నిర్భయ తల్లి ఆత్మఘోష

special story to nirbhaya mother - Sakshi

కొంతమంది బండగాళ్లు!వాళ్ల నోట్లో ఉండేది నాలుక కాదు... శతాబ్దాల మగ అహంకారానికి కొలబద్ద.అత్యాచారంతో చంపారు.ఇప్పుడు...జ్ఞాపకాలపై అత్యాచారం చేస్తున్నారు.‘నిర్భయ’ తల్లికి అందుకే కోపం వచ్చింది.మనమైతే అక్కడికక్కడే తిట్టేసేవాళ్లమేమో!అప్పుడు..తనకీ, వాడికీ తేడా ఏముంటుంది?అందుకనే తన ఆత్మఘోషను బహిరంగ లేఖగా రాసింది. 

‘‘రేయ్‌! గాడిదా!! తాటిచెట్టులా పెరగడం కాదురా, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వెధవా.’’  ఇలా.. ఒక మనిషిని నోరారా తిట్టే హక్కు ఎవరికుంటుంది? అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకే కదా?! మరి, కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా కు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇప్పటికీ ఉంటే ఇలా తిట్టకుండా వదిలి పెడతారా? మహిళాదినోత్సవం రోజు బెంగళూరులో ఓ మహిళా కార్యక్రమం జరిగింది. సంగ్లియానా కూడా ఆ కార్యక్రమ వేదిక మీద ఉన్నారు. తమ ప్రొఫెషన్‌లో విశేషంగా కృషి చేస్తున్న మహిళలు, పోరాట పటిమతో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న మహిళలు, సాటి మహిళలకు మార్గదర్శనంగా ఉన్న వాళ్లను అభినందిస్తూ, వారిని పురస్కరించడం ఆ కార్యక్రమం ఉద్దేశం. నిర్భయ తల్లి ఆశాదేవిని కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఆవిడ వచ్చారు. ఆసీనులయ్యారు.

పెద్దాయన కదా అని పిలిస్తే..!
మహిళా దినోత్సవం కాబట్టి, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి, దాడికి పాల్పడిన వారి మీద తక్షణమే చర్య తీసుకోవడం గురించి, నాలుగు పనికొచ్చే మాటలు చెప్తాడని సంగ్లియానాను పిలుచుకొస్తే, ఆయన మొత్తం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పరువునే పోగొట్టారు! ‘‘నిర్భయ తల్లి ఫిజిక్‌ ఈ వయసులోనూ చాలా ఫిట్‌గా బాగుంది. ఆమెను చూస్తే నిర్భయ ఎంత అందంగా ఉండి ఉంటుందో నేను ఊహించగలను’’ అని.. వేదిక మీద మైక్‌ పుచ్చుకుని మరీ సంగ్లియానా అన్నారు! సమావేశంలో ఉన్న వాళ్లకు ఒక్కసారిగా షాక్‌! తాము విన్నది నిజమేనా అన్నట్లు తలతిప్పి పక్క వాళ్లను చూశారు. నిజమే అన్నట్లు ఒకర్నొకరు ముఖముఖాలు చూసుకున్నారు. ఆ తర్వాత సంగ్లియానా మహిళలకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ అవేవీ ఎవరికీ బుర్రల్లోకి ఎక్కనేలేదు.

పోరాటం గుర్తుకు రాలేదా?!
‘ఇంత పెద్దాయన నోటి నుంచి వినాల్సిన మాటలేనా అవి’ అందరిలోనూ అదే ప్రశ్న. అయితే సంగ్లియానా వ్యాఖ్యల మీద ఆశాదేవి చాలా హుందాగా మాట్లాడారు. ‘‘సమాజంలో మనుషుల మైండ్‌సెట్‌ ఏ మాత్రం మారలేదని నిరూపిస్తున్నాయి ఆయన మాటలు’’ అని, సమావేశం తర్వాతి ప్రెస్‌మీట్‌లో క్లుప్తంగా స్పందించారు. తనకు బాగా దగ్గరి వాళ్లతో మాత్రం ‘‘నా ఫిజిక్‌ కంటే నేను చేసిన న్యాయ పోరాటాన్ని గుర్తు చేసుకుని ఉంటే బాగుండేద’ని ఆమె ఆవేదన చెందారు. ఆ తర్వాత ఎప్పటికో, తన వివాదాస్పద వ్యాఖ్యలకు (మహిళలు ఆవేశంతో రగిలిపో వడంతో) క్షమాపణలు చెప్పాడు సంగ్లియానా.  

సంగ్లియానా ఒక ఎగ్జాంపుల్‌
ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మార్చి 8 మహిళా దినోత్సవం వరకు సాక్షి ఫ్యామిలీ ‘నేను శక్తి’ క్యాంపెయిన్‌ను నిర్వహించింది. ఆ క్యాంపెయిన్‌లో మహిళలకు సమాజంలో ఎదురవుతున్న వివక్ష, గృహహింస, లైంగిక వేధింపుల నిజజీవిత కథనాలను, సమస్యలను సమర్థంగా ఎదుర్కొని సాధికారత సాధించిన మహిళల అనుభవాలను ప్రచురించింది. ఆ క్రమంలో కొంతమంది నుంచి.. ‘‘ఇంకా మహిళలకు కష్టాలు, వేధింపులు ఉన్నాయా?! అవనీ వారిదే, అంతరిక్షమూ వారిదే అన్నట్లుగా ఎదుగుతున్న రోజుల్లో కూడా కడగండ్లతో బతుకీడుస్తున్న ఆడవాళ్లు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం’’ అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అన్నవాళ్లలో ఆడవాళ్లు, మగవాళ్లు కూడా ఉన్నారు. క్యాంపెయిన్‌ ఉద్దేశం విస్తృతమైనది. అభ్యుదయ పథంలో దూసుకుపోతున్న నూటికొక్కరు ఇద్దరి కథనాలను మాత్రమే కాదు, రోజూ మనం వింటున్న లైంగికదాడుల వార్తలు, వరకట్న వేధింపులు, పరువు హత్యలను కూడా గుర్తు చేసుకోవడం. ఇప్పుడు సంగ్లియానా మాటలు విన్న తర్వాత ఇలాంటి క్యాంపెయిన్‌ల అవసరం ఇంకా చాలా ఉందనే అనిపిస్తోంది.

మీకూ వాళ్లకు తేడా లేదు
మీరు నా శరీరాకృతిని ప్రశంసిస్తూ కామెంట్‌ చేశారు. ఆ కామెంట్‌ చేసే ముందు... అది ఏ మాత్రం సముచితమో ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. దాంతోపాటు మా అమ్మాయి అందచందాల గురించి కూడా మాట్లాడారు. అత్యంత క్రూరంగా గాయపడి, చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి దేహాకృతిని ఊహించారు. లైంగిక దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి సౌందర్యం గురించి మాట్లాడారు! తన మీద దాడికి పాల్పడిన వారిని నిరోధిస్తూ మా అమ్మాయి ఎంతగా ప్రతిఘటించిందనే సంగతిని మీరు గుర్తించలేకపోయారు, ఆ ప్రతిఘటనను గౌరవించలేకపోయారు. మా అమ్మాయిలా మరే ఆడబిడ్డకూ జరగకూడదని నేనెంతగా పోరాటం చేశానో మీరు గుర్తించలేకపోయారు. మీ వ్యాఖ్యల ద్వారా మీరు మీలో నిండి ఉన్న అనారోగ్యకరమైన ధోరణిని బయటపెట్టుకున్నారు.  మీ ఆలోచనలు కూడా మా అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన మగవాళ్ల ఆలోచనల్లాగానే ఉన్నాయి. ఒక ఆడపిల్ల తమ దాడికి లొంగిపోకుండా ప్రతిఘటించడాన్ని పురుషాధిక్య అహంకారం సహించలేకపోయింది.అందువల్లనే ఆమెను అంత క్రూరంగా హింసించినట్లు వాళ్లే చెప్పారు. మీ మాటలు కూడా అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్లను ప్రోత్సహించేవిగానే ఉన్నాయి. మీరు చేసిన హేయమైన వ్యాఖ్యలతో మీరు యువతులకు ఏం చెప్పారు? లైంగిక దాడి జరిగినప్పుడు ప్రతిఘటించి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా, లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి... అని! మీ ఈ అభిప్రాయం ప్రకారం... మీరు మన దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న సైనికులకు ఏం చెబుతారు? శత్రువు దాడి చేసినప్పుడు ఆయుధాలను విసిరేసి లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోమనా? మీరు మాట్లాడింది ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా గ్రహించారా? ఆడపిల్లలకు మీరు బలహీనమైనవాళ్లు, పరిస్థితులను బట్టి రాజీ పడుతూ మిమ్మల్ని మీరు ఫణంగా పెట్టుకుంటూ జీవించాలి... అని సందేశం ఇవ్వదలుచుకున్నారా మీరు?
(సంగ్లియానాకు ‘నిర్భయ’ తల్లి రాసిన  బహిరంగ లేఖలోని సారాంశం)
– మంజీర

సంగ్లియానా, ఐపీఎస్‌ రూప, ఆశాదేవి.  (ఈ సభలోనే సంగ్లియానా నిర్భయ తల్లి ఫిజిక్‌ని పొగిడారు!) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top