సహృదయ విమర్శకుడు

Story About Poet Rama Tirtha - Sakshi

నివాళి 

వక్తగా, అనువాదకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, మీదుమిక్కిలి విమర్శకుడిగా గుర్తింపు పొందినవాడు రామతీర్థ. అసలు పేరు యాబలూరు సుందర రాంబాబు. 1960లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల నెల్లూరు, ఒడిశాలలో విద్యాభ్యాసం సాగింది. బి.ఎ. తర్వాత 1981లో పారదీప్‌ పోర్టులో కార్మికుల రక్షణ విభాగంలో ఉద్యోగంలో చేరారు. 1985లో బదిలీపై విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఐదేళ్ళ క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి కాలం సాహితీసేవలో నిమగ్నమయ్యారు.

విశాఖపట్నంలో నిత్యం సాహిత్య వాతావరణం ఉండేలా కృషిచేశారు రామతీర్థ. ప్రగతిశీల సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఉత్తరాంధ్రకు చెందిన గోగులపాటి కూర్మనాథకవి, అడిదం సూరకవి, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, చాసో వంటి వారి గురించి కొత్త ప్రతిపాదనలు చేశారు. శ్రీశ్రీ చెప్పిన కవితాత్మక వ్యాఖ్య ‘ఎవరు బతికేరు మూడు ఏభైలు’ అనేది అంతకుముందెప్పుడో అడిదం సూరకవి తన కందపద్యంలో ‘‘మూడేబదులెవరుండరు మూఢులది గానలేరు ముల్లోకములన్ర వాడుక పడవలె మనుజుడు వేడుకతో బత్తులయ్య వినగదవయ్య’’ చెప్పినట్లుగా రామతీర్థ ఒక వ్యాసంలో రాశారు. అలాగే మృచ్ఛకటికంలో ఉన్న సంభాషణలు, సంఘటనలకు కన్యాశుల్కంతో ఉన్న సామ్యాన్ని వివరించారు.

రామతీర్థ ప్రాచీనాంధ్రాంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టడమే గాక ధారణ, జ్ఞాపకశక్తి పుష్కలంగా ఉన్నవారు. ఒకప్పుడు రచనను కఠినమైన తూకపు రాళ్లతో తూచేవారు. అయితే సృజనాత్మక రంగంలో రచయితలు అల్ప సంఖ్యాకులు. కటువుగా ఉంటే సాహిత్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దాంతో బాణీ మార్చారు. సాత్వికంగా నచ్చచెప్పే రీతిలో స్పందించడం, సహృదయతతో అర్థం చేసుకుని మెలగడం, నమ్మిన విశ్వాసాల్లోంచి కాకుండా భావావిష్కరణలోంచి గుణ నిర్ణయం చేయడం ద్వారా తన విమర్శనా విధానాన్ని మార్చుకున్నారు. ఆయన తన గమ్యం ఇంకా చేరవలసే ఉంది. ఇంతలోనే అకాల మృత్యువు తన వెంట తీసుకెళ్ళి పోయింది. ఆయనకు నా నివాళి.
-దాట్ల దేవదానం రాజు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top