 
రవీంద్ర జీపు స్టార్ట్‌ చెయ్యబోతుంటే సెల్‌ ఫోన్‌ మోగింది. ఆన్‌ చేశాడు, అది శ్రీధర్‌ ఫోన్‌. 
‘‘హలో సార్‌... భరత్‌ బైక్‌ దొరికింది. కానీ దొంగిలించిన వాడికీ ఈ కేసుకూ ఎలాంటి సంబంధం లేదు ’’ అంటూ సమాచారమిచ్చాడు శ్రీధర్‌. 
‘‘రాధిక విషయం ఎవ్వరికీ తెలియనీయకండి సార్‌! భరత్‌ కోలుకున్నాక అన్నీ చక్కబడతాయి. నేను కూడా మీ వెనకాలే వస్తున్నాను పదండి’’ అని సత్యనారాయణ గారికి చెప్పి బైక్‌ మీద బయలుదేరాడు భాస్కర్‌. 

రవీంద్ర సిటీ హాస్పిటల్‌ చేరే సరికి భాస్కర్‌ కూడా అక్కడకు చేరుకున్నాడు. ఐసీయూలో ఉన్న భరత్‌ను చూడడానికి వెళ్లాడు. అతనికి రక్తం ఎక్కిస్తున్నారు. భారత్‌ను చూసేందుకు డాక్టరు అనుమతి లభించలేదు. 
భరత్‌ తల్లిదండ్రులు రాఘవరావు దంపతులను, చెల్లెలు భూమికను పరామర్శించి ధైర్యం చెప్పి భాస్కర్‌ వెనుదిరిగాడు. రవీంద్ర కూడా చేసేదేమీ లేక స్టేషన్‌ బయలుదేరాడు. 
మూడు రోజులు గడిచాయి. ప్రమాదం నుంచి భరత్‌ బయటపడినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా  తెలుసుకున్నాడు రవీంద్ర. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి భారత్‌ను చూసి వచ్చాడు. 
కానీ మరుసటి రోజు తెల్లవారు ఝామున హాస్పిటల్‌ నుంచి భరత్‌ చనిపోయాడు అంటూ ఫోన్‌ వచ్చింది. రవీంద్ర నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళాడు. 
రవీంద్రను చూడగానే ‘‘సారీ ఇన్సె్పక్టర్‌! మా ప్రయత్నమంతా చేశాం. అనుకోకుండా గుండెలో అవాంతరమేర్పడింది. అది గమనించి ట్రీట్‌మెంట్‌ మొదలు పెడుతుండగానే... హీ ఈజ్‌ నో మోర్‌’’ అంటూ ఆవేదన వ్యక్తపరిచాడు డాక్టర్‌. 
‘‘అలా ఎందుకు జరిగిందంటారు?’’ అని ఆరా తీశాడు రవీంద్ర. 

‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే గానీ తెలియదు. ముందు మీకు ఇన్‌ఫాం చేయాలి కదా అని ఫోన్‌ చేశాను. ఇంకా అతని పేరెంట్స్‌కు చెప్పలేదు’’ అంటూ పెదవి విరిచాడు డాక్టర్‌. 
‘‘సరే డాక్టర్‌... సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తుంది కదా’’ అడిగాడు రవీంద్ర.
‘‘వస్తుంది’’ అన్నాడు డాక్టర్‌.
రవీంద్ర నేరుగా స్టేషన్‌కు వెళ్ళి తల పట్టుకుని కూర్చున్నాడు. అలా ఎందుకయ్యింది? ఆరోగ్యం మెరుగవుతున్న భరత్‌ అకస్మాత్తుగా పోవడమేమిటీ..! ఇందులో ఏదైనా తిరకాసు ఉందా...? అని మదిలో ఆలోచన చెలరేగగానే ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా చటుక్కున లేచి కార్యోన్ముఖుడయ్యాడు. 
అనుకున్నట్టుగానే సాయంత్రానికల్లా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చింది. అందులో భరత్‌ పై విషప్రయోగం జరిగిందని తేలింది. ‘అడ్రినలిన్‌’ అనే మందును ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్‌ చెయ్యడం వల్ల భరత్‌ గుండెకు ప్రమాదం వాటిల్లిందని వివరణ ఉంది.
రవీంద్ర అనుమానం ధ్రువపడింది. కేసు తేలిపోయిందని తన మనసులోకి రాగానే పెదవులపై చిరునవ్వు మొలిచింది. వెంటనే శ్రీధర్‌ను పిలిచి, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను తీసుకుని వెళ్ళి జరగాల్సిన పనులను పురమాయించాడు. 

తాను నేరుగా సిటీ హాస్పిటల్‌కు వెళ్ళి హాస్పిటల్‌ చైర్మెన్‌ను కలిశాడు. విషయం వివరించి దానికి సంబంధించిన సాక్ష్యాలు తన సెల్‌ఫోన్‌లో చూపించాడు. ఆ రాత్రి ఐసీయూ దగ్గర ఉన్న కాపలాదారును పిలిచి అడిగేసరికి నిజం బయట పడింది. ఇక మిగిలింది శ్రీధర్‌  తీసుకు రావాల్సిన మనిషిని ఇంటారాగేట్‌ చేస్తే సరిపోతుందని మనసులో అనుకుంటూ తిరిగి స్టేషన్‌ చేరుకున్నాడు రవీంద్ర. అప్పటికే రాధిక తండ్రి సత్యనారాయణను తీసుకు వచ్చాడు శ్రీధర్‌. సత్యనారాయణను చూడగానే ఎక్కడ లేని ఆవేశంతో ఊగిపోయాడు రవీంద్ర. తనదైన శైలిలో లాఠీ ఊపుకుంటూ... కళ్ళలో నిప్పులు కురిపించుకుంటూ... వస్తున్న రవీంద్రను చూడగానే సత్యనారాయణకు ముచ్చెమటలు పోశాయి. గజగజ వణకసాగాడు. లాఠీ గాలిలోకి లేచింది. సత్యనారాయణ నోరు భయంతో విప్పుకుంది. చేతులను లాఠీకి అడ్డు పెడుతూ... సార్‌.. జరిగింది చెబుతాను’’ అంటూ భోరుమన్నాడు. 
ఇంతలో విషయం తెలుసుకొని విలేఖరులు వచ్చారు. 

‘‘భరత్‌ చనిపోయాడని, సాక్ష్యం లేదని... ఏమీ కాదని... నేను మా అమ్మాయికి ఎంతో ధైర్యం చెప్పాను. అయినా మా అమ్మాయి నిద్రమాత్రలతో ఆత్మహత్యకు పూనుకుంది. మీకు తెలిసిందే... అదృష్టవశాత్తు అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయట పడింది. కానీ ఇంతలో భరత్‌ కోలుకుంటున్నాడన్న విషయం నన్ను భయపెట్టింది. నా బిడ్డను రక్షించుకోవాలనే తండ్రి పాశం నన్ను హంతకునిగా మార్చేసింది’’ అంటూ భోరుభోరున ఏడ్వసాగాడు సత్యనారాయణ. 
‘‘ఎలా హత్య చేశావు?’’ అంటూ ఒక విలేఖరి అడగ్గానే... 
‘‘అదంతా నేను చెబుతాను’’ అంటూ రవీంద్ర కుర్చీలో కూర్చొని నింపాదిగా కేసు విప్పసాగాడు. 

‘‘కోలుకుంటున్న భరత్‌ చనిపోయాడన్న విషయం నాకు అనుమానమేసింది. హాస్పిటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాను. సత్యనారాయణ ఆ రాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో హాస్పిటల్‌ వాచ్‌మాన్‌కు డబ్బులిచ్చి భరత్‌ బెడ్‌ వద్దకు వెళ్ళాడు. తాను ఉబ్బసం కోసం వాడే అడ్రినలిన్‌ మందును ఎక్కువ మోతాదులో భరత్‌కు ఇంజెక్ట్‌ చేశాడు. గతంలో సత్యనారాయణ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేయడం వల్ల ఇది సాధ్యమయ్యిందని శ్రీధర్‌ దర్యాప్తులో తేలింది’’ 
సత్యనారాయణ తల దించుకుని... హాస్పిటల్‌ వాచ్‌మాన్‌ను వేసిన సెల్‌లోకి దారి తీశాడు.
-యు.విజయశేఖర రెడ్డి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top