నిదురించే తోటలోకి...

Funday story of the week - Sakshi

ఇష్టంలేని పనిచేయడం చాలా కష్టం. నా మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. చిన్నప్పటి నుంచి అంతే. అందుకే అమ్మ తరచు ‘అంత మొండితనం పనికిరాదు’ అని కోప్పడుతుండేది.
‘టికెట్‌ ఎక్కడికి సార్‌!’కండక్టర్‌ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.‘వేములపల్లికి ఒకటివ్వండి’టికెట్‌ తీసుకుని కిటికీ పక్కకి జరిగాను. బస్సంతా కోలాహలంగా ఉంది. కూలీలు బస్సుపైకి మూటలు వేస్తున్నారు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు స్థిమితంగా లేవు. ఆ ఊరెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ అమ్మ కోరికను కాదనలేకపోయాను. ఎందుకంటే అది ‘చివరిది’ కాబట్టి.అమ్మ జ్ఞాపకం వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు ఎంత అవమానం ఎదుర్కొన్నాం ఆ ఇంట్లో! చెయ్యని నేరం అమ్మపై మోపారు. ఊరు విడిచి వచ్చేసేలా చేశారు. నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్లుంటాయి. రాజారాం మావయ్య మమ్మల్ని చేరదీశాడు. ఆయన బాగా ఆస్తిపరుడు. వందల ఎకరాల ఆసామి. పాలేర్లు, పనివాళ్లు, వచ్చిపోయేవాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉండేవి. పాడి గేదెలకు, ఆవులకు కొట్టం ఉండేది. పొట్టేళ్లను, పందెంకోళ్లను ప్రత్యేకంగా పెంచేవారు. వెన్నునొప్పి సమస్యతో అత్తయ్య మంచానికే పరిమితమై ఉండేది. వాళ్ల నలుగురు పిల్లల బాగోగులు అమ్మే చూసుకునేది.మావయ్య మా పట్ల ఎంత అభిమానం చూపినా, పిల్లలు మాత్రం అమ్మతో అప్పుడప్పుడు దురుసుగా మాట్లాడేవాళ్లు. మావయ్య పెద్దకొడుకు కాశీ అందరి మీద పెత్తనం చేసేవాడు. కాశీ తర్వాత వసుంధర, శరత్, సుమన... నేనూ, సుమన వీధిగుమ్మం పక్కనే ఉండే ఏనుగు బొమ్మపై కూర్చుని ఆడుకునేవాళ్లం.

‘‘బస్సు పది నిమిషాలు ఆగుద్ది. టీ తాగేవాళ్లు తాగొచ్చు’’ప్రయాణికుల మొహం చూడకుండా బాగా అలవాటైన ఒక ప్రకటన చేసి డ్రైవర్, కండక్టర్‌ కిందకు దిగారు. నాకెందుకో దిగాలనిపించలేదు. ఇష్టంలేని ప్రయాణంలో ప్రతిదీ అసౌకర్యంగా అసహనంగా అనిపిస్తాయేమో!‘‘బాబూ! నువ్వు సీతమ్మ కొడుకువా?’’ వెనుక సీటు నుంచి తొంగిచూస్తూ అడిగాడు ఒక పెద్దాయన. అరవై ఏళ్లుంటాయి అటూ ఇటుగా...నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వేములపల్లిని వదిలి ఇరవయ్యేళ్లయింది. ఆ ఊరితో అనుబంధం దాదాపుగా తెగిపోయింది. ఆయన నన్నెలా గుర్తుపట్టాడో అర్థం కాలేదు.‘అవునండీ... మీరు..?’‘‘నీ పేరు ఆనందు కదూ! నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ ఇంటి పక్కనే ఉండే టైలర్‌ వెంకటేశ్వర్రావుని. నువ్వచ్చం మీ నాన్నలానే ఉన్నావు. వాడూ నేనూ కలిసి చదువుకున్నాంగా... ఎప్పుడూ నా కళ్లలోనే మెదుల్తాడు’’ అన్నాడాయన.‘‘సారీ అండీ... గుర్తుపట్టలేకపోయాను. రండి టీ తాగొద్దాం’’ అని సీటులోంచి లేచాను. ఆయన సంతోషంగా నన్ను అనుసరించాడు.టీ తాగేటప్పుడు అమ్మ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ చనిపోయిందని చెబితే ఎంతో బాధపడ్డాడు. ఆయన కూడా రెండేళ్ల కిందట వేములపల్లి నుంచి వచ్చేసి నందిగామలో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పాడు.బస్సెక్కాం. నా పక్క సీటులోని వ్యక్తిని రిక్వెస్ట్‌ చేసి వెనక్కి పంపి, పెద్దాయన్ని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను.‘‘మీ అమ్మ అట్టాంటి పని చేసిందంటే మేమెవరం నమ్మలేదయ్యా! నలుగురికి పెట్టే గుణమే తప్ప ఎవరి దగ్గరా ఏమీ ఆశించే మనిషి కాదు. నగలు దొంగతనం చేసే ఖర్మ సీతమ్మకి పట్టలేదని ఊరందరికీ తెలుసు.’’నేను మౌనంగా వింటున్నాను.‘మీరు ఊరొదిలి వెళ్లిపోయాక రాజారాంగారికీ కాశీకి పెద్ద గొడవ అయ్యిందటయ్యా! తండ్రీ కొడుకుల మధ్య ఈనాటికీ మాటలు లేవు. అంతకు మించి విషయాలేవీ బయటకు రాలేదు. ఏదైనా గుట్టుగల కుటుంబం’’ఆయన నిట్టూర్పు నాకు అర్థం అయ్యింది. మా అమ్మ పట్ల సానుభూతి, అభిమానం ఉండి కూడా మాకోసం ఏమీ చేయలేకపోయామనే అశక్తత ఉంది. ‘‘వచ్చే స్టేజీయే నందిగామ. రిటన్లో దిగిరాయ్యా! శ్రీనివాసరావుగారి బట్టల కొట్టంటే ఎవరైనా చెబ్తారు’’ అంటూ లేచారాయన.‘‘సరే బాబాయ్‌! జాగ్రత్తగా వెళ్లండి.ఆరోగ్యం జాగ్రత్త!’’ అన్నాను.వరుస కలిపి పిలిచినందుకు ఆయన మొహం సంతోషంతో వెలగడం నాకు కనిపించింది.ఆయన దిగాక మళ్లీ ఒంటరినయ్యాననిపించింది.
 
‘వేములపల్లి దిగండీ..’కండక్టర్‌ అదిలింపులాంటి ఆజ్ఞతో లేచాను. అప్పటికే సాయంత్రం అయింది.శివాలయం వీధిలో మూడో ఇల్లే మావయ్యది. నడుస్తున్నాను. ఊరు పెద్దగా మారలేదు. పెంకుటిళ్ల స్థానంలో డాబాలు వెలిశాయి. మట్టిరోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వచ్చి చేరాయి. భద్రయ్యతాత కిళ్లీకొట్టు లేదు. అక్కడ సెల్‌ఫోన్‌ రీచార్జి చేసే షాపు ఉంది. నాకెందుకో ఉద్వేగంగా ఉంది. ఇల్లొచ్చింది. నాకో పెద్ద అనుమానం వచ్చింది. ఆ ఇల్లేనా అని. కళాకాంతులు లేని, పెచ్చులూడిన ప్రహరీగోడను చూడగానే మనసు చివుక్కుమంది. గేటు తీసుకుని లోపలికి వెళ్లాను.ఒక పదహారేళ్లుంటాయి కుర్రాడికి. కాశీబావ కొడుకై ఉంటాడు. నన్ను తేరిపార చూసి లోపలికి రండి అన్నాడు. కాళ్లు కడుక్కోమని పంపువైపు చూపించాడు. లోపలికి వెళ్లి ఒకావిడ్ని వెంటబెట్టుకొచ్చాడు.ఆవిడ చేతులు చెంగుకి తుడుచుకుంటూ హడావుడిగా నవ్వుతూ ఎదురొచ్చింది. ‘మావయ్యగారు బయటికెళ్లారు బాబూ! వచ్చేస్తారు’ అంటూ వరండాలోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నిత్యం పదిమంది మనుషులతో కళకళలాడిన ఆ లోగిలి బోసిపోయి ఉంది. గోడల రంగులు వెలిసిపోయాయి. బయట పశువుల పాకలో ఒక పాడిగేదె కట్టేసి ఉంది.

‘ఎప్పుడు బయలుదేరారు బాబూ! స్నానం చేసి రండి. మావయ్య వచ్చేస్తారు... నానీ! మావయ్యని రూమ్‌లోకి తీసుకెళ్లు’ అంటూ కొడుకుని పురమాయించి వంటగదిలోకి వెళ్లిందామె.వాళ్లిద్దరూ కనీసం మీరెవరు? అని అడగకపోవడానికి గల కారణం నాకు అర్థమైంది. ఎదురుగా గోడకు అత్తయ్య ఫొటో పక్కన అమ్మానాన్నల ఫొటో. అమ్మ తనవెంట తెచ్చుకోవడం మరిచిపోయిన ఫొటో. చిన్నప్పటి నుంచి నేను చూడలేకపోయిన నాన్న రూపం అచ్చు నాలానే ఉంది.రాత్రి ఎనిమిది గంటలకు మావయ్య వచ్చాడు. మనిషి వంగిపోయాడు. వస్తూనే నన్ను చూసి ‘బాగున్నావా..! మీ అమ్మ..’ అంటూ ఆగిపోయాడు.పక్కనున్న కుర్చీలో కూర్చుండిపోయాడు.నేను లేచి నిలబడి ‘బాగానే ఉన్నాను మావయ్యా! అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని చివరికోరికగా చెప్పింది. అందుకే వచ్చాను. బయలుదేరతా’ అన్నాను నెమ్మదిగా.ఆయన నావైపు సూటిగా చూసి ‘‘రేపు పంపిస్తాను ఆనంద్‌ నిన్ను’’ అని కోడలివైపు తిరిగి ‘‘భోజనం ఏర్పాట్లు చూడమ్మా!’’ అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు.
భోజనం చేస్తున్నాను మౌనంగా.
 
‘‘మా పెళ్లయిన మరుసటి ఏడాదే అత్తయ్యగారు పోయారు. ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పదిహేడేళ్ల నుంచి ఎప్పుడూ తండ్రీ కొడుకులు ఎదురెదురు కూర్చుని మాట్లాడుకోవడం చూడలేదు నేను. తప్పనిసరైతే ఒకటి రెండు మాటలు. అంతే. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం తరిగిపోయింది. మా మరిది శరత్‌ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వసుంధర వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు.’’ చెప్పుకుపోతోంది ఆ ఇంటి కోడలు.‘‘సుమన ఎక్కడుంటుందక్కా!’’ అని అడిగాను మధ్యలో.‘‘ఈ ఊరే ఇచ్చాం. రైత్వారీ సంబంధం. పాపం! దాని దాకా వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. రాజీపడక తప్పలేదు.కానీ! దాని కాపురమే బాగుందనిపిస్తుందయ్యా నాకు..’’ అందామె నిట్టూరుస్తూ.‘‘మీకేం తక్కువ?’’ అడిగాను కొంచెం చనువు తీసుకుని.కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత... ‘‘అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు.ఇంటిల్లిపాదీ కూర్చుని తిని ఎరుగం... ఏదైనా నీ చేతుల్లోనే ఉంది తమ్ముడూ’’ అందామె చివరి మాటను ఎంతో ఆశగా... ప్రేమగా...నేను తలెత్తి చూశాను. ఆమె కళ్లలో సన్నటి కన్నీటిపొర. నాకు మాట రాలేదు.రాత్రి పదయింది. నేను వరండాలో కూర్చుని టీవీ చూస్తున్నా. కాశీ వచ్చాడు. నేను గుర్తుపట్టలేకపోయాను.‘‘ఆనందా..!? ఏరా బాగున్నావా? ఎప్పుడొచ్చావ్‌?’’ అన్నాడు దగ్గరకొచ్చి. నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. కాశీబావ నన్ను అంత బాగా పలకరిస్తాడనుకోలేదు. ‘‘బాగున్నాను బావా! సాయంత్రం వచ్చా’’ అన్నాను.‘‘సరే! రెస్టు తీసుకో. మాట్లాడదాం’’ అంటూ గదిలోకి వెళ్లగా అతని భార్య అనుసరించింది.

