శ్రీశ్రీ ఎందుకు నిలిచి ఉంటాడు?

శ్రీశ్రీ ఎందుకు నిలిచి ఉంటాడు?


సందర్భం: 30వ తేదీ శ్రీశ్రీ జయంతి

నూట ఐదేళ్ల కిందట పుట్టిన మనిషి ఎనభై ఐదు ఏళ్ల కింద ప్రారంభించి, ముప్ఫై మూడేళ్ల కింది దాకా తెలుగు సమాజంలో, సాహిత్యంలో అనితర సాధ్యమైన స్థానం సంపాదించిన మహాకవి, ముప్ఫై మూడేళ్ల కింద మరణించిన సామాజిక మానవుడు శ్రీశ్రీ ఇవాళ్టికీ ఇంకా ఎందుకు ప్రాసంగికంగా ఉన్నాడు? ఇంకా ఎలా నిలిచి ఉన్నాడు? ఎందరు ఎన్ని విమర్శలు చేసినా, కాలం చెల్లిందని చెల్లుచీటీలు రాసినా, ఎన్ని వివాదాలను తానే రేకెత్తించినా, ఇతరులు సృష్టించినా, మరణానంతరం మూడున్నర దశాబ్దాలు గడిచినా చెరిగిపోని సంతకంగా మిగలడానికి ఆయన జీవధాతువులలోని రహస్యం ఏమిటి?



ఏం రాసినా ఏం లాభం ఇదివరకెవడో అనే ఉంటాడు బహుశా ఆ అన్నదేదో నాకన్నా బాగానే అని ఉండొచ్చు అని ఆయనే శరచ్చంద్రికలో రాసినట్టు మహాకవి శ్రీశ్రీ గురించి కొత్తగా రాయడానికి ఏమున్నది అనీ అనిపించవచ్చు. ఇదుగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు... గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే అని ఆ ఆయనే అన్న మాటలను, ఇదుగో శ్రీశ్రీ నువ్వు సాహిత్యం మీద చేసిన సంతకాన్ని గాలి చెరిపెయ్యకుండా సమాజమే కాపలా కాస్తుందిలే అని తిరగేసి చెప్పవలసి వస్తుంది. నిజంగానే ఆయన సంతకాన్ని చెరిపెయ్యడానికి, లేదా దాని ప్రాధాన్యత తగ్గించడానికి తెలుగు సమాజంలో, సాహిత్యంలో చాలా గాలులే వీచాయి.

 

అయినా మహాకవి శ్రీశ్రీ చిరంజీవిగా ఉన్నాడు. ఆయన కవిత్వం ఇవాళ్టికీ ‘కదిలేదీ, కదిలించేదీ, పెనునిద్దుర వదిలించేదిగానే’ ఉంది. ‘నాదొక దుర్గం’ అని ఆయన ఏ అర్థంలో చెప్పుకున్నాడో గానీ అనేక దాడులను ఎదుర్కొన్న ఆ దుర్గం ఇంకా అపరాజితగా నిలిచే ఉంది. శ్రీశ్రీ వ్యక్తిత్వానికీ కవిత్వానికీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? స్థల కాలాలు మారినా, ఎదురుగాలులు వీచినా, పరిస్థితిలో మార్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నా శ్రీశ్రీ కవిత్వం నిలిచి ఉండటానికి కారణం?

 

