వింగ్స్ ఆఫ్ సాంగ్! | Wings of Song! | Sakshi
Sakshi News home page

వింగ్స్ ఆఫ్ సాంగ్!

Dec 9 2013 12:58 AM | Updated on Sep 2 2017 1:24 AM

వింగ్స్ ఆఫ్ సాంగ్!

వింగ్స్ ఆఫ్ సాంగ్!

హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజంశాఖ ప్రధానకార్యాలయంలో శివాజీ, రాజు ‘వింగ్‌‌స ఆఫ్ సాంగ్’ చిత్రప్రదర్శన ఇటీవల జరిగింది.

హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజంశాఖ ప్రధానకార్యాలయంలో శివాజీ, రాజు ‘వింగ్‌‌స ఆఫ్ సాంగ్’ చిత్రప్రదర్శన ఇటీవల జరిగింది. నగరంలోని ప్రముఖ కళాకారులు, కళాభిమానుల సందర్శనతో  విజయవంతమైంది.  ఈ సందర్భంగా శివాజీ-రాజుల గురించి...
 
తన రాతతో... ఆర్టిస్ట్ మోహన్ ‘గీత’తో ‘దిబ్బరాజ్యం’ అనే కామిక్ స్ట్రిప్‌ను తెలుగు పాఠకులకు అందించారు శివాజీ. కారణాంతరాల వలన అటువంటి ప్రయత్నాలు ఆగిపోయిన నేపథ్యంలో మరింత పట్టుదలతో తామే ‘చిగురు’ అనే బాలల పత్రికను తెచ్చారు. ముచ్చటగా మూడేళ్లు! ‘చిగురు’కు లోగో రాసి బాపు ఆశీర్వదించారు. ‘మా ఫ్రెండు శివాజీగారు బొమ్మల గురించి నాలుగు ముక్కలు రాయమన్నారు. ఎలా వేయాలో చెప్పగలిగిన స్థోమత లేదుగానీ ఎలా వేసేవాణ్ణో చెప్తాను’ అంటూ ఆరు పేజీలు ‘అక్షర చిత్రాలు’ కానుకగా ఇచ్చారు.

శ్రీశ్రీ మెచ్చిన ‘బాల నేరస్తుడు’

మూడు దశాబ్దాలకు పైగా రాజు ఈపూరి పత్రికల్లో ఇలస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన వేసిన ‘బాల నేరస్తుడు’  కార్టూన్‌ను మెచ్చి మహాకవి శ్రీశ్రీ ఉత్తరం రాశారు! దాదాపు పదేళ్ల నుంచి రాజు పెయింటింగ్స్ వేస్తున్నారు. వేర్వేరు సమయాల్లో, వెలుతురులలో చుట్టూ పరికిస్తే ఆసక్తి కలిగించిన దృశ్యాలతో పెయింటింగ్ ప్రారంభించారు. కొనసాగింపుగా, తనను విభ్రమ పరచిన రూపసౌందర్యాల ఫలితంగా కలిగిన ఉద్వేగపు వేగాన్ని బ్రష్ కదలికలకు పరివర్తన చేసి కేన్వాస్‌పై ఆవిష్కరించారు.

రాజు వేసిన ఒక చిత్రంలోని వర్ణవైభవాన్ని చూసి నైరూప్య చిత్రకారుడు యస్వీ రామారావు చకితులయ్యారు. ‘‘ఈ పెయింటింగ్‌ను అమ్మకండి, తన లోతును కనుక్కొనే వారొస్తా’రన్నారు. ఒక వర్క్‌షాప్‌లో విఖ్యాత చిత్రకారుడు జతిన్‌దాస్ విద్యుత్ వేగంతో పెయింటింగ్ చేయడం చూసిన ప్రభావం నాకు కొంత సోకి ఉంటుంది’’ అని రాజు చమత్కరిస్తారు!
 
తప్పిపోయి ప్రవాహాన్ని చేరాడు!

మహాకవి గురజాడ అప్పారావు మిత్రుడు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం నాయుడు. ఆయన మనుమడు ఒంగోలు సుబ్బారావు, శివాజీ ఒంగోలులో ఎలిమెంటరీ స్కూల్ క్లాస్‌మేట్స్. అప్పట్లో శివాజీ బొమ్మలేస్తుండేవాడు. శివాజీ వేసిన మునిసుబ్రహ్మణ్యనాయడు పెయింటింగ్ ఊర్లో మెప్పుదలను పొందింది. వెనక్కి తిరిగి ఆలోచించుకునే వ్యవధి లేకుండా దాదాపు ముప్ఫయ్యేళ్లు గడిచిపోయిన తరువాత శివాజీకి తనలో ఇంకిపోయిన కళాస్రవంతి సవ్వడి చేయడం ప్రారంభించింది. నదిలోంచి విడివడి నదిలో కలిస్తే కదా ఉపనది!

కళాప్రవాహంలోకి పునరాగమనం చేస్తూ శివాజీ  కుంచె తీశాడు. పదేళ్ల నిర్విరామ కృషి ఫలితంగా ‘ఇవి శివాజీ బొమ్మలు’ అనే ఇంప్రెషన్ వేశారు. ‘మనిషి ఒక్కడే లోకంలో ఉండలేదు. ఉండలేడు కూడా’ అని సూచిస్తూ పశుపక్ష్యాదులతో మనిషిని చూపారు. మనిషి-ప్రకృతి వేర్వేరు కాదు ఒకటే అని స్ఫురింపచేస్తూ మనిషిలో భాగమైన ఇతర జీవజాలాన్ని తాజాగా చిత్రిస్తున్నారు. ఈ మధ్య ఓ రోజు  ‘‘మిసిమి పత్రికలో మీ బొమ్మలు చూసి మిమ్మల్ని ఒకరు అభినందించబోతున్నారు’ అంటూ సంపాదకులు ఆంజనేయరెడ్డి శివాజీకి ఫోన్ ఇచ్చారు. ఎవరది? బాపు!
 
నేల విడవని సాము

‘కథక్, భరతనాట్యం, కూచిపూడి తదితర మన క్లాసికల్ డాన్సెస్‌కు బయటప్రపంచంలో చక్కని గుర్తింపు ఉంది. కారణం, సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఆధునికతను మేళవించి కళాకారులు వైవిధ్యం చూపుతున్నారు. మన నాటకాలు, మన చిత్రకళ ‘నేల’ను విడచి సాము చేస్తున్నాయి (స్మజనాత్మకమైన కొందరిని మినహాయిస్తే). ఇకముందు, మన ఇతిహాసాల్లో ఆసక్తికరమైన సన్ని వేశాలకు చిత్రరూపం ఇవ్వాలని భావిస్తున్నాను’ అన్నారు శివాజీ. ‘కొన్ని రూపాలు ఆశ్చర్య పరుస్తాయి. కొన్ని లావణ్యాలు ఉద్వేగపరుస్తాయి. వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేస్తాను. వీక్షకులలో వ్యక్తమయ్యే ఫీలింగ్స్ నాతో ఏమేరకు సింక్రనైజ్ అయ్యాయో గమనిస్తుంటాను’ అన్నారు రాజు!
 
 - పున్నా కృష్ణమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement