నేరం దాగదు..

Funday Crime Story On 21st July 2109 - Sakshi

క్రైమ్‌ స్టోరీ

ఆ రోజు ఆదివారం. సెలవు కాబట్టి వీరభద్రరావు కూరగాయలు తేవడానికి రైతుబజారుకు బయల్దేరాడు. స్కూటర్‌ స్టార్ట్‌ చేస్తుండగా జేబులో సెల్‌ మోగింది.
‘‘హలో..’’ అన్నాడు.
‘‘వీరభద్రం నేను సుమన్‌ మాట్లాడుతున్నాను శాంతినగర్‌ నుంచి..’’
‘‘సుమన్‌! చెప్పు ఏంటి విశేషం?’’
‘‘మీ కాలనీలో ఉన్నది కదా మా చెల్లెలు రాజకుమారి..’’
‘‘ఔను! వాళ్ల గృహప్రవేశానికి నేనూ వచ్చాను. గుర్తుంది.’’

‘‘కాల్‌ చేస్తుంటే ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదు. మా మేనకోడలు చిత్ర కూడా ఫోన్‌ ఎత్తడం లేదు. కొంచెం వాళ్లింటికి వెళ్లి చూస్తావా? ఇద్దరూ ఫోన్‌ ఎత్తకపోవడంతో కంగారుగా ఉంది. ఈరోజు సండే కదా వాళ్లిద్దరినీ లంచ్‌కి పిలుద్దామంది మా ఆవిడ. ఫోన్‌ చేస్తుంటే రింగవుతోంది కాని లిఫ్ట్‌ చెయ్యడం లేదు..’’ చెప్పాడు సుమన్‌. వీరభద్రరావు వాచీ చూసుకున్నాడు. తొమ్మిది కావస్తోంది. స్కూటర్‌ రాజకుమారి వాళ్లింటి వైపు తిప్పాడు. సచివాలయనగర్‌ కాలనీలో ఇండిపెండెంట్‌ డాబా ఇల్లు అది. స్కూటర్‌ గేటు ముందు ఆపి లోపలకు వెళ్లాడు. కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. రెండు నిమిషాలు ఎదురు చూశాడు. రెస్సాన్స్‌ లేదు. తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది.

‘‘హలో..! రాజకుమారిగారూ!’’ అంటూ హాల్లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంట్లో చప్పుడు లేదు. బెడ్‌రూమ్‌ తలుపు నెడితే తెరుచుకుంది. బెడ్‌ మీద రాజకుమారి అపస్మారక స్థితిలో ఉంది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి, బతికే ఉందని నిర్ధారించుకున్నాడు.
ఈమె తెలివితప్పి పడి ఉంది. లోపల బోల్టు వేసుకోలేదు. ఈమె కూతురు ఎక్కడ? ఏం జరిగింది? ఇంకొక బెడ్‌రూమ్‌ దగ్గరకు వెళ్లాడు. తలుపు నెడితే తెరుచుకుంది. హడలిపోయాడు వీరభద్రరావు. బెడ్‌ మీద రక్తపు మడుగులో పడి ఉంది చిత్ర. బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న సామాన్లన్నీ నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. చూస్తుంటే ఇదంతా దొంగల పని అయి ఉంటుందనుకున్నాడు.

హడావుడిగా వీధిలోకి వెళ్లాడు. ఇరుగు పొరుగువారిని పిలిచాడు. రాజకుమారి ఇంట్లో దొంగతనం జరిగిందని, చిత్రను హత్య చేశారని చెప్పాడు. వీరభద్రరావు జరిగినదంతా సుమన్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. తాను వెంటనే బయల్దేరి వస్తున్నానన్నాడు.
సుమన్‌ అక్కడకు చేరుకునే సరికే సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నారు. అంబులెన్సులో రాజకుమారిని హాస్పిటల్‌కి పంపించినట్లు చెప్పారు. 
‘‘సార్‌! నేను రాజకుమారి అన్నను. శాంతినగర్‌లో ఉంటాను. ఈరోజు సండే అని నా భార్య నా చెల్లెలిని, మేనకోడలిని లంచ్‌కి పిలుద్దాం అంటే కాల్‌ చేశాను. ఇద్దరూ లిఫ్ట్‌ చేయకపోవడంతో నా కొలీగ్‌ వీరభద్రరావుకి కాల్‌ చేసి ఏం జరిగిందో చూడమని రిక్వెస్ట్‌ చేశాను’’ అని ఇన్‌స్పెక్టర్‌ నాగిరెడ్డితో చెప్పాడు.

ఎస్సై హుస్సేన్‌ ఇల్లంతా కలియదిరిగాడు. చిత్ర బెడ్‌రూమ్‌ క్షుణ్ణంగా పరిశీలించాడు. చిత్ర గుండెల్లో కత్తితో పొడిచి చంపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరకలేదు. చిత్ర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కి పంపించారు. ఇంటిని లాక్‌ చేసి సీల్‌ చేశారు. పోలీసులు రాజకుమారి, చిత్రల గురించి ఇరుగు పొరుగు వారిని విచారించారు. వెంకట్రామయ్య భార్య రాజకుమారి. ఆయన సెక్రటరియేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మూడేళ్ల కిందట గుండెపోటుతో చనిపోయాడు. ఇరుగు పొరుగుతో ఇద్దరూ సఖ్యంగానే ఉంటారని, మంచిమనుషులేనని చెప్పారు.
‘‘సుమన్‌గారు! మీ చెల్లెలి కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా?’’ అడిగాడు ఇన్స్‌పెక్టర్‌ నాగిరెడ్డి. ‘‘లేదండీ! నా చెల్లెలు కలుపుగోలు మనిషి. చిత్ర కూడా మంచిదే. ఈ ఏడాది చిత్రను నా కొడుకు సుదర్శన్‌కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కూడా. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ విచారంగా చెప్పాడు సుమన్‌.

‘‘మీ అబ్బాయి ఏం చేస్తాడు?’’
‘‘మావాడు డిగ్రీ చదివాడు. ఎక్కడా జాబ్‌ చెయ్యనని స్వయంగా ఆటో సీటు కవర్లు తయారు చేసే ఇండస్ట్రీని నడుపుతున్నాడు.’’
కాసేపటికి హాస్పిటల్‌ నుంచి కాల్‌ వచ్చింది. రాజకుమారికి తెలివి వచ్చింది, మాట్లాడుకోవచ్చంటూ...
ఇన్స్‌పెక్టర్‌ నాగిరెడ్డి, ఎస్సై హుస్సేన్‌లతో పాటు పోలీసు వెహికల్‌లో వెళ్లాడు సుమన్‌. అందరినీ చూసి రాజకుమారి బెడ్‌ మీద నుంచి లేస్తుంటే ఇన్స్‌పెక్టర్‌ వారించాడు. ‘‘ఫర్వాలేదమ్మా! పడుకోండి. చెప్పండి రాత్రి ఏం జరిగింది?’’ అడిగాడు ఇన్స్‌పెక్టర్‌.
‘‘రాత్రి మేం భోజనాలు చేసిన తర్వాత కాలింగ్‌ బెల్‌ మోగితే వెళ్లి తీశాను. బురఖాలో ఉన్న ఒక అమ్మాయి వచ్చింది. ‘‘ఆంటీ నేను చిత్ర ఫ్రెండును. అర్జంటుగా కలవాలని వచ్చాను’’ అంది. సరేనని చిత్ర బెడ్‌రూమ్‌ తలుపు తెరిచాను. ఆమె చిత్రతో మాట్లాడుతుంటే, నేను హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్‌ చేశాను. ఇంతలో ఎవరో నా ముక్కు మీద కర్చీఫ్‌తో అదిమారు. తియ్యటి వాసన వేసింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మెలకువ వచ్చేసరికి ఇదిగో ఇక్కడున్నాను. ఏం జరిగిందో చెప్పరూ..’’ అంటూ రాజకుమారి ఏడ్చింది.

