జ్వరం వచ్చిన రోజు

A fever day story - Sakshi

జ్వరం వచ్చిన రోజు గదిలోకి వచ్చి కిటికీలు వేసేశాడు. చలివచ్చినట్టు వణుకుతున్నాడు. జబ్బుపడ్డట్టు కనిపించాడు. మొహం కందిపోయింది. ఒళ్లంతా నొప్పిగా ఉందేమో, నెమ్మదిగా నడిచాడు. పడుకున్నాడు గాని యింకా నిద్ర పోలేదు. ‘‘ఏమైందిరా బుజ్జీ?’’ ‘‘తలనొప్పిగా ఉంది.’’ ‘‘నిద్రపోదువు గాని దా’’‘‘ఫరవాలేదులే. బాగానే ఉంది.’’ తొమ్మిదేళ్ల కుర్రాడు. ఫైర్‌ ప్లేస్‌ ఎదురుగా కూర్చుని మంట కాచుకుంటున్నాడు. ఒంట్లో నలతగా ఉందని తెలుస్తూనే ఉంది. నుదురుతాకి చూశాను. వేడిగా ఉంది. ‘‘జ్వరంగా ఉంది. వెళ్లి పడుకో’’ ‘‘బాగానే ఉంది.’’ డాక్టర్‌ వచ్చి, చెక్‌ చేసి టెంపరేచర్‌ చూశాడు. ‘‘ఎంతుంది?’’ ‘‘నూట రెండు’’ డాక్టరు రెండు రకాల క్యాప్సుల్స్‌ రాసిచ్చి ఎలా వేసుకోవాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గటానికి. రెండవది అసిడిటీ తగ్గించటానికి. కడుపులో అసిడిటీ ఉన్నప్పుడే ఇన్‌ఫ్లుయెంజా క్రిములు పెరుగుతాయట.

ఆయన ఉపన్యాసం వింటే ఫ్లూ గురించి బాగా అధ్యయనం చేసినట్టు అనిపించింది. టెంపరేచర్‌ నూటనాలుగు దాటనంత వరకూ భయపడవలసిందేమీ లేదన్నాడు. ఇది ఫ్లూ సీజనట. ‘‘ఊళ్లో చాలామందికి ఉంది. న్యుమోనియా రాకుండా జాగ్రత్త పడండి’’. ఓ నోట్‌బుక్‌లో టెంపరేచర్, మందిచ్చిన టైమూ రాసి పెట్టుకున్నాను. ‘‘కథలు చదివి చెప్పనా?’’ అనడిగాను. ‘‘ఓకే. నీ ఇష్టం’’ అన్నాడు వాడు. ఆ కాసేపట్లోనే మొహం పాలిపోయింది. కళ్ల కిందిభాగాలు నల్లబడ్డాయి. ప్రపంచంతో తనకు సంబంధం ముగిసినట్టుగా చూరు వైపు చూస్తూ పడుకున్నాడు. దొంగల కథ ప్రారంభించాను. కానీ వాడు వినటం లేదు. ‘‘ఎలాగుంది నాన్నా?’’ ‘‘అలాగే ఉంది, ఫర్వాలేదు..’’ వాడి బెడ్‌ అంచు మీద కూర్చుని కాసేపు చదివాను. మరో క్యాప్సుల్‌కు టైమైంది. పడుకున్న తర్వాత ఇంతసేపు నిద్రపోకుండా ఉండడు వాడు. కానీ ఇప్పుడు రెప్ప వేయకుండా దిగులుగా దిక్కులు చూస్తున్నాడు. ‘‘కళ్లు మూసుకుని పడుకో నాన్నా. మందు వేయాల్సినప్పుడు లేపుతాను లే’’

‘‘నిద్ర పోను’’. మరికాసేపటికి, ‘‘నువ్విక్కడ కూర్చోనక్కర్లేదు నాన్నా. విసుగ్గా ఉంటే వెళ్లు’’ అన్నాడు నా వైపు చూస్తూ. ‘‘నాకు విసుగేమిటమ్మా. నీతోనే ఉంటాను.’’ ‘‘ఊరికే కూర్చుంటే విసుగొస్తుందిలే వెళ్లు’’ పిల్లలతో వాదించడం కష్టం. ఈ పరిస్థితిలో అస్సలు మంచిది కాదు. పదకొండింటికి మందేసి బయటికి వచ్చాను. చల్లగా ఉంది. నేలంతా మంచు కప్పేసింది. చెట్లు, పొదలు నరికి కింద పేర్చిన కలప. ఎటు చూసినా తెల్లటి గుట్టలు. గడ్డి కనిపించడం లేదు. వెంట కుక్కను తీసుకెళ్లాను. ఆ నున్నటి పేవ్‌మెంట్‌ మీద అది కూడా జారింది. రెండుసార్లు నేను తూలాను. భుజానికి తగిలించుకున్న గన్‌ ఒకసారి కిందపడింది. కాలువకు అటుపక్కన చెట్టు మీద కొంగలు కనిపించాయి. రెంటిని గురిచూసి కొట్టగలిగాను. మిగతా పక్షులు కొన్ని ఆకుల్లో కనిపించకుండా దాక్కున్నాయి గాని చాలా మట్టుకు ఎగిరి మరింత దూరాన నేలమీద వాలాయి.గన్‌ గురి పెట్టాలంటే స్థిరంగా నిల్చోగలగాలి. అదే కుదరలేదు.
మళ్లీ కింద పడతానని భయం. ఐదు షాట్లు మిస్‌ అయ్యాయి. ఎక్కడికి పోతాయి? మరో రోజుదాకా వాటిని బతకనిస్తాను. ఇంటికి చేరాను. ‘‘బాబు గదిలోకెవ్వర్నీ రానివ్వటం లేదు.’’ అంటూ కంప్లెయింట్‌ చేశారు పొరుగువాళ్లు. ‘‘లోపలికి వస్తే ఈ జబ్బు మీకూ వస్తుంది. ఎవరూ రావొద్దు.’’ అన్నాడట.వెళ్లి చూశాను. నేను ఎలా పడుకోబెట్టానో అదే పొజిషన్‌లో ఉన్నాడు. కనీసం పక్కకు కూడా తిరగలేదు. జ్వరంతో బుగ్గలు ఎరుపెక్కాయి. టెంపరేచర్‌ మళ్లీ చూశాను. ‘‘ఎంత?’’ ‘‘వంద ఉన్నట్లుంది.’’ నిజానికి నూట రెండు పాయింట్‌ నాలుగుంది. ‘‘నూట రెండు’’ అన్నాడు వాడు. ‘‘ఎవరు చెప్పారు?’’ ‘‘డాక్టరు.’’ ‘‘టెంపరేచర్‌ పరవాలేదులే! వర్రీ కావలసిందేమీ లేదు.’’ ‘‘వర్రీ లేదుగాని ఆలోచనలు ఆగడం లేదు.’’ ‘‘ఎందుకన్ని ఆలోచనలు? టేకిటీజీ!’’ ‘‘ఈజీగానే తీసుకుంటున్నాను’’. ఆ మాటల్లో కొత్తర్థం ధ్వనించింది. ఏదో దాస్తున్నాడు. ‘‘ఈ మందేసుకో’’ ‘‘ఉపయోగం ఉంటుందంటావా?’’ ‘‘భలే వాడివే! తప్పకుండా ఉంటుంది.’’ దొంగల కథ మళ్లీ చదివాను. కానీ వాడు వినందే! పుస్తకం మూసి వాడికేసి చూశాను. ‘‘ఎప్పుడు చచ్చిపోతానంటావు?’’ ‘‘ఏంటీ?’’

‘‘ఎంతసేపట్లో చస్తాను?’’ ‘‘అవేం మాటలురా నాన్నా. నీకేమైందని?’’ ‘‘డాక్టరు చెప్పాడుగా నూటరెండని.’’ ‘‘ఆ మాత్రం టెంపరేచర్‌కెవరూ చావరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.’’ ‘‘నాకు తెలుసు. ఇంత ఎక్కువగా ఉంటే మనుషులు తప్పక చస్తారు. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు క్లాస్‌మేట్స్‌ చెప్పారు. టెంపరేచర్‌ నలభై నాలుగు దాటితే మనుషులు బతకలేరని. నాకేమో నూట రెండుంది.’’ అదన్నమాట. ఉదయం తొమ్మిదింటి నుండీ రోజంతా ఇలా బుర్ర పాడు చేసుకున్నాడు. పిచ్చి నాన్న. ‘‘నా బుజ్జీ! నా బంగారు కొండా!! మైళ్లకు, కిలోమీటర్లకూ తేడా తెలుసా లేదా? అలాగే ఇది. నీకేమీ కాదు. వాళ్లు వాడే థర్మామీటర్‌ వేరు. అక్కడ ముప్ఫై ఏడుంటే నార్మల్‌. మన థర్మామీటర్లో తొంబై ఎనిమిదన్నట్టు.’’ ‘‘నిజంగా? ఆర్‌ యూ ష్యూర్‌?’’ ‘‘అవున్రా నాయనా! మైళ్లకూ, కిలోమీటర్లకు తేడా ఉన్నట్టే ఇదీ. డెబ్బై మైళ్లంటే ఎన్ని కిలోమీటర్లో చెప్పు?’’ ‘‘ఓహ్‌! అలాగా’’ అప్పుడుగాని కాస్త స్థిమిత పడలేదు. మళ్లీ అల్లరిచేస్తూ ఇల్లు పీకి పందిరెయ్యటానికి మరో రెండు రోజులు పట్టింది.

