ఊరంతా పందిరి

ఊరంతా పందిరి


లోక కల్యాణం



జంట ఒక్కటైతే... అది కళ్యాణం. అనేక జంటలు ఒక్కటైతే... అది లోకకళ్యాణం. ఒకరు తింటే... భోజనం. అనేక మంది తింటే... అది విందుభోజనం. విందులు మితిమీరితే... వృథా. వృథాలను అరికడితే... కనువిందు. అలాంటి కను‘విందు’లు కనిపించే కమనీయ కళ్యాణ దృశ్యాలను చూతము రారండి.



పెళ్లి చేసినా.. ఇల్లు కట్టినా.. ఈ రోజుల్లో జీవితకాలపు ఆర్థిక భారం! కారణం.. ధరలు, ఆర్భాటాలు రెండూ ఆకాశాన్ని అంటడమే! వ్యవసాయం తప్ప వేరే ఉపాధి లేని ఊళ్లల్లో పెళ్లిళ్లు అంటే ఈసురోమనే స్థితే! దీన్ని అధిగమించడానికి ఓ ఉపాయం కనిపెట్టింది తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా, ఇచ్చోడ మండలం.. నర్సాపూర్‌. అదే సామూహిక వివాహాలు. నిన్న మొన్న కాదు.. 33 ఏళ్ల కిందటే!

వివరాలు..



నర్సపూర్‌ ఓ మారుమూల పల్లెటూరు. ఊరంతటికీ వ్యవసాయమే ఆధారం. ముప్ఫైమూడు ఏళ్ల కిందట... వానల్లేక.. పంటలు పండక.. రైతులంతా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారు. కరువులో అధికమాసం లాగా.. పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లు! తిండికే లేదంటే పెళ్లేం చేస్తారు? ఈ సమస్యనెలాగైనా పరిష్కరించాలని ఊరిపెద్దలు రాంచందర్‌ తిడ్కె, శామ్‌రావు కెంద్రే, బాబూరావు ముండే, రామ్‌రావు ముస్లే, ద్రువ ముండే ఏకమయ్యారు. ఆలోచించి సామూహిక వివాహాలే ఏకైక మార్గమని తేల్చారు.



22 జంటలతో మొదలు...

పెద్దల చూపిన మార్గం గ్రామస్తులందరికీ నచ్చింది. వివాహాల కోసం ఒక్కో జంటకు రెండువేల రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే కొందరు ఆ రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని స్థోమతలో ఉన్నారు. వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయలేదు. అలా 1984, మేలో మొత్తం 22 జంటలకు వివాహాలు జరిపించారు. అప్పటినుంచి కాలం కలిసొచ్చి పంటలు మెండుగా పండినా.. కరువు వచ్చినా.. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా సామూహిక వివాహాలకు నర్సాపూర్‌ వేదిక అయింది. ఆనవాయితీగా మార్చింది. యేటా పదిహేను జంటలకు తగ్గకుండా పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఏప్రిల్, మేనెలల్లోనే ముహూర్తాలు పెట్టుకుంటారు. 1996లో 32 జంటలకు పెళ్లి జరిపించారు. ఈ ఏడాది 16 జంటలను ఒకింటి వారిని చేశారు. ఇప్పటి వరకు ఈ సామూహిక వివాహాల ద్వారా దాదాపు ఏడువందల జంటలు ఒక్కటయ్యాయి.  



ధనిక, పేద తేడాలేదు

సామూహిక వివాహల్లో పేద, ధనిక అనే తేడా ఉండదు. పెళ్లికి పేదవారు తమకు తోచినంత ఇవ్వచ్చు. సామూహిక వివాహాల ముహూర్తపు తేదీని గ్రామపెద్దలు  రెండు నెలల ముందే ప్రకటిస్తారు. ఆ తేదీకల్లా గ్రామస్తులు తమ కూతుళ్ల, కొడుకుల పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటారు. పెళ్లి కార్యక్రమాలు, భోజనాలు అన్నీ ఒకే వేదిక దగ్గర  జరుగుతాయి. ఈ పెళ్లిళ్లకు బంధువులను గ్రామస్తులే ఆహ్వానిస్తారు. పెళ్లిపత్రికల మీద కూడా ఆహ్వానితులనే స్థానంలో గ్రామస్తులు అనే ఉంటుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారి బస, భోజన ఏర్పాట్లన్నీ గ్రామస్తులే చూసుకుంటారు. పెళ్లిళ్లకు మూడు రోజుల ముందు నుంచే బంధువులతో ఊరు కళకళలాడుతుంటుంది.



నేతల హల్‌చల్‌..

సామూహిక వివాహాలకు నేతల రాక 1984 నుంచీ ఉంది. మొదటిసారిగా అప్పటి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డిని గ్రామస్తులు ఆహ్వానించారు. అప్పటినుంచి ప్రతి ఏటా జరిగే ఈ వివాహాలకు అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడి మరీ ఈ పెళ్లిళ్లకు హాజరవుతున్నారు.



పోలీసులకూ స్ఫూర్తి..

నర్సపూర్‌లో జరుగుతున్న సాముహిక వివాçహాలను పోలీసులు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు.  ‘మీకోసం’  కార్యక్రమంలో భాగంగా 2002లో ఇచ్చోడ పోలీసులు గిరిజన సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి 106 గిరిజన జంటలకు వివాహం  చేశారు.  తాళిబొట్టు తో పాటు బట్టల జతలూ అందించారు.



జిల్లాలోని చాలా చోట్ల...

ఈ సంప్రదాయం ఒక్క నర్సాపూర్‌కే పరిమితవలేదు.  జిల్లాలోని చాలాచోట్ల కొనసాగుతోంది. మరాఠీ సంప్రదాయ గ్రామాలైన నవేగావ్, దర్మంపూరితో పాటు ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, థాంసీ, భీమ్‌పూర్, పార్డీతోపాటు పలు గ్రామాల్లో జరుగుతున్నాయి.



ప్రతి ఏటా నిర్వహిస్తాం

ఆ రోజుల్లో  వరస కరువును దృష్టిలో పెట్టుకొని పెండ్లి ఖర్చు తగ్గించడానికి  సామూహిక వివాహాలను ఏర్పాటు చేశాం. ఈ జంటల్లో చాలా మంది మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు.  

– రాంచంద్ర తిడ్కె, గ్రామ పెద్ద



అదే సంప్రదాయమైంది..

పేద, ధనిక  తేడా లేకుండా ప్రతి ఒక్కరు సామూహిక  వివాహాల్లో  తమ పిల్లల పెండ్లి చేయడం అనవాయితీగా వస్తోంది.  ఊరంతా కలిసి పెండ్లి పనులు చూస్తాం. మా స్ఫూర్తిని అనేక గ్రామాలు పంచుకోవడం చాలా  సంతోషంగా ఉంది.

–  ద్రువ ముండే



పాలుపంచుకుంటాం

1991లో నా పెళ్లి సామూహిక వివాహ మహోత్సవంలోనే జరిగింది. సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరం యేటా జరిగే ఈ పెళ్లిళ్లలో పాల్గొంటాం. పెళ్లి పనుల్లో పాలుపంచుకుంటాం. మా పెళ్లి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం.

– విజయ్‌ ముస్లే (సాముహిక వివాహలో పెండ్లిచేసుకున్న వ్యక్తి )

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top