పడుకున్నా... నిద్రపట్టలేదు. ఇరవయ్యేళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.అర్ధరాత్రి కొంతమంది అమ్మను నిలదీస్తున్నారు. అమ్మ, మావయ్య తప్ప అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు. వసుంధర, అత్తయ్య దగ్గర కూర్చుని ఏడుస్తోంది. కాశీబావ నోట పోలీసులు అనే మాట వినబడి నాకు భయం వేసింది.తెల్లవారు జామున అమ్మ నన్ను వెంటబెట్టుకుని బయలుదేరింది. బస్సెక్కాక ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్లీ ఎప్పుడొస్తాం?’’ అని నేను అడగడం గుర్తొచ్చాయి.తర్వాత రాజమండ్రి మహిళా సేవాసదన్‌లో అమ్మ ఆయాగా పనిచేసింది. వాళ్ల స్కూల్లోనే నన్ను చదివించింది.అందరూ ఏ కష్టమొచ్చినా అమ్మతోనే చెప్పుకొనేవాళ్లు. ఓపికగా వినేది. సాయం చేసేది. మావయ్య వాళ్ల గురించి ప్రస్తావన తెస్తే చిరునవ్వు నవ్వి ఊరుకొనేది. తర్వాత నేను అడగడం మానేశాను.‘ఆనందూ!’ఉలిక్కిపడి లేచాను. అర్ధరాత్రి గుమ్మం దగ్గర మావయ్య.‘రండి మావయ్యా!’ అంటూ లేచాను.మావయ్య మంచం ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. బెడ్‌లైట్‌ వెలుగుతోంది. లైట్‌ వెయ్యబోతే మావయ్య వద్దని వారించాడు.‘‘నీతో చాలా విషయాలు మాట్లాడాలిరా!... మా మీద నీకు చాలా కోపం ఉందని నాకు తెలుసు’’నేను మౌనంగా వింటున్నాను. ‘‘చెయ్యని తప్పు మీదేసుకుని నా చెల్లెలు గొప్ప త్యాగం చేసింది. ఇప్పుడు శాశ్వతంగా దూరమై నాకు జీవితకాలానికి సరిపడా శిక్ష వేసింది.’’ మావయ్య గొంతు జీరబోయింది.‘‘అసలు విషయమేమిటో నాతో కూడా ఎప్పుడూ చెప్పలేదు మావయ్యా! గుచ్చి గుచ్చి అడిగి అమ్మను బాధపెట్టడం ఇష్టంలేక నేనూ ప్రస్తావన తెచ్చేవాణ్ణి కాదు’’‘‘మరి అమ్మ ఏ తప్పూ చేయలేదంటున్నారు. ఆ రోజు అంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?’’ మర్యాదగానే సూటిగా అడిగాను. 

‘‘దొంగతనం చేసింది మీ అమ్మ కాదురా! నా పెద్ద కూతురు.’’ మావయ్య గొంతులో ఉద్విగ్నత. ‘‘ఎవరినో ప్రేమించి అర్ధరాత్రి పారిపోతూ మీ అమ్మ కంటబడింది. సర్దుకున్న నగల బ్యాగ్‌ అక్కడే పడేసి భయంతో ఇంట్లోకి వచ్చేసింది. ఆ అలికిడికి ముందు నేనే లేచాను. నా కూతురు నాకు ఎదురుపడి భయంతో వణికింది. మీ అమ్మ ‘ఆడపిల్ల, దానిని ఏమీ అనొద్దు అన్నయ్యా! పెళ్లి కావాల్సిన పిల్ల. దాని జీవితం నాశనమైపోతుంది. ఏం జరిగినా ఏమీ మాట్లాడొద్దు’ అని నా చేత ఒట్టు వేయించుకుంది. ఈలోగా అందరూ పోగయ్యారు. తలో మాటా అన్నారు. నా చెల్లెలు... నా సీతమ్మ... నన్ను విడిచి ఊరు వదిలి వెళ్లిపోయింది.తర్వాత తప్పు చేసింది నా చెల్లెలు కాదు, తన చెల్లెలని కాశీకి తెలిసింది. మీ అమ్మను అన్ని మాటలన్నందుకు వాడు ఎంతో కుమిలిపోయాడు. నిజం దాచినందుకు ఆరోజు నుంచి నాతో మాట్లాడ్డం మానేశాడు.’’మావయ్య తలెత్తకుండా చెప్పుకుపోతున్నాడు.నాకు నోట మాట రాలేదు.ఇరవయ్యేళ్ల పాటు చెయ్యని తప్పుకు నింద మోసి దూరంగా బతికిన మా అమ్మ, కూతురు చేసిన తప్పుని చెల్లెలు మీదేసుకుని దూరమైపోతే నిస్సహాయంగా, నిస్సారంగా బతికేస్తున్న మావయ్య... తల్లిలా సాకిన మేనత్తను అకారణంగా నిందించి గెంటేశాననే అపరాధభావంతో కాశీ...మావయ్య లేచాడు. నేనూ లేచి నిలబడ్డాను..

‘‘మీ అమ్మ నాకు ఉత్తరాలు రాసేది. మీ బాగోగుల గురించి తెలియజేసేది. సాయం చేస్తానంటే వద్దంది. అసలు రావద్దంది. తనను వచ్చేయమన్నాను. తను వస్తే దొంగలా బతకాలి, లేదంటే నా కూతురు చేసిన పనిని పదిమందికీ చెప్పాలి. అందుకే రానంది. తన అనారోగ్యం గురించి తెలుసుకుని విలవిలలాడాను. చివరి చూపు కూడా..’’నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఏదో ఒకరోజు నిన్ను పంపుతానని చివరిసారిగా రాసిన ఉత్తరంలో మాటిచ్చిందిరా!... మళ్లీ ఉత్తరం రాలేదు. నువ్వొచ్చావు. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణిరా ఆనంద్‌’’మావయ్య గొంతు వణికింది. నేను మౌనంగా వింటున్నాను. ‘‘సరే! పడుకో. మనసులో బరువు దించుకోవడానికి ఈ ముసలోడికి ఒక అవకాశం ఇచ్చావు. సంతోషం. అడగడం మర్చిపోయాను. నీ భార్య, పిల్లలు...’’‘‘ఒక అబ్బాయి మావయ్యా! అందరూ బాగున్నారు.’’ అన్నాను.మావయ్య బయటికి నడిచాడు. వెనుక నాలుగు అడుగులు వేశాను. మెట్లెక్కుతున్న మావయ్యను చూస్తూ నిలుచున్నాను. వరండాలో ఒక మూల కాశీబావ.గుండె ఝల్లుమంది నాకు.ఈ తండ్రీ కొడుకులు మనసులో ఇంత భారం పెట్టుకొని ఇన్నేళ్లు ఎలా గడిపారో నాకు అర్థం కాలేదు. లక్ష్మక్క అన్నట్లు అంతా నా చేతుల్లోనే ఉందా? నెమ్మదిగా కాశీ దగ్గరకు వెళ్లాను.‘‘ఏంటి బావా! పడుకోలేదా?’’ అని అడిగాను.‘‘మాకు అన్నీ ఉన్నాయిరా... మనశ్శాంతి తప్ప. ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాం’’ అన్నాడు గంభీరంగా.నేనేం మాట్లాడలేకపోయాను.‘క్షమించమని అడగడానికి అత్తయ్య లేదు’ అని నా చేతులు పట్టుకున్నాడు. ‘‘బావా! ఒక్క మాట చెప్పవా..?’’ అని అడిగాను.ఏంటన్నట్టు చూశాడు.‘‘మావయ్య చేసిన తప్పేముంది? చెల్లెలు దూరమై, భార్య చనిపోయి... కొడుకు మాట్లాడక ఆయన చిత్రవధ అనుభవిస్తున్నాడు. నువ్వు మారాలి బావా!’’ అన్నాను.‘‘నాలుగు రోజులుంటావా?’’ అడిగాడు ప్రేమగా.‘‘ఆఫీసులో పని ఉంది బావా! రేపు ఉదయం వెళ్లాలి’’ అన్నాను.ఉదయాన్నే బయలుదేరాను.మావయ్య, కాశీ నాకు చెరోవైపు నడుస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులు కలిసి వీధిలోకి రావడాన్ని అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.ఎదురైన వారందరికీ ‘‘మా సీతమ్మ కొడుకు... నా మేనల్లుడు’’ అంటూ పరిచయం చేస్తున్నాడు మావయ్య.బస్సెక్కాను. ఆ ఊరికి రావడానికి తీవ్రంగా ప్రతిఘటించిన నా మనసు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి బాధపడుతోంది. అమ్మ ఆఖరి కోరిక తీర్చాను. చాలా తృప్తిగా ఉంది. అమ్మ ఆత్మ కూడా తృప్తిపడి ఉంటుంది.
గజ్జెల దుర్గారావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top