
రతనాల రాఖీలు
అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నడుమ ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది.
అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నడుమ ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. రాఖీలు కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు కానుకలు ఇచ్చి సంతోషపెడతారు. రాఖీ పండుగ గురించి ఇదంతా అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ పండుగకు సంబంధించి చాలా పురాణగాథలు ఉన్నాయి. అంతేకాదు, చరిత్రలోనూ రక్షాబంధనానికి ప్రాధాన్యమిచ్చే ఉదంతాలు ఉన్నాయి. ఏటా శ్రావణ పున్నమి నాడు వచ్చే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిలో వేడుకలు చేసుకుంటారు. రాఖీ పండుగ గురించి, రాఖీల గురించి అవీ... ఇవీ...
చరిత్రలో రాఖీ
భారత్ మీద క్రీస్తుపూర్వం 326లో దండెత్తిన అలెగ్జాండర్ భార్య రొక్సానా భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టి, తన భర్తకు హాని తలపెట్టవద్దని కోరిందట. అందువల్ల యుద్ధరంగంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు ప్రాణాలతో విడిచిపెట్టేశాడట.
మొఘల్ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించగా చిత్తోర్ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుంచి బెడదగా ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్ ఆమెను సోదరిగా అంగీకరించి అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది.
అతి పొడవాటి రాఖీ
దడ పుట్టించే ధరల్లోనే కాదు, సైజులోని భారీతనంలోనూ రాఖీలు రికార్డులకెక్కుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో 2011 ఆగస్టు 2న జి.బాలకృష్ణ అనే యువకుడు ప్రపంచంలోనే అతి పొడవాటి రాఖీని ప్రదర్శించాడు. దీని పొడవు ఏకంగా 666 అడుగులు. వెడల్పు 4 అడుగులు. దీని తయారీకి ఆయన థర్మోకోల్, కాగితాలు, బ్యానర్ వస్త్రాలు, వాటర్ కలర్స్, గుండుసూదులు వినియోగిచాడు.
అతి పెద్ద రాఖీ
బెంగళూరులోని బ్రహ్మకుమారిలు 2013 ఆగస్టు 17న ప్రపంచంలోనే అతి భారీ అలంకరణ రాఖీని ప్రదర్శించారు. దీని తయారీకి దాదాపు 150 మంది హస్తకళా నిపుణులు నెల్లాళ్లు శ్రమించారు. దీని ఎత్తు 40 అడుగులు, వెడల్పు 400 అడుగులు. ఈ అతి పెద్ద రాఖీ తయారీకి ఉక్కు గజాలు, స్టైరోఫోమ్, పట్టు వస్త్రం, రిబ్బన్లు, లేసులు, వెదురు చాపలు, తాడు, ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించారు.
అతి భారీ రాఖీ
భువనేశ్వర్‌లోని ఉత్కళ్ యూనివర్సిటీ విద్యార్థులు బిశ్వకర్మ పండా, యన్నితా ప్రియదర్శిని 2015 ఆగస్టు 29న అతి భారీ రాఖీని ప్రదర్శించారు. ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథస్వామికి అంకితం చేస్తూ రూపొందించిన ఈ రాఖీ పొడవు 500 అడుగులు, వ్యాసం 50 అడుగులు. దీని తయారీకి 300 కిలోల ధాన్యం, 40 కిలోల బియ్యం, రంగులు, ఇతర పదార్థాలు ఉపయోగించారు.
సిక్కు రాజ్యపాలకుడు రాజా రంజిత్ సింగ్ భార్య మహారాణి జిందన్ కౌర్ పద్దెనిమిదో శతాబ్దిలో నేపాల్ రాజుకు రాఖీ పంపింది. ఆమెను సోదరిగా అంగీకరించిన నేపాల్ రాజు ఆ సోదర భావంతోనే బ్రిటిష్ సైన్యాలు పంజాబ్‌ను ఆక్రమించుకున్నప్పుడు రాజా రంజిత్ సింగ్ దంపతులకు తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు.
బ్రిటిష్ పాలకులు 1905లో బెంగాల్‌ను రెండుగా విభజించారు. ఈ విభజన హిందూ ముస్లింలలో వైషమ్యాలకు దారి తీసింది. ఉభయ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్ ఒక్కటే తగిన వేడుక అని రవీంద్రనాథ్ టాగోర్ భావించారు. హిందువులకు ముస్లింలు, ముస్లింలకు హిందువులు రాఖీలు కట్టుకోవడం ద్వారా ఉభయుల మధ్య సౌభ్రాతృత్వం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన రక్షాబంధన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల్లో వేడుకలు
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది.
మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి.
నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు.