పిచ్చుక పంటకు జంతువుల సాయం

Sparrow Story - Sakshi

చిన్నపిల్లల కథ

అడవిలో పిచ్చుకొకటి సజ్జపంట పెంచుకుంటోంది. విత్తనాలు మొలకెత్తి వేలిపొడవు పెరిగాక ఆ పంటను చూసుకుని మురిసిపోతూ, ‘ఇక నేను ఎవరి ఇళ్ళచుట్టూ గింజల కొరకు గిరికీలు కొట్టాల్సిన పనిలేదు. కాసిన్ని గింజలు కూడా పెట్టలేదేమిటా? అని బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా నా పంటను దాచుకుని కడుపారా తింటాను’ అని అనుకుంది. కాసేపు తన పొలాన్ని తేరిపార చూసుకున్నాక తన నివాసానికి వెళ్ళిపోయింది. 
మళ్లీ మరుసటిరోజు పిచ్చుక తన పొలం దగ్గరకు వచ్చింది. అక్కడ పంటంతా కసాబిసగా తొక్కేసినట్లు ఉంది. కొన్ని మొక్కలు విరిగిపోయి... మరికొన్ని మొక్కలు నేలకు అతుక్కుపోయి ఉన్నాయి. పంట పనికిరాకుండా మారింది. పిచ్చుక అన్ని మొక్కలను పట్టుకుని పరిశీలించి చూసి తన ఆశలు ఆవిరయ్యాయని బాధపడింది. పైరు పెంచడంలో తన కష్టం గుర్తుకొచ్చి బిగ్గరగా ఏడవసాగింది. ఆ ఏడుపు వినగానే దగ్గర్లోని పక్షులు, చిన్న జంతువులు అన్నీ పిచ్చుక దగ్గరకు వచ్చాయి. దాని ఏడుపుకు కారణమడిగాయి. పిచ్చుక చెప్పినది విన్నాక వాటికి దానిపై జాలి కలిగింది. ‘కావాలనే ఎవరో చేసుంటారు! మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. ఇప్పుడు తప్పు ఒప్పుకోకపోతే నిజం తెలిసినరోజు కఠినమైన శిక్ష పడుతుంది‘ అన్నిటినీ గదమాయిస్తూ పిచ్చుక తరపున గుడ్లగూబ హెచ్చరించింది.

‘అయ్యో! మేమెందుకు అలా చేస్తాం?’, ‘అలా చేస్తే మాకొచ్చే లాభం ఏమిటి?’, ‘అయినా చిన్నారి పిచ్చుకమ్మపై ఎవరికి ద్వేషం ఉంటుంది?’, ఇలా తలో సమాధానం ఇచ్చాయి. అయితే అక్కడికి కప్ప రాలేదని గుడ్లగూబ గ్రహించింది. కప్ప నివాసముండే బురదగుంట దగ్గరకు వెళ్ళి గట్టిగా పిలిచింది. కప్ప భయపడుతూనే బయటకు వచ్చింది. కప్ప వాలకం చూశాక, గుడ్లగూబకు దానిపై అనుమానం పెరిగిపోయింది. ‘మర్యాదగా చెప్పు. పిచ్చుక పంటను పాడుచేసింది నువ్వే కదా?’ గద్దించి అడిగింది. కప్పకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ‘అవును! అయితే అక్కడ పిచ్చుక పంట వేసిందనే విషయం నాకు తెలియదు. మెత్తగా, చల్లగా ఉండడంతో రాత్రంతా అక్కడ ఆడుకున్నాను. ఇది నేను తెలియక చేసిన తప్పు’ నెమ్మదిగా చెప్పింది.

