అమ్మ

funday story to mother - Sakshi

కథా ప్రపంచం

అనగనగా సూర్యుడికో కూతురుండేది. తండ్రిలాగే ఆమె కూడా ప్రచండ తేజస్విని. సూర్యుడు తన వెలుగంతా ఆమెకే ఇవ్వాలనుకున్నాడు. వేళ్లకు నక్షత్రాల వుంగరాలతో, కాళ్లకు, నడుముకు, మెడకు వివిధ కాంతిపుంజాల ఆభరణాలతో, ధూమకేతు చేలాంచలాలతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ ఆకాశంలో ఆడుకునేది, వెలుగు ప్రసరించిన విశ్వాంతరాళం ఆమె సామ్రాజ్యం. గులకరాళ్లలా అంతటా విస్తరించిన గ్రహాలను దాటి దారితప్పి దూరంగావున్న మరో గ్రహంవైపు పయనించింది. అది ఆకుపచ్చగానూ, నీలం రంగులోనూ కనిపించింది. ‘‘ఆహా! ఎంత అందమైన ప్రదేశం. ఆ నీల, హరిత లోకంలో నక్షత్ర ఖచితసింహాసనం అధిష్ఠిస్తాను. అక్కడే కలకాలం వుండిపోవాలని వుంది’’ అని చెప్పింది తండ్రితో. సూర్యుడు నిట్టూర్చాడు. తన కూతురి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అతనూహించగలడు. ‘‘నా ఆధీనంలో ఉన్న అన్ని గ్రహాలూ నీవే. ఎక్కడికైనా నువ్వు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. కానీ ఆ గ్రహం మీద ఉండాలంటే నీ కాంతి, వేడి బాగా తగ్గించుకోవాలి. నీ ఉంగరాలూ, ఆభరణాలూ, దుస్తులు ఆ గ్రహం భరించలేదు. ఆ హరిత వాతావరణం చాలా సుకుమారమైనది. నీ శరీర ఉష్ణానికి నీలిగా కనిపించేదంతా ఆవిరైపోతుంది. అందువల్ల ప్రస్తుతమున్న నీ అలంకరణలకు బదులు మరో మూడు వరాలు కోరుకో తక్షణమే ఇస్తాను’’ అన్నాడు సూర్యుడు దిగులుగా.

‘‘నన్నాలోచించుకోనీ’’ అన్నది పిల్ల. ఏళ్లు గడిచాయి. అనంతకాలంలో లక్షసంవత్సరాలన్నా ఓ క్షణంతో సమానమే గద. మరికాసేపాలోచించి, ‘‘నాకా గ్రహాన్ని తల్లిలా చేరదీయాలనిపిస్తున్నది, ఇదే నా కోరిక’’ అంది. ‘‘నా ముద్దుల తల్లీ, నీ యిష్టానికి నేనెప్పుడూ అడ్డుచెప్పను. ఎప్పుడు నీకు తిరిగి రావాలనిపిస్తే అప్పుడేరా. నీకోసం నేను నిరీక్షించని రోజుండదు. అక్కడికి వెళ్లాక నా కాంతికి నీ కళ్లు మూసుకోవచ్చు జాగ్రత్త’’ అన్నాడు సూర్యుడు ఆప్యాయంగా. అలా, ఆ పిల్ల వదిలేసిన వుంగరాలు, కాళ్ల కడియాలు, నక్షత్రహారాలు, ధూమకేతువులు సూర్యుడి చుట్టూ పాలపుంతలా పరచుకున్నాయి. అవి గుర్తులుగా ఆమె తన తండ్రి దగ్గరకి ఎప్పుడైనా తిరిగిరావచ్చు. ఒక పార, రోలు, రుబ్బురాయి, గంప, నీళ్లకుంట, గొడ్డలి, చాప, కప్పుకోవటానికో దుప్పటి, తినటానికి వెదురు బొంగులతో అల్లిన కంచాలు తీసుకుని అటుగా పయనించిన ఒక నక్షత్రం మీద ఎక్కి తన కొత్త నివాసానికి ప్రయాణమైందామె. మరెంతో కాలం విశ్వాంతరాళంలో విహరించి, హరిత గ్రహానికి చేరుకుంది. అక్కడ విస్తారంగా పెరిగిన అరణ్యాలు, పచ్చిక మైదానాలు, వివిధ జాతుల మొక్కలు చూసి ఆమె మనసు ఆనందంతో నాట్యం చేసింది. రంగురంగుల పువ్వులు – పసువు, నారింజ, ఎరుపు, తెలుపు, నిమ్మరంగు, నీలి, వూదా– వాటి కలయికతో ఏర్పడిన మరెన్నో రంగులు ఆమె అదివరకెప్పుడూ చూడలేదు. ‘‘ఇంత సంతోషాన్ని నేనొక్కదాన్ని భరించలేను. నాకు పిల్లలు కావాలి. చాలామంది పిల్లలు. అందర్నీ నేను పోషించగలను. కేరింతలు కొడుతూ, పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ, ఈ పర్వతాలు ప్రతిధ్వనించేలా కేకలు పెడుతూ ఆడుకుని, సేవచేసి, ప్రశాంతంగా నా కళ్లు మూసే పిల్లలు’’. ఆ క్షణమే ఆమె కోరిక తీరింది. వందలు, వేలు, లక్షల్లో పిల్లలు నలుదెసలా తిరుగాడారు. మగ, ఆడ, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, లావు, సన్నం అన్ని రకాల పిల్లలు వచ్చి ఆ తల్లిని ఆలింగనం చేసుకున్నారు.

అలాగ, అన్నాళ్లు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించిన ఆ నక్షతం మరోగ్రహం మీద జీవరాసులన్నింటికీ తల్లిగా మారింది. తారతమ్యం లేకుండా ఆమె అందర్నీ ఒక్కలాగే ప్రేమించింది. బలవంతులు, బలహీనులు, అందగాళ్లు, కురూపులు, చతురులు, మూర్ఖులు అన్న తేడా ఆమెకు లేదు. పిల్లలు నడిచారు. పరిగెత్తారు. రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కొందరు అంతా తమకే కావాలన్నారు. కొందరు రోజుగడిస్తే చాలన్నారు. కొందరు తప్పులు చేసి చెయ్యలేదన్నారు. కొందరు అందరి తప్పులు తమమీద వేసుకున్నారు. కొందరు అంతా తమకే తెలుసన్నారు. కొందరు ఏమీ తెలియదన్నారు. కొందరి పనులు పక్కవాళ్లకు ప్రాణాంతకంగా మారాయి. కొందరు ఆత్మరక్షణ కోసం తండ్రి ప్రేమతో పంపిన ఎండ, తన పిల్లల్ని చలినుండి రక్షించింది. వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. శిశిరమూ, చలికాలమూ వచ్చి మొక్కల్ని కూడా నిద్రపుచ్చాయి. తన పారతో నేలను గుల్లగా చేసింది. పిల్లలు ఎంత తిన్నా తరగనంత భోజనం సమకూర్చింది. ఈ పిల్లల తల్లి తన సంతానం కోసం చెయ్యనిదంటూ లేదు.
ఏళ్లు గడిచాయి. పిల్లల్లో మార్పు వచ్చింది.

‘‘నా గురించి ఇప్పుడెవరూ ఆలోచించరు. తమస్వార్ధమే తప్ప తల్లి అవసరమేమిటో ఎవరికీ పట్టదు’’ అని తండ్రితో చెప్పుకుని విలపించిందామె. ‘‘వాళ్లు నీ పిల్లలు. నీ ఇష్టంతో నువ్వు వాళ్లనీలోకంలో సృష్టించావు. విద్యాబుద్ధులు నేర్పించి, బాధ్యతల గురించి కూడా కాస్త చెప్పాలి మరి’’ అన్నాడు సూర్యుడు. కానీ వాళ్లు తన మాట వినరు. అస్తమానమూ తమలో తాము కీచులాడుకుంటారు. ఎంతిచ్చినా ఇంకా కావాలి అనే దురాశ బాగా పేరుకుపోయింది. ‘‘నాకు ఆకలేస్తోంది. నాకు నీళ్లు కావాలి. ఇన్ని కష్టాలా? మరింత సుఖం కావాలి’’ అంటూ వాళ్లు ఆమెను సతాయించని క్షణంలేదు. తన సంతానంలో ఎవరికే బాధకలిగినా పిల్లల తల్లి మనసు చివుక్కుమంటుంది. గాయమైందంటే లేపనం రాస్తుంది. ఆకలికి కొత్త పంటలు, దాహానికి కొత్త కాలవలు. కానీ వాళ్ల ఆశకు అంతులేదు. గిల్లి, రక్కి తనను వాళ్లు గాటుపెట్టని చోటులేదు. తల్లి ఇచ్చిన దానితో తృప్తిపడక ఒకర్నొకరు చంపుకుని ‘ఇదే మా విజయం’ అనుకున్నారు. తల్లి హృదయం క్షోభించింది. ఆమె ఆత్మ విశ్వాసం సన్నగిల్లింది. తమ కష్టాలన్నింటికీ పిల్లలు తల్లినే నిందించడం ఆనవాయితీగా మారింది. తనలో మొదటి ఉత్సాహం లేదు. తల్లిమీద కనికరంలేని పిల్లలు. తన పాలు కాదు. నెత్తురు తాగుతున్నారు. తనను కోసుకుని తిని అదే రుచికరమైన ఆహారమనుకుంటున్నారు.

ఆమెకు విసుగొచ్చిన క్షణాన మహోధృతంగా గాలివీచి, చెట్లను కూకటివేళ్లతో పెకలిస్తుంది. కన్నీరు కార్చినప్పుడు సముద్రాలు పొంగుతాయి. పక్షుల కిలకిలా రావాలకు బదులు భీకర శబ్దాలతో కంపిస్తుంది. పర్వతాల మీద మంచు తుంపరలకు బదులు చల్లగాలి కంబళీ కప్పుకుంటుంది.ఆమె కుంచించుకుపోయిన తన అరణ్యాలను చూసి విలపించింది. తల్లిని వివస్త్రను చేసిన పిల్లలు ఎక్కడ తలదాచుకుంటారు. ఈ మారణ హోమాన్ని ఆపేదెట్లా? తల్లికి పిల్లల గురించి తప్ప మరో ధ్యాస లేదు. కానీ వాళ్లు ఆమె గుండెల్ని గునపాలతో తవ్వారు. విలువైన ఖనిజాలు, లోహాలు కావాలట. కండల్ని పీకి ఆనందించారు. నెత్తురు వరదలై కారింది. ఒకప్పుడు తల్లి జోలపాటలతో నిద్రపుచ్చింది. ఇప్పుడామె హాహాకారాలు కూడా వాళ్లకు వినిపించవు. ఒకప్పుడు తన ఒడిలో ఆడుకున్న పాపాయి ఇనప గోళ్లతో ఇప్పుడు తనను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. తిరగగలిగినంత భూమి ఉంది అందరికీ. కానీ బలవంతుడు వచ్చి బలహీనుల భూమిని కబ్జాచేసి ‘ఇదినాదే’ అంటూ నిత్యం కలహించుకుంటే తనెన్ని తగువులని తీర్చగలదు? భూమి మాత్రమే కాదు. రాళ్లు రప్పల గురించి తలలు పగల కొట్టుకుంటున్నారు.

స్వేచ్ఛగా విహరించే పక్షుల్ని, జంతువుల్ని పంజరాలలో బోనులలో బంధించారు. నదిలోని చేపల్ని ఇళ్లలో నీటి తొట్లలో వేశారు. అలా, అంతులేని మనోవ్యధతో కృంగి కృశించి ఒకనాడు కన్ను మూసింది పిల్లలతల్లి. కానీ పిల్లలకా విషయం కూడా తెలియదు. మరణం తర్వాత ఆమె రెండో కోరిక తీరింది. తన అవశేషాలను ఒక నల్లటి గుడ్డలోకట్టి పిల్లల అవసరాలకోసం తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడామె ఒక ప్రేతంలాగున్నది. ఎవరూ గుర్తుపట్టలేదు. అయినా, తల్లి గురించి ఆలోచించటం పిల్లలెప్పుడో మానేశారు. అప్పుడప్పుడూ పర్వతాలలో, అరణ్యాలలో, సముద్రంమీద తుపానులాగ ఆమె రోదించింది.   ఇంత మందిని కన్నా, ఒకే పిల్లకు మాత్రం తనంటే ప్రేమ, నల్లటి జుత్తు, అందమైన కళ్లతో చక్కగా పెరిగిందా అమ్మాయి. ఆమెను చూస్తే తల్లి హృదయం పొంగుతుంది. ఇన్ని కోట్ల మందిలో ఒక్కరైనా తనగురించి ఆలోచిస్తున్నందుకు తల్లికి తన ప్రయత్నం వృ«థా కాలేదనిపించింది. తన తర్వాత తన పని కొనసాగించటానికి ఈ పిల్ల చాలు. ఒక వాయు ప్రళయం వచ్చి ఆమెను రజనుగా మార్చి ఆకాశంలోకి తీసుకెళ్లింది. అక్కడ ఘనీభవించిన ఆ రజనే మనం చూసే చంద్రుడు. తండ్రి ప్రకాశాన్ని తనలో జీర్ణించుకొని, చల్లని చూపులతో భూమి మీద తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నదా తల్లి. ఆమె చలువ వల్లనే మన గ్రహం ఇంత పచ్చగా, చల్లగా ఉన్నది. నిత్యం పోట్లాడుకుంటున్న పిల్లల్ని చూసి కన్నీరు కారుస్తున్నదా తల్లి. ఈ ఘోరాలు చూడలేక ఆమె కనుమరుగై, సన్నటి వంకలా మారుతుంది. పిల్లల్లో మార్పు వస్తుందేమోనని ప్రతినెలా వెన్నెల కురిపిస్తుంది.  తల్లిని ప్రేమించటం ఎప్పుడు నేర్చుకుంటారీ పిల్లలు!?
  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top