ఎర్నెస్ట్‌ హెమింగ్వే (1899–1961)
అమెరికన్‌ సాహిత్య చరిత్రలో ఒక ధ్రువ తార
అమెరికన్‌ సాహిత్య చరిత్రలో నూతన శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్‌ హెమింగ్వే చికాగో సమీపంలో జన్మించాడు. తండ్రి ప్రముఖ డాక్టరు, క్రీడాకారుడు. 1917లో ‘కాన్సాస్‌ సిటీస్టార్‌’ పత్రికలో రిపోర్టర్‌గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు హెమింగ్వే. మరుసటి సంవత్సరం మొదటి ప్రపంచయుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. క్షతగాత్రుడై, అమెరికా తిరిగివచ్చి టొరంటో స్టార్‌ అనే వార పత్రికకోసం ఫీచర్లు రాశాడు. మరికొన్నాళ్లకు ఫారిన్‌ కరస్పాండెంట్‌గా యూరోప్‌ వచ్చి పారిస్‌లో స్థిరపడ్డాడు. 1922లో గ్రీసు, టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్‌ చేశాడు. మరుసటి సంవత్సరం తొలి పుస్తకం ‘త్రీ స్టోరీస్‌ అండ్‌ టెన్‌ పోయమ్స్‌’ వెలువడింది.

ఆ తరువాతి జీవితమంతా బుల్‌ ఫైటింగ్, ఆఫ్రికా అడవుల్లో వేట, సముద్రం మీద ఫిషింగ్‌లో గడిచింది. స్పానిష్‌ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు. క్యూబాలో చాలా కాలం గడిపాడు. 1961లో ఆత్మహత్య చేసుకున్నాడు. కథా రచన గురించి, ముఖ్యంగా శైలి, వాక్య నిర్మాణం గురించి హెమింగ్వే చాలా కృషి చేశాడు. తొలి కథలు ‘ఇన్‌ అవర్‌ టైమ్‌’ (1925), ‘ఎ ఫేర్‌వెల్‌ టు ఆర్మ్స్‌’ (1929)తో ఒక గొప్ప స్టైలిష్టుగా సాహితీలోకం అతణ్ని గుర్తించింది. ఇరవైయవ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లిష్‌ సాహిత్యశైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేరు. (చైతన్య స్రవంతితో జేమ్స్‌ జాయిస్‌ కూడా ధ్రువ తారగా అవతరించాడు గాని అది వేరు).

1940 నాటి ‘ఫర్‌ హూమ్‌ ది బెల్‌ టోల్స్‌’ (1940) యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ. 1932లో బుల్‌ ఫైటింగ్‌ గురించి ‘డెత్‌ ఇన్‌ ది ఆఫ్టర్‌నూన్‌’, 1935లో వేట గురించి ‘గ్రీన్‌ హిల్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ రాశాడు. సముద్రంలో చేపల వేట గురించిన అద్భుత తాత్విక నవల ‘ది ఓల్డ్‌ మేన్‌ అండ్‌ ది సీ’ (1952) తర్వాత 1954లో హెమింగ్వేను నోబెల్‌ బహుమతి వరించింది. ‘‘పాఠకుడు, ‘మరెంత ఉందో కథ’ అనుకోవడమే రచయిత ప్రతిభకు గీటురాయి’’ అంటాడు హెమింగ్వే తన శైలి గురించి. కథా వస్తువు కోసం, ఉద్వేగ భరితమైన సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు.

- ఆంగ్లమూలం : ఎర్నెస్ట్‌ హెమింగ్వే
- అనువాదం: ముక్తవరం పార్థసారథి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top