ఆటకు సై

Special Story International Day Of Sport For Development And Peace - Sakshi

నేడు ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ స్పోర్ట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌’

ఒలింపిక్స్‌కు దగ్గూ జ్వరం. ఐపీఎల్‌కు ఒళ్లునొప్పులు. అండర్‌–17 మహిళల కప్‌కు గొంతునొప్పి. కోట్ల మంది క్రీడాభిమానులకు ఐసొలేషన్‌. ‘మీ ఆటలు సాగవు..’ అంటోంది కరోనా. ‘నీ ఆటల్నే కట్టిపెట్టు’ అంటున్నారు క్రీడాకారిణులు. ఓడించేందుకు అటువైపు ఎత్తుగడలు. గెలిచి తీరేందుకు ఇటువైపు సర్వశక్తులు. వైరస్‌పై యుద్ధానికి బరి ఉండకపోవచ్చు. స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఇచ్చే విరాళాల పోరాట స్ఫూర్తికి తిరుగుంటుందా!

ఈషాసింగ్‌ ముప్పై వేలు
గన్‌లో బులెట్‌ మాత్రమే ఉంటుంది. ఆ బులెట్‌ వెళ్లి టార్గెట్‌కు తగిలేలా గురి చూసి ట్రిగ్గర్‌ నొక్కడం మాత్రం షూటర్‌ చేతిలో ఉంటుంది. ఈషా సింగ్‌ షూటర్‌. వయసు పదిహేను. పి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి 30 వేల విరాళం ఇచ్చింది. ‘నా సేవింగ్స్‌ నుంచి ఇస్తున్నాను’ అని ట్వీట్‌ చేసింది. కరోనా సంహారానికి విరాళం ఇవ్వడం ద్వారా తన గన్‌ ట్రిగ్గర్‌ నొక్కిన అతి చిన్న వయసు క్రీడాకారిణి ఈషా.. హైదరాబాద్‌లోని బోల్టన్‌ స్కూల్‌ విద్యార్థిని. వయసెంత అని కాదు, దాచుకున్న మొత్తం ఇచ్చేయడం భారీ విరాళం కాదంటారా?!

హిమాదాస్‌.. నెల జీతం
హిమాదాస్‌ (20) స్ప్రింటర్‌. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన 49 మంది ