మామయ్య ప్రపంచం 

Funday new story special - Sakshi

కొత్త కథలోళ్లు

నాది చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చెల్లెలు, అమ్మమ్మ, మామయ్య. ఇదే నా ప్రపంచం. చిన్న చిన్న ప్రపంచాల్లోనే కొన్నిసార్లు చాలా పెద్ద కథలుంటాయి. మామయ్య గురించి చెప్పాలి. ఆయన ఈరోజు ఇంతలా ఎందుకు గుర్తొస్తున్నాడో చెప్పాలి.  మామయ్యది ఒక పల్లెటూరు. అమ్మమ్మతో పాటు ఉండేవాడు. ఆదివారం వచ్చిందంటే మేమందరం అక్కడికి వెళ్లిపోయి సరదాగా గడిపేస్తుంటాం. ఈ ఆదివారం ఆయన ఇక్కడ లేకపోవడం, ఇంకే ఆదివారం ఉండడు అన్న ఆలోచనే ఎందుకో బాధను పెంచెస్తోంది.రాత్రిపూట ఆరుబయట ఇలా మంచం మీద పడుకొని ఉంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి నా ఆలోచనలు. మామయ్య ఎలా ఉండేవాడు! నన్ను, చెల్లిని చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమతో పెంచాడు. నాకు బాగా గుర్తు.. స్కూల్‌కెళ్లే తొలినాళ్లలో తనే రెడీ చేయించి మరీ స్కూల్‌కి తీసుకెళ్లేవాడు. మధ్యాహ్నం అయితే భోజనం దగ్గర గారం చేయడం నా పని. చెల్లి కూడా అచ్చం నాలాగే! అస్సలు తినేవాళ్లమే కాదు. మామయ్య పైకి చూపెట్టి, ‘‘చూడండి పిల్లలూ! ఈ ముద్ద మీరు తినకపోతే ఆ ఫ్యాన్‌ మీ మీద పడిపోతుంది’’ అనేవాడు. నిజానికి, అబద్ధానికి తేడా తెలియని ఆ వయసులో అది నిజమేనేమోనని భయంతో తినేసేవాళ్లం. 

మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఎన్నెన్ని కబుర్లు చెప్పేవాడో తల్చుకుంటే, ఇప్పుడు ఆయన పక్కనలేనందుకు కూడా కోప్పడాల్సింది ఆయన్నే కదా అనిపిస్తోంది. కోపమైనా, ఇష్టమైనా మామయ్య మీదే అలా చూపించేస్తాం నేను, చెల్లి. మేం చదువుల్లో ఒక్కో తరగతీ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కళ్లలో సంతోషం కనిపించేది.  కొన్నిసార్లు సమయాలు ఎలా ఎలా గడిచిపోతాయో ఆలోచిస్తే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మామయ్య స్కూల్లో చేరిపించాడో లేదో, అలా పదోతరగతికి వచ్చేసినట్టు అనిపించింది.పదేళ్లలో ఈ ప్రపంచంలో, నాలో ఎన్ని మార్పులొచ్చినా మామయ్య ప్రపంచంలో ఏ మార్పూ రాలేదు. ఎప్పట్లాగే మేమే ఆయన ప్రపంచం. నా పదో తరగతి పూర్తయింది. కాలేజీలో జాయిన్‌ అవ్వాల్సిన రోజులవి. పదో తరగతి వరకైతే ఇంటి దగ్గరే ఉండి చదవగలిగాను కానీ, ఇంటర్‌లో మంచి కాలేజీలో చేరాలి. బైపీసీ తీసుకొని డాక్టర్‌ అవ్వాలి. అందుకు నేను విజయవాడ వెళ్లి తప్పక చదువుకోవాల్సిన పరిస్థితి.మామతో ఇదే మాట చెబితే, నా గడ్డం పట్టుకొని, ‘‘ఏరా కొడుకా! అంత దూరం పోవాలా? ఎలా ఉంటావో ఏమో మా అందర్నీ వదిలేసి!’’ అంటూ నా కళ్లకేసి చూశాడు. నాకప్పుడు అర్థం కాలేదు ఆ మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉందో! 

‘‘ఉంటానులే మామా! నువ్వేం దిగులుపడకు.’’ అన్నాను ఎంతో కులాసాగా.‘నువ్వుంటావేమో తల్లీ! నేను ఉండలేనే’ అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వాడు.కాలేజీలో చేరి చదువుల్లో పడిపోయా. ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది. నా చిన్న ప్రపంచం చిన్న చిన్నగా పెరగడం మొదలైంది. ఆ మార్పును అర్థం చేసుకుంటుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది.సెలవులిచ్చారు. అంతకుముందు ఆదివారం వచ్చిందంటే నాకొక ఉత్సాహం ఉండేది. కాలేజీలో చేరాక మళ్లీ సంవత్సరానికి అంతే ఉత్సాహంతో ఆదివారం కోసం ఎదురుచూశా.ఎప్పట్లానే ఆ ఆదివారం ఊరికి వచ్చాం. కానీ ఈసారి ఎప్పటిలా లేడు మామయ్య. బక్కచిక్కిపోయి నీరసంగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడో ఎవ్వరూ చెప్పలేదు. మామయ్యను అంత దిగాలుగా చూడటం అదే మొదటిసారి. ఆ సాయంత్రమే తిరిగి ఇంటికెళ్లిపోయాం. ఒక రెండు రోజుల తరువాత మామ ఇంటికొచ్చాడు. ‘‘ఎప్పుడెళ్లాలి తల్లీ మళ్లీ కాలేజీకి?’’ అన్నాడు టీ తాగుతూ.‘‘రేపే’’ అన్నాను.టీ తాగడం అయ్యాక ‘‘సరే, నేను బయల్దేరుతాను’’ అంటూ పైకి లేచాడు. గడప వరకూ వెళ్లి వెనక్కి తిరిగి నా గడ్డం పట్టుకొని.. ‘‘రేపే వెళ్లిపోవాలా కొడుకా?’’ అన్నాడు దీనంగా. ఔనన్నట్లు తలూపాను. 

ఆ క్షణం తన కళ్లలో ప్రేమ, ఆప్యాయత, బాధ కన్నీటి చుక్కలా రాలిపడుతుంటే దాన్ని పట్టుకుని.. ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి ‘‘సరే నాన్నా! జాగ్రత్త. అప్పుడప్పుడు అయినా ఫోన్‌ చెయ్యొచ్చు కదా!’’ అన్నాడు.
అలాగే అన్నట్టు తలూపాను. మామయ్య మా ఫోన్‌ కోసం ఎంతెంత ఎదురుచూసేవాడో ఆ మాట తీరులో తెలిసిపోతుంది. కానీ అది అర్థమయ్యేసరికి ఈరోజు వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఆ రోజు మామయ్య వీధి చివరికెళ్లేవరకూ అలా చూస్తూనే ఉండిపోయా. సత్తువ లేని ఆ కాళ్లతో మామయ్య అలా ఎంతో ఆయాసంగా నడిచి వెళ్తోంటే ఏడుపు తన్నుకొచ్చింది. ‘మామయ్యని వదిలేసి ఎక్కడో ఎలా ఉంటున్నా నేను?’ అనిపించింది ఆ క్షణం. ఆ వెంటనే చదువుకోసం ఇవన్నీ తప్పవు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. చూస్తుండగానే అలాగే మరో సంవత్సరం కూడా గడిచిపోయింది. ఈసారి సెలవులకి మాత్రం మామ పరిస్థితి ఇంకా మారిపోయింది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. పెళ్లి, పిల్లలు ఏదీ లేకుండా మేమే ప్రపంచమై బతికాడు. తనకంటూ రూపాయి కూడబెట్టుకోలేదు. చేతికి రూపాయి వచ్చినా అది మా కోసమే ఖర్చు పెట్టాడు. మామే అయినా ఒక తండ్రి కంటే ఎక్కువ ప్రేమనే చూపించాడు మా మీద. ఆస్తి అంటూ ఏమీ లేకున్నా వాటన్నింటి కంటే మించిన ప్రేమ ఉంది మామ దగ్గర. అంతగా మమ్మల్ని ప్రేమించిన మామని అలా చూడలేక, ‘‘పద నువ్వు.. హాస్పిటల్‌కి..’’ అన్నాను. ‘‘నాకేమైందని?’’ అంటూ అలానే ఉండిపోయాడు. నాకు మామయ్య మీద అరోజు కోపమొచ్చింది. ఆయన కోసమే చెప్తుంటే ఇలా మాట్లాడతాడు ఏంటని ఆయనతో మాట్లాడొద్దనుకున్నా. మూడు నెలలు అలాగే గడిచిపోయాయి.

నా చదువులు కూడా బాగా సాగుతున్నాయి. కాలేజీ మారింది. ఇంకో కొత్త ప్రపంచం ఇప్పుడు. ఈ కొత్త ప్రపంచం పరిచయమైన ఒకరోజు ఫోనొచ్చింది – ‘‘రేయ్‌ కొడుకా! ఇదిగో ఈ ఊళ్లోనే ఉన్నా. హాస్పిటల్‌కి వచ్చా. నువ్వు రాగలవా ఇక్కడికి!’’ అని అడిగాడు మామయ్య.నేను కోపంలోనే ‘‘రాలేను నేను’’ అన్నాను.ఆ తరువాత కొన్ని రోజులకు డిశ్చార్జ్‌ అయ్యాడు. నాన్న మామయ్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అ తర్వాత నేనే ఇంటికెళ్లి చూస్తే ఆయన పరిస్థితి అర్థమై దగ్గరికెళ్లి మాట్లాడలేకపోయా. ఏమీ తినలేకపోతున్నాడు. ఏం తిన్నా, ఏం తాగినా కడుపులో నిలవట్లేదు. ఏమీ మింగలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా తన బాధ మాతో ఎప్పుడూ పంచుకోలేదు. కొన్ని రోజులకి మళ్లీ ఊరెళ్లిపోయాడు. ఒకరోజు అనుకోకుండా నాన్న, చెల్లి వచ్చారు. ఇంత పొద్దున్నే ఏంటా? అనుకుంటూ ఆఫీస్‌ రూమ్‌ వైపుకు నడిచాను. ఏదో తెలియని బాధ వాళ్ల కళ్లలో. ఆ బాధకి కారణాన్ని నేను అడిగేలోపే నాన్న, ‘‘మామకి సీరియస్‌ అంట. వెంటనే బయలుదేరు’’ అన్నాడు. అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించగలుగుతున్నా. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. గేటు వైపుకి అడుగులు వడివడిగా సాగాయి. ఊరు చేరేవరకూ మామ జ్ఞాపకాలే. ఇంటికి ఆమడ దూరంలో ఉండగానే అంతమంది మనుషుల్ని చూడగానే మనసు కలవరపడింది. ఆగిపోతా అంటున్న నడకని కాదంటూ అడుగు ముందుకేశా. ప్రేమే ఊపిరై బతికే మామని ఊపిరి లేకుండా అలా చూసి నోటి వెంట మాట రాలేదు, కళ్లలో నీళ్లు తప్ప.ప్రేమతో గోరుముద్దలు తినిపించిన మామకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోయాననే బాధ. ‘‘రాగలవా?’’ అన్నప్పుడు ఎందుకు వెళ్లలేదు అనే కోపం నామీద నాకు. కానీ కోపం తనకెప్పుడూ లేదు నా మీద. ఎందుకంటే తనకి తెలిసింది.. ప్రేమించడం, అభిమానించడం.. అంతే. అందుకేనేమో తన జీవితంలోని చివరిరోజున కూడా అమ్మకి ఫోన్‌ చేసి ‘‘పిల్లలెలా ఉన్నారు? చూడాలని ఉంది.’’ అని అడిగాడు. మామయ్య మమ్మల్ని చూడాలని ఎవ్వర్నీ అడగని చూడాలనుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో తల్చుకున్నప్పుడల్లా ఇప్పుడున్న బాధంతా రెట్టింపవుతుంది. ఆ బాధలోనే మామయ్య తిరిగొస్తే బాగుండు అన్న ఆశ పుట్టుకొస్తుంది, మళ్లీ రాడని తెలిసినా! 
- హెప్సిబ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top