సాగర తీరం

The sea shore is a world of stories - Sakshi

కథా ప్రపంచం

వెల్లాయి అప్పన్‌ గుడిశెలోంచి కాలు బయటకు పెట్టాడో లేదో ఏడుపుల శబ్దం గుడిశె పైకప్పును తాకింది. ఒక్క ఆ గుడిశె నించే కాదు పక్కనే ఉన్న ‘అమ్మి’ని గుడిశెలో నించీ, ఆ వెనక వరసగా ఉన్న గుడిశెల్లోంచీ ఏడుపులు ఊరంతా వినపడ్డాయి. అప్పన్‌ కన్నూర్‌కు బయల్దేరాడు. తమ దగ్గర డబ్బు ఉండి ఉంటే ఊళ్లోవాళ్లంతా అప్పన్‌ వెంట వెళ్లి ఉండేవారే. ఊరంతటికీ బదులు వెల్లాయి అప్పన్‌ తానొక్కడే ప్రయాణం అయ్యాడు. చిట్టచివరి గుడిశె దాటి అప్పన్‌ కొండమీద నడవసాగాడు. వెనుక నించి వినవస్తున్న ఏడుపుల శబ్దం క్రమక్రమంగా వినిపించకుండా పోయింది. కొండ దిగి గడ్డి పొలాల మధ్య కాలిబాట వెంట నడక సాగించాడు అప్పన్‌. అప్పన్‌ భుజం మీద అన్నం మూట వేలాడుతున్నది. పలుచటి గుడ్డలో మూటకట్టిన అన్నం అప్పన్‌ భుజాన్ని తడుపుతున్నది. అప్పన్‌ భార్య అన్నం వండుతున్నంత సేపూ ఏడుస్తూనే వుంది. కన్నీళ్లు ఆమె అన్నంలో కలిపిన పుల్లటి పెరుగులో జారిపడుంటయి. రైల్వేస్టేషన్‌ నాలుగు మైళ్ల దూరాన ఉన్నది. ఆ దారంట కొంత దూరం నడిచాక ఎదురుగ్గా వస్తూ కనిపించాడు కుట్టిహాసన్‌. ‘వెల్లాయ్‌’ అంటూ ఆప్యాయంగా, గౌరవంగా పిలిచాడు కుట్టిహాసన్‌. ‘కుట్టిహాసన్‌’ అన్నాడు వెల్లాయి అప్పన్‌. అంతే! రెండే రెండు మాటలు. రెండు పేర్లు. కానీ అదొక సుదీర్ఘ సంభాషణ. అందులో దుఃఖమూ ఓదార్పూ ఉన్నవి! కుట్టిహాసన్‌ని దాటి ముందుకు నడిచాడు అప్పన్‌. ఉతకడానికి బట్టల మూటతో కనిపించింది నీలి. ఆమె గౌరవంగా పక్కకు అడుగువేసి నిలబడి అన్నది. ‘వెల్లాయి అప్పన్‌’ అని. ‘నీలీ’ అన్నాడు అప్పన్‌. అంతే! రెండే రెండు మాటలు. కానీ వాళ్ల మధ్య అదొక సుదీర్ఘ సంభాషణే. వెల్లాయి అప్పన్‌ ముందుకి సాగాడు. కాలిబాట ఓ బురద రోడ్డుమీదకి చేర్చింది. మైలురాయి కోసం చూస్తూ అలా నడుస్తూ రాళ్లూ రప్పలూ దాటి నదిలోకి దిగాడు. నదికి ఆ వైపున ఉన్నది రైల్వేస్టేషన్‌. అప్పన్‌ మొదట ఇసుకలో తర్వాత మొల లోతు నీళ్లలో నడిచాడు. మెరిసే వెండి రంగు చిరు చేపలు అప్పన్‌ కాలి పిక్కలని తాకుతూ ఈదుతూ పోసాగాయి. నది మధ్యకు చేరిన అప్పన్‌కి చుట్టూ ఉన్న నీళ్లను చూస్తుంటే తండ్రి తనకు ఈత నేర్పడం, తండ్రి పోయాక శవానికి తను స్నానం చేయించడం, కర్మకాండ జరిపించడం గుర్తొచ్చేయి. నది ఒడ్డుకి చేరి జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెతో ముందుకు నడిచాడు అప్పన్‌. స్టేషన్‌కి చేరుకున్నాక జాగ్రత్తగా పైపంచెలో ఓ మూల గట్టిగా కట్టిన ముడి విప్పి టికెట్‌ డబ్బు తీసి యిస్తూ వెల్లాయి అప్పన్‌ ‘కన్నూరు’ అన్నాడు. కిటికీ వెనుక ఉన్న టికెట్లిచ్చేవాడు. టికెట్‌ బయటకు విసిరేశాడు.

అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ రైలుకోసం ఓపిగ్గా నిరీక్షిస్తూ బెంచిమీద కూర్చున్నాడు అప్పన్‌. దూరంగా కొబ్బరి తోటలో చీకట్లు ముసిరాయి. పక్షులు గూళ్లవైపు రెక్కలు ఎగరేస్తూ వెళ్లాయి. అప్పన్‌కి కొడుకు గుర్తుకు వచ్చాడు. వాడు ఎగిరే పక్షులవైపు ఎంత ఆశ్చర్యంగా చూసేవాడో గుర్తొచ్చింది. అప్పన్‌కి తను తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని పొలాల వెంట నడవడమూ గుర్తుకొచ్చింది.వెల్లాయి అప్పన్‌కి అన్నం మూట విప్పాలని అనిపించలేదు. అన్నం కట్టిన పలుచటి గుడ్డమీద చేయి ఆనించి, అలాగే నిద్రపోయాడు. నిద్రలో కల వచ్చింది. కలలో కన్దున్ని కనిపించి ‘కొడుకా!’ అని బిగ్గరగా అరిచాడు. రైలు శబ్దం విని ఉలిక్కిపడి లేచి పంచె మూలన కట్టిన టికెట్టుని తడిమి చూసుకుని రైలుపెట్టె వైపు పరుగెత్తాడు. ఫస్ట్‌క్లాస్‌ ఎక్కొద్దంటే వెనక్కు పరుగెత్తాడు. రిజర్వు అంటే ఇంకా వెనక్కి పరుగెత్తాడు. ఇంకా... ఇంకా వెనక్కి పరుగెత్తాడు. వెల్లాయి అప్పన్‌ ఎక్కిన బోగీలో నిలబడ్డానికి కూడా చోటు లేకపోయింది. నిలబడాల్సిందే. ఈ రాత్రంతా నిలబడే వుంటా. ఈ రాత్రంతా నా కొడుకూ మేలుకునే ఉంటాడు అనుకున్నాడు. చాలాకాలం కిందట వెల్లాయి అప్పన్‌ ప్రయాణం చేశాడు. కానీ అది పగలు... ఇది రాత్రి... చీకటి సొరంగాల మధ్య పరుగెత్తింది రైలు.వెల్లాయి అప్పన్‌ కన్నూరు చేరేటప్పటికి పూర్తిగా తెల్లవారలేదు. భుజమ్మీద అన్నపు మూట తడితడిగా వేలాడుతున్నది. స్టేషన్‌ బయట ఉన్న జట్కా బళ్లవాళ్లు అప్పన్‌ని పట్టించుకోలేదు. అప్పన్‌ వాళ్లని జైలుకి దారి ఎటో చెప్పమని అడిగాడు. ‘పొద్దున్నే వీడెవడయ్యా జైలుకి దారి అడుగుతున్నాడు’ అంటూ నవ్వాడు ఒకడు. మరొకడు పెద్దాయనా ‘నువ్వెళ్లాల్సిన పనిలేదు. దొంగతనం చెయ్యి. వాళ్లే తీసుకెళ్తారు’ అన్నాడు. చివరికి ఒకడు దయ తలచి దారి చెప్పాడు. ఆకాశం తొలి కిరణాలతో వెలుగుతుంటే, కాకుల గుంపు కావు... కావు మంటుంటే జైలువైపు నడిచాడు అప్పన్‌. జైలు గేటు దగ్గర గార్డు అడిగాడు. ‘ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు ముసలాయనా?’ అని. అప్పన్‌ చిన్నపిల్లవాడిలా అడుగు వెనక్కి వేసి పైపంచె ముడి విప్పి పసుపు రంగు కాగితం ముక్క అందిస్తూ ‘నా కొడుకు ఇక్కడ ఉన్నాడు’ అన్నాడు. ‘అయితే ఆఫీసు తెరిచేదాకా ఆగు’ అని నిర్లక్ష్యంగా అన్నవాడు... ఆ కాగితం పరీక్షగా చూశాక మెత్తబడ్డాడు.

‘రేపు... రేపే కదా...’ అన్నాడు జాలిపడుతూ.
‘నాకు తెలియదు. అందులో రాసుందట కదా.’
‘అవును. రేపు ఉదయం అయిదింటికి.’
రాత్రంతా నిద్రపోకుండా ఉండి కొడుకు ఇంకా నిద్రలేచి ఉండడు. ఏం తింటాడు అనుకుంటున్న అప్పన్‌ చేయి అన్నం మూటను తాకింది. కొడుకా ఈ అన్నం మీ అమ్మ నాకోసం కట్టింది. దీన్ని ఇన్ని గంటలూ విప్పకుండా తీసుకువచ్చాను. ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేను అనుకున్నాడు. ఎండ క్రమంగా పెరిగింది. మూటలో అన్నం పాచిపోయింది. జైలు కార్యాలయం తెరుచుకుంది. టేబిళ్ల వెనక కూచున్నవాళ్లు పసుపుపచ్చ కాగితాలు తనిఖీ చేస్తున్నారు. బెంచీమీద ఎంతసేపు కూర్చున్నాడో తెలియలేదు అప్పన్‌కి. ఒక గార్డు వచ్చి అప్పన్‌ని జైలు లోపలికి తీసుకుపోయాడు. అక్కడంతా చల్లగా, తేమగా ఉంది. తాళం వేసున్న ఓ గదిలో ఊచల వెనుక ఉన్నాడు కందున్ని. అతను తండ్రివైపు ఎవరో కొత్తమనిషిని చూసినట్టు చూశాడు. అతని మెదడు ఇప్పుడు ఓదార్పును కూడా స్వీకరించే స్థితిలో లేదు. గార్డు తలుపు తెరిచి అప్పన్‌ని లోపలికి పంపించాడు. కొడుకుని కౌగిలించుకుందామని అప్పన్‌ ముందుకు వంగాడు. అప్పుడు కందున్ని వినేవాళ్ల చెవులు చీల్చివేసే కేక వేశాడు. అప్పన్‌ ‘కొడుకా’ అన్నాడు. కందున్ని ‘నాయనా’ అన్నాడు. రెండు మాటలే! ఈ రెండు మాటలతో ఆ తండ్రీకొడుకులు ఒకరి దుఃఖాన్ని ఒకరు పంచుకున్నారు.

‘కందున్నీ ఏం చేశావు?’
‘నాకేమీ గుర్తులేదు.’
‘చంపావా?’
‘నాకేమీ గుర్తులేదు.’
‘పోనీ. నువ్వు ఏదీ గుర్తు పెట్టుకోనవసరం లేదులే.’
కన్దున్ని మళ్లీ చెవులు చిల్లులు పడే కేకవేశాడు. ‘నాయనా... నన్ను ఉరి తీయనీయకు.’

పెద్దాయనా టైమయింది అన్నాడు గార్డు. అప్పన్‌ బయటకు వచ్చాడు. తలుపు మూసుకుంది. చిట్టచివరిసారి వెనక్కి తిరిగి చూశాడు అప్పన్‌. ఏదో ఓ ప్రయాణంలో తారసపడ్డ అపరిచితుడిలా కనిపించాడు కొడుకు. పరుగెడుతున్న రైలు కిటికీ ఊచల్లోంచి బయటకు చూస్తున్నవాడిలా ఉన్నాడు కొడుకు. వెల్లాయి అప్పన్‌ రోజంతా జైలు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుడు పడమర వైపు నించి కిందకి దిగి పోసాగాడు. కొడుకు ఈ రాత్రి నిద్రపోతాడా అనుకున్నాడు అప్పన్‌. రాత్రి అయింది. మళ్లీ ఉదయం వైపు కాలం కదిలింది. గోడల లోపల కందున్ని ఇంకా బతికే ఉన్నాడు.తెల్లవారుతుంటే గార్డుల ఈలలు వినిపించాయి. ఆ శబ్దం మరణ సంకేతం అని అప్పన్‌కి తెలియలేదు. కానీ రైతుగా కచ్చితమైన ‘టైమ్‌’ని గుర్తుపట్టే జ్ఞానం ఉంది అప్పన్‌కి.

మంత్రసాని దగ్గర్నించి పసిపాపను అందుకున్నట్టుగా గార్డుల దగ్గర్నుంచి కొడుకు శవాన్ని అందుకున్నాడు అప్పన్‌.‘పెద్దాయనా శవానికి సంస్కారం చేస్తావా?’ అన్నాడో గార్డు.‘నాకు తెలియదు.’‘శవాన్ని తీసుకుపోతావా?’‘అయ్యా! నా దగ్గర పైసా లేదు.’ఊరవతల, నిర్జన ప్రదేశంలో, రాబందులు ఆకాశంలో గిరికీలు కొడుతున్న చోట కొడుకు శవాన్ని బండిలో లాక్కువచ్చిన వాళ్లు గొయ్యి తవ్వి శవాన్ని అందులో ఉంచి మట్టి కప్పబోతున్నప్పుడు అప్పన్‌ తన అరచేతిని కొడుకు చల్లటి నుదుటి మీద ఉంచి దీవించాడు.వాళ్ల పారతో ఆఖరుసారి మట్టి పోసి గొయ్యిని పూడ్చి వేశాక సముద్ర తీరానికి వచ్చాడు అప్పన్‌. అతను ఇంతకుముందు సముద్రాన్ని చూడలేదు. అతని చేతులకి చల్లగా తగిలిందది. అప్పుడు. తనకు ప్రయాణంలో తినడానికి భార్య కట్టిచ్చిన అన్నపు మూట. అప్పన్‌ మూట విప్పాడు. అన్నాన్ని ఒడ్డున ఉన్న ఇసుక మీద చల్లాడు.సూర్యుడి వెలుగులో మెరుస్తున్న అన్నాన్ని చూసి తమకు నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని తినడానికి వచ్చిన, చనిపోయినవాళ్ల ఆత్మల్లా కాకులు ఒకదాని వెంట ఒకటి కిందకి వాలాయి. 
- మలయాళ మూలం: ఒ.వి. విజయన్‌
- అనువాదం: చింతపట్ల సుదర్శన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top