మగపిల్లల చేత ప్రతిజ్ఞ

Pledge by males in kenya  - Sakshi

‘అమ్మాయిల్ని గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, అమ్మాయిల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత నైరోబీ ప్రతిజ్ఞ చేయించడం నాలుగేళ్ల క్రితమే మొదలైంది.

కెన్యా.. ఆఫ్రికా ఖండంలో ఓ దేశం. నైరోబీ.. కెన్యా దేశానికి రాజధాని నగరం. ఇప్పుడీ నగరం ప్రపంచదేశాలకు ఓ మార్గాన్ని నిర్దేశిస్తోంది. ఇప్పటి వరకు మహిళల వైపు ప్రపంచం మొత్తం వేలెత్తి చూపిన పరిస్థితులను సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తోంది. నైరోబీలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరు అత్యాచారానికి గురైన వాళ్లేనని ఒక సర్వే నిర్ధారించింది. ఇది జరిగి నాలుగేళ్లవుతోంది. అప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. అక్కడి మహిళల హక్కుల ఉద్యమకారులు ఉవ్వెత్తున లేచారు. తమ దేహం మీద హక్కు తమదేనంటూ నినదించారు.

వాటన్నింటి ఫలితంగా నైరోబీలోని కొన్ని స్కూళ్లలో మగపిల్లల్లో మార్పు తెచ్చే పాఠాలు మొదలయ్యాయి. వాటికి సమాంతరంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ తరగతులు కూడా. రేపటి సమాజం నైతికవిలువలతో జీవించాలంటే అందుకు అనుగుణంగా ఈ తరం పిల్లల మెదళ్లను మలుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రాథమిక స్కూళ్లలో మహిళలను గౌరవించాలనే పాఠాలను బోధిస్తున్నారు. ‘మహిళలను గౌరవిస్తాం, మంచి పనికి మేము ఎప్పుడూ ముందుంటాం, మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా నడుచుకుంటాం’ అని మగపిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

అమ్మాయిలకూ.. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడటం ఎలాగో నేర్పిస్తున్నారు. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణనిస్తున్నారు. ‘నన్ను తాక వద్దు, నన్ను నేను కాపాడుకోగలను’ అని వారి చేత ఒకటికి పదిసార్లు వల్లె వేయిస్తున్నారు. ఇదంతా అమ్మాయిలను, అబ్బాయిలను వేరు చేసి నేర్పించడం లేదు. ఒకరి ప్రతిజ్ఞలను, నినాదాలను మరొకరు వినేలా ఒకే తరగతి గదిలో చేయిస్తున్నారు. ఈ నాలుగేళ్ల తర్వాత ఫలితం ఏంటంటే.. నైరోబీలో అత్యాచారాలు సగానికి సగం తగ్గడం!

ఇంట్లోనూ వల్లెవేస్తున్నారు!
నైతిక విలువలను నేర్పించే తరగతులు మంచి ఫలితాలనిస్తున్నాయని అక్కడి సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ క్లాసుల వల్ల నేరుగా చైతన్యవంతమయ్యేది పిల్లలే, అయినా పెద్దవారిలో కూడా ఆలోచన రేకెత్తించగలిగారు. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వెళ్లి ఊరుకోరు కదా! అమ్మాయిలైతే ‘హూ... హా’ అని కరాటే ఫీట్‌లు చేస్తూ మనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలా పంచ్‌ ఇవ్వాలని... స్కూల్లో నేర్చుకున్న కొత్త విద్యను అమ్మానాన్నల ముందు ప్రదర్శిస్తారు.

‘మహిళ వస్త్రధారణను కామెంట్‌ చేయకూడదు. ఒంటరిగా వెళ్తుంటే ఆమెకు దారి ఇచ్చి మనం పక్కకు తప్పుకోవాలి తప్ప ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఆమె చాయిస్‌ని గౌరవించాలి’ అనే చిలుక పలుకులను మగపిల్లలు వల్లిస్తున్నారు. దాంతో సమాజంలో మార్పు మొదలైందని, ఇది ఇక విస్తరించాల్సి ఉందని నైరోబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మన దేశంలో
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో రిపోర్టు ప్రకారం 2012లో 24,923, 2013లో (‘నిర్భయ’ చట్టం వచ్చిన ఏడాది) 33,707, 2014లో 36,735, 2015లో 34,210, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సరాసరిన వందకు పైగానే!  చట్టాలెన్ని ఉన్నా, మహిళల మీద అఘాయిత్యాలు ఆగాలంటే మగవాళ్ల మనస్తత్వం మారాలి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top