‘‘కుమారీ! ఏడవకు..’’ అన్నాడు సుమన్‌.
‘‘అన్నయ్యా! ఏమైంది? నువ్వయినా చెప్పు..’’ అంది రాజకుమారి వెక్కిళ్లు పెడుతూ..
‘‘కుమారీ! ఘోరం జరిగిపోయింది. రాత్రి వచ్చింది దొంగలు. చిత్రను చంపారు. డబ్బు, నగలు దోచుకున్నారు’’ చెప్పాడు సుమన్‌.
‘‘సార్‌! రాజకుమారి ఇంట్లో జరిగిన దొంగతనం గురించి అనుమానంగా ఉంది. దొంగతనానికి వచ్చిన వాళ్లు ముందు రాజకుమారి తలుపు తియ్యగానే అటాక్‌ చెయ్యాలి. అలా జరగలేదు. బురఖాలో వచ్చిన అమ్మాయి చిత్ర గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తనకు ఎవరో మత్తుమందు వాసన చూపించారంటోంది రాజకుమారి. కేవలం దొంగతనానికి వస్తే చిత్రకూ క్లోరోఫాం వాసన చూపించి, ఆ తర్వాత దోచుకోవచ్చు. హత్య చేయడం దేనికి?’’ అనుమానం వ్యక్తం చేశాడు ఎస్సై.

ఆలోచనలో పడ్డాడు ఇన్స్‌పెక్టర్‌. రాజకుమారి సెల్‌ కాల్‌ డేటా తెప్పించారు. అందులో ఎక్కువగా ఒక నంబర్‌కే కాల్స్‌ వెళ్లాయి. ఆ నంబర్‌ నుంచే ఆమె సెల్‌కి కాల్స్‌ వచ్చాయి. ఆ నంబర్‌ రాఘవరావుది. ఆయన సెక్రటరియేట్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌. రాఘవరావుని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించి ఇంటరాగేట్‌ చేశారు.
‘‘చెప్పండి రాఘవరావుగారూ! రాజకుమారి నుంచి మీకు ఎక్కువగా కాల్స్‌ వచ్చాయి. మీ సెల్‌ నుంచి ఆమెకు కాల్స్‌ వెళుతున్నాయి. మీ ఇద్దరికీ ఏంటి సంబంధం?’’ ప్రశ్నించాడు ఇన్స్‌పెక్టర్‌. ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. భయపడినట్లు కనిపించాడు.
‘‘అబ్బే సంబంధం ఏమీ లేదండీ. ఆమె భర్త వెంకట్రామయ్య నా సెక్షన్‌లోనే పనిచేసేవాడు. అతను చనిపోయాక వాళ్లకు రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్, ఇన్సూరెన్స్‌ డబ్బు గురించి హెల్ప్‌ చేశాను. వాళ్లమ్మాయికి జాబ్‌ ఇప్పించాను. వాటి గురించి మాట్లాడుకుంటాం. అంతే!’’

‘‘వెంకట్రామయ్య పోయి మూడేళ్లయింది. డబ్బులన్నీ వచ్చేశాయి. పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టుకున్నారు. ఇంకా ఏముంది మీరు రోజూ మాట్లాడుకునేది?’’ కఠినంగా ఉంది ఇన్స్‌పెక్టర్‌ కంఠం. రాఘవరావు ముఖం నల్లబడింది. తలవంచుకుని కూర్చున్నాడు.
‘‘నేను చెప్తాను వినండి. మీకు రాజకుమారితో అక్రమసంబంధం ఏర్పడింది. మీరు ఇంటికి రావడం పోవడం చిత్రకు ఇష్టం లేదు. తల్లితో ఘర్షణ పడుతోంది. మీ సంబంధం కొనసాగాలంటే చిత్రను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దొంగతనం ప్లాన్‌ వేసి, చిత్రను హత్య చేశారు.’’
హడలిపోయాడు రాఘవరావు.
‘‘సార్‌! రాజకుమారితో సంబంధం నిజమే. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ హత్యతో నాకే సంబంధం లేదు..’’ ఏడవడం మొదలుపెట్టాడు అంత లావు మనిషి రాఘవరావు.
‘‘మీరు హత్య చేయించి ఉండకపోతే మీకేమీ కాదు. నిజం దాగదు. బయటపడితే జైలుకు పోతారు’’ అని హెచ్చరించాడు ఇన్స్‌పెక్టర్‌. తర్వాత సుమన్‌ని ప్రశ్నించాడు.
‘‘మీ చెల్లెలు కూతురు చిత్రను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నామని అన్నారు. అందుకు చిత్ర ఒప్పుకుందా?’’
‘‘అయ్యో! మావాడంటే చిత్రకు ప్రాణం. చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగారు. అప్పుడప్పుడు సినిమాలకు, షికార్లకు పోతుంటారు కూడా..’’
‘‘అలాగా! చిత్రకు మీవాడితో పెళ్లి ఇష్టమేనన్న మాట’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్‌. ‘‘ఔనండీ! దురదృష్టం. చిత్ర మా కోడలు కాలేకపోయింది. దేవుడు అన్యాయం చేశాడు’’ అన్నాడు సుమన్‌.

‘‘సుదర్శన్‌! చెప్పు.. మీ మేనత్త కూతురు చిత్ర నువ్వు చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగేవాళ్లని, ఒకరంటే మరొకరికి ప్రాణమని చెప్పాడు మీ నాన్న..’’
‘‘ఔనండీ! మా పెళ్లి ఈ ఏడాదే చెయ్యాలనుకుంటున్నారు..’’
‘‘చిన్నప్పటి నుంచి అంటే చిత్రకు మూడు నాలుగేళ్ల నుంచి తెలుసా?’’
‘‘ఔనండీ! అది పుట్టినప్పటి నుంచి తెలుసు. పదేళ్ల వయసొచ్చినప్పటి నుంచి నాతో ఆడుకునేది. నేనంటే ప్రాణం..’’ చెప్పాడు సుదర్శన్‌. అంతే! చెంప పేలిపోయింది. ఎస్సై నాలుగువేళ్లూ అచ్చుపడ్డాయి దవడ మీద. ‘‘బద్మాష్‌! చెప్పరా! ఎందుకు చంపావు చిత్రని?’’ అరిచాడు ఎస్సై హుస్సేన్‌. వణికిపోయాడు సుదర్శన్‌.
‘‘చిత్రకి పదేళ్ల వయసప్పుడు తల్లి చనిపోయింది. వెంకట్రామయ్య మీ మేనత్త రాజకుమారిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు. మొగుడుపోయిన మీ మేనత్త రాఘవరావుని తగులుకుంది.’’

థర్డ్‌ డిగ్రీ టార్చర్‌కి ఏడవసాగాడు సుదర్శన్‌.
‘‘చిత్రని నీకిచ్చి పెళ్లి చేస్తే మీ మేనత్తకి ఎదురుండదు. వెంకట్రామయ్య పోయాక ఒంటరితనం వల్ల రాఘవరావుతో అక్రమసంబంధం కొనసాగాలంటే, అల్లుడి కుటుంబం సహకారం అవసరం. అందుకే చిత్రను నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంది. అందుకు చిత్ర ఒప్పుకోకపోవడం లేదు. నువ్వు చిత్రను కొట్టడం బ్యూటీపార్లర్‌ నడిపే శ్రావ్య చెప్పింది. నువ్వంటే ఇష్టంలేదని శ్రావ్య దగ్గర వాపోయింది చిత్ర. ఆమె దారికి రాకపోవడంతో ఇక హత్య చేసి అడ్డు తొలగించుకోవాలనుకుంది మీ మేనత్త. తర్వాత ఆస్తి అంతా నీకు రాసిస్తానని ఆశ పెట్టింది. నువ్వు చిత్రను హత్య చేశావు..’’
ఏడవసాగాడు సుదర్శన్‌.
‘‘నేరం దాగదు. తెలుసుకోరా బద్మాష్‌! అనవసరంగా చెప్పుడు మాటలు విని నీ జీవితం నాశనం చేసుకున్నావు. మీ ఫ్యామిలీ మొత్తం జైలుపాలు కావాల్సిందే!’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్‌.
- వాణిశ్రీ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top