
హెర్మన్ హెస్ రాసిన ఒక జర్మన్ కథ సారాంశం ఇలా ఉంటుంది. ఒకాయన ఉంటాడు. పేరు ఫ్రెడరిక్. మేధోజీవి. ప్రతిదీ తార్కికంగా ఆలోచిస్తాడు. రెండు రెళ్లు నాలుగు అన్నంత కచ్చితంగా ఉంటాడు. ప్రతిదీ కనబడాలి. దానికి అవతల వున్నదేదీ విశ్వసించడు. ఫ్రెడరిక్ స్నేహితుడి పేరు ఇర్విన్. నిదానం మనిషి. మనిషి స్వభావాన్ని అర్థం చేసుకున్నవాడు. ఒకరోజు ఇర్విన్, బయట వున్నదే లోపల వున్నది, అని చెబుతాడు. అదెలా సాధ్యం? ఫ్రెడరిక్‌కు కోపమొస్తుంది. నిరూపించమని సవాల్ చేస్తాడు. ప్రతిగా ఇర్విన్ ఒక మట్టి బొమ్మ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లమంటాడు.
మట్టిబొమ్మ ఏం చెప్పగలుగుతుంది? తినేముందూ, పడుకునేముందూ, బయటికి వెళ్లేప్పుడూ, వెళ్లివచ్చాకా ఫ్రెడరిక్ ఆ బొమ్మను చూస్తూనే వుంటాడు. అదేమిటో అర్థం కాదు. అది జంతువా? మనిషా? దయ్యమా? ఇంకేదైనా జీవా? బయట వున్న బొమ్మ నా లోపలికి ఎలా వస్తుంది? అంతా ఉత్తిదే, అనుకుంటాడు. కొన్నాళ్లకు ఆయన ఓ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చేసరికి బొమ్మ స్థానం ఖాళీగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్లిపోయిందా ఏమిటి? ఏమైందని అడుగుతాడు. గది శుభ్రం చేసేటప్పుడు జారి పగిలిపోయిందని చెబుతుంది పనిమనిషి. తేలిగ్గా తీసుకుంటాడు.
తెల్లారుతుంది. ఎందుకో బొమ్మ గుర్తొస్తుంది. మరిచిపోతాడు. మళ్లీ గుర్తొస్తుంది. బొమ్మతో తన ఆలోచనలు ముడిపడ్డాయి. దాని ఉనికితో తెలియకుండానే ఒక బంధం పెంచుకున్నాడు. దాంతో అది లేకపోవడం బాధిస్తుంది. మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు. వదిలించుకునేకొద్దీ తనలో వచ్చి కూర్చుంటూనే వుంటుంది. అప్పటిగ్గానీ ఇర్విన్ చెప్పిన సత్యమేమిటో బోధపడదు. బయట వున్నదే లోపల వున్నది.
ఫ్రెడరిక్‌లాగా ఈ సత్యాన్ని భౌతికంగా అర్థం చేయించడానికి మనకొక ఇర్విన్ దొరక్కపోవచ్చు. కానీ ఇర్విన్ చెప్పిందీ, ఇర్విన్ పాత్ర ద్వారా హెర్మన్ హెస్ చెప్పిందీ, హెస్ ఈ అవగాహనకు రావడానికి కారణమైన భారతీయ సారస్వతం చెప్పందీ ఒకటే: బహిర్గతంగా వున్నదే అంతరంగంలోనూ వున్నది. అంతరంగాన్ని జయించడమంటే ప్రపంచాన్ని జయించడమే!
– పూడూరి రాజిరెడ్డి