‘తెలియక చేసినా పిచ్చుకను నష్టపరిచావు. కచ్చితంగా పరిహారం ఇవ్వాల్సిందే’ గుడ్లగూబ కోపంగా చెప్పింది. ‘మీరెంత గద్దించినా  నా దగ్గర ఇవ్వడానికి ఏముంది?’ కప్ప ధీమాగా మాట్లాడింది. ‘పిచ్చుక దగ్గర ఇంకా ఒక చిన్నమూట సజ్జలు ఉన్నాయి. నువ్వు వాటితో పంట పండించి దానికివ్వాలి. అలా చేయకుంటే  నిన్ను తీసుకెళ్ళి ఎండకు మండిపోయే వెడల్పాటి బండపైన వదిలేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించుకో’ గుడ్లగూబ కోపంగా చెప్పింది. కప్పకు ఒప్పుకోక తప్పలేదు. కప్ప పంట పండించడానికి సిద్ధపడింది. కప్ప పిచ్చుక దగ్గర గింజలు తీసుకుని ఒక విశాలమైన స్థలం చూసుకుని చల్లబోయింది. అది చూసి ఉడుత వారిస్తూ, ‘పొలాన్ని దున్నకుండా విత్తనాలు చల్లితే,  అవి సరిగా మొలకెత్తవు. ఈ విషయం నీకు తెలియదా?’ ఆశ్చర్యంగా అడిగింది. ‘అలాగా! ఊరికే విత్తనాలు చల్లితే చాలని అనుకున్నానే. ఈ పంటంతా పండేదాకా నువ్వు నాకు సలహాలిస్తుండాలోయ్‌’ కాస్త పొగరుగా మాట్లాడింది కప్ప.

‘దీనికి పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేనట్లుంది’ మనసులో బాధపడింది ఉడుత. అయితే పైకి మాత్రం, ‘అలాగే సలహాలిస్తానులే...మరి నాకేం ఇస్తావు?’ ‘నీకా?...పంట పండాక అందులో వాటా ఇస్తానులే’ అని కప్ప చెప్పింది. ‘సరేలే...ముందు వెళ్ళి ఎలుకను పిలుచుకురా. అదైతే నీ పొలాన్ని బాగా దున్ని పెడుతుంది’ సలహా ఇచ్చింది ఉడుత.
కప్ప వెంటనే ఎలుక ఉన్న బొరియ దగ్గరకు వెళ్ళి పిలిచింది. ఎలుక బయటకు వచ్చాక, ‘నువ్వు నాకో పనిచేసి పెట్టాలోయ్‌’ కప్ప మాటతీరు ఏమాత్రం మారలేదు. ’ఎంత పొగరుగా మాట్లాడుతోంది’ ఎలుక లోలోపల అనుకుంది. ‘ఏం చేయాలి?’ అడిగింది ఎలుక. ‘కొత్తగా పంట పండిస్తున్నాను. నువ్వు పొలం దున్నిపెట్టాలి.’, ‘ఓ... అలాగే. మరి నాకేం ఇస్తావు?’, ‘పంటలో వాటా ఇస్తాను లేవోయ్‌’ చెప్పింది కప్ప. 
ఎలుక తన వాడి గోర్లతో బాగా గీరి దున్నిన పొలంలా మార్చింది. తర్వాత కప్ప ఆ పొలంలో సజ్జవిత్తనాలు చల్లింది. రోజూ వచ్చి మొలకలు వచ్చాయో లేదోనని చూడసాగింది. రెండ్రోజుల తర్వాత అది గమనించిన ఉడుత, ‘గింజలు చల్లావు, బాగానే ఉంది. కాసిన్ని నీళ్లు చిలకరించాలి.. కాకి సాయం తీసుకో’ సలహా ఇచ్చింది ఉడుత.

కాకిని కలిసి కప్ప.. ‘ఎప్పుడూ చచ్చినవాటినే పీక్కుతింటావని అందరూ నిన్ను చీదరించుకుంటారు కదా!  నాకు ఓ పనిచేసిపెట్టి.. నీకున్న చెడ్డపేరును పోగొట్టుకో’ కప్ప మాటలు కాకికి చివుక్కుమనిపించాయి. అయినా సాయానికి ఒప్పుకుని ‘నాకేం ఇస్తావు?’ అంటుంది. ‘నీకు పంటలో వాటా ఇస్తాలేవోయ్‌’ అంటుంది కప్ప. 
మరుసటిరోజు కాకి దూరాన ఉన్న చెరువులో మునిగి, ఆ తడి ఒంటితో వచ్చి కప్ప పొలంపై రెక్కలను విదిలించి, నీటిని చిలకరించింది. అలా పలుసార్లు చేసేసరికి పొలం బాగా తడిసింది.
కొద్దిరోజులకు మొలకలొచ్చాయి. పంట తయారై పోయిందని  కప్ప అనుకుంది. ‘కంకులు ఎప్పుడొస్తాయి? పంట ఎప్పుడు కోయొచ్చు?’ ఆత్రుతగా ఉడుతను అడిగింది. ‘అప్పుడే సంబరపడిపోకు.  పొలానికి మంచి ఎరువు వేయాలి, అప్పుడే పైరు ఏపుగా పెరుగుతుంది. ఎరువు కోసం నువ్వు చెట్టుపుట్ట తిరగలేవులే కాని గోరింకను అడుగు. అది తెచ్చిపెడుతుంది.’ ఉడుత సలహా ఇచ్చింది.

కప్ప గోరింక దగ్గరకు వెళ్ళి, ‘నీకో మంచి అవకాశం ఇస్తున్నానోయ్‌. నా పొలానికి ఎరువు తెచ్చిపెట్టు. పంట పండాక ఎంతో కొంత నీ వాటా నీకు పడేస్తాలే.’ కప్ప మామూలుగానే అన్నా గోరింకకు ఆ మాటలు చురుక్కుమనిపించాయి.
అడవిలోకి వచ్చే ఒక మేకలమందతో గోరింకకు స్నేహం ఉంది. అది మేకలమంద దగ్గరకు వెళ్ళి, వాటి పెంటికలను ఒక్కొక్కటే తెచ్చి కప్ప పొలం దగ్గర పడేసింది. కప్ప వాటిని మెత్తనిపొడిలా మార్చి పొలమంతా చల్లింది. ఇంకొన్ని రోజులు గడిచాయి. పైరు ఏపుగా పెరుగుతోంది. ఇంతలో ఒక రాత్రిపూట భారీవర్షం కురిసింది. ఆ వర్షాన్ని చూసి, ‘ఇక రేపు నీళ్ళు చిలకరించాల్సిన అవసరం లేదు’ అని కాకి అనుకుంది. ‘ఈ వానతో పైరుకు కంకులు వస్తాయేమో?’ అని కప్ప అనుకుంది. ఉదయాన్నే కప్ప పొలం దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఉడుత అక్కడికి వచ్చి ఉంది. ‘చూశావా..ఈ వర్షం దెబ్బకు మన పంట త్వరగానే చేతికొస్తుంది’ కప్ప ఆనందంగా చెప్పింది. ‘పంట చేతికి రావడం కాదు. అసలుకే మోసం వచ్చేలా ఉంది. పొలంనిండా నీళ్ళు ఉంటే వేర్లు కుళ్ళిపోయి పంటంతా పాడైపోతుంది.  వెంటనే వాలు ఉన్న దగ్గర మట్టిని తీసేసి, నిల్చున్న నీరు పొలంలోంచి బయటకు పోయేలా చేయి’ ఉడుత మాటలు విన్న కప్ప,  చెప్పినట్లే చేస్తుంది.

రోజులు గడిచాయి. పొలం కోతకు సిద్ధమయ్యింది. కప్పకు సాయం చేసినవాటితో పాటూ గుడ్లగూబ, పిచ్చుకలు కూడా వచ్చేశాయి. ఒప్పందం ప్రకారం పంటను తమకు పంచమని సాయం చేసినవన్నీ పేచీపెట్టాయి. అలా పంచితే పిచ్చుకకు ఏం ఇవ్వాలో కప్పకు అర్థం కాలేదు. ‘వాటా ఇవ్వు’ అంటూ గుడ్లగూబ ఎగతాళిగా మాట్లాడింది. ‘అప్పుడేదో అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు’ కప్ప ఏడుపుముఖం పెట్టింది. ఉడుత, ఎలుక, కాకి, గోరింక, కప్ప చుట్టూ చేరి, ‘నువ్వు పొగరుగా మాట్లాడినందుకే మాకేమిస్తావని అడిగాం. అంతే తప్ప ప్రతిఫలం ఆశించికాదు. మా వాటాలన్నీ పిచ్చుకకే ఇస్తాంలే’ అన్నీ ఒకేసారి అన్నాయి.
ఆ మాటలతో కప్ప ఎంతగానో ఊరట పొందింది. ‘నా నిర్లక్ష్యపు మాటలు ఇంత పనిచేశాయా?’ అని బాధపడింది. 
పంట తీసుకున్న పిచ్చుక, ‘చేతికందెను బంగారుపంట... ఆకలితీర్చెను నా ఇంట...’  అని సంతోషంగా పాట పాడుకుంది.
- శాఖమూరి శ్రీనివాస్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top