శ్రీశ్రీ అవసరం ఈ సమాజానికి ఇంకా తీరలేదు. శ్రీశ్రీ అనవసరమైపోయేంతగా ఈ సమాజం ఇంకా మారలేదు. సమాజానికీ వ్యక్తికీ అత్యంత సన్నిహితమైన, ఎప్పటికీ చెదిరిపోని, ఎప్పుడూ ఆదర్శంగా ఉండే జీవరసాయనాలు తన కవిత్వంలో నింపే విద్య ఏదో శ్రీశ్రీ నేర్చుకున్నాడు. అందువల్లనే ఆయన కవిత్వానికి ఎప్పటికీ ఆదరణ తగ్గదు. ఆ జీవరసాయనాలు తొణికిసలాడే సమాజమైనా, వ్యక్తి అయినా ఆ కవిత్వాన్ని తమ పతాకగా చేబూనడం సహజం. ఆ లక్షణాలు చలనశీలత, పురోగామి శక్తుల సాహచర్యం, ఆశావహ దృష్టి ప్రభవ గీతాల నుంచి మరోప్రస్థానం దాకా, 1928 నుంచి 1983 దాకా ఐదున్నర దశాబ్దాల శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానాన్ని పరిశీలించినప్పుడు కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణం ఆయనలోని ప్రవాహ శీలత, చలన శీలత, మార్పు మాత్రమే మారని ఏకైక దినుసు అన్న నానుడి శ్రీశ్రీ కవిత్వానికీ జీవితానికీ అక్షరాలా వర్తిస్తుంది.



భావికవిత్వం నుంచి ఫాసిస్టు వ్యతిరేక చైతన్యం నుంచి అభ్యుదయ సాహిత్యోద్యమం నుంచి విప్లవ సాహిత్యోద్యమం దాకా మధ్యలో సర్రియలిజం, సినిమా, ప్రయోగపరత్వం వంటి ఎన్ని పక్కదారుల్లోకి చూసినా మొదటి నుంచి చివరిదాకా గొప్ప చలనశీలమైన సాహిత్య సృజన చేసినవాడాయన. ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అన్నది ఇతరులకు పిలుపునివ్వడమో, కవితా విన్యాసమో కాదు. ఆయన జీవితం. అది ఆయన కవిత్వం. అది ఆయన స్వభావం. అది మనలో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది గనుక, ప్రవాహ స్వభావం లేనివాళ్లం కూడా ఆ కవిత్వపు ప్రభావంలో కొట్టుకుపోక తప్పదు.

 

ఈ చలనం, ఈ ప్రవాహం ప్రగతిశీలం కావాలి. పురోగామి శక్తులతో కలిసి నడవాలి. ప్రపంచాన్ని తమ వెంట తీసుకుపోయే నడక కావాలి. కవితా సమితి నుంచి విప్లవ రచయితల సంఘం దాకా ఆయన నడక ఎల్లవేళలా ప్రజల ఊరేగింపులతో పాటు నడిచింది. ఊరేగింపులో ఒకడిగా కాదు, ప్రతి మలుపులోనూ ఆ ఊరేగింపుకు నాయకుడిగా నిలబడ్డాడు.

 

ఆ చలనం వల్లనే, ఆ పురోగమనం వల్లనే ఆయనలో కుదిరిన మూడో జీవరసాయనం ఆశావహ దృష్టి ఇవాళ కంటే ఎప్పుడూ రేపే బాగుంటుందంటాను నేను అనే భవిష్యదిశా దృష్టిని ఆయన తన కవిత్వంలో, కథల్లో, నాటకాల్లో, వ్యాసాల్లో ఎన్నోసార్లు వాచ్యంగా చెప్పాడు. ధ్వనిపూర్వకంగా చెప్పాడు. శరచ్చంద్రిక నిరాశతో ప్రారంభమై, ఆ ఆశతోనే ముగుస్తుంది. సమాజంలో, జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ ఈ ఆశ నిరాశల దోబూచులాట ఉంది. ఉంటుంది.

 

మనలో ప్రతి ఒక్కరమూ నిరంతర వేదనలో ఉండి కూడా, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఆగాథమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే అని ఆశ కోసం వెతుకుతుంటాం. ఆ ఆశాన్వేషణలో మనకు తోడు నిలిచేది శ్రీశ్రీ కవిత్వం.ఈ మూడు జీవలక్షణాలూ శ్రీశ్రీ కవిత్వం నిండా ఉన్నాయి గనుకనే శ్రీశ్రీ కవిత్వం మన హృదయం నుంచి ఎప్పటికీ చెరిగిపోజాలదు.

- ఎన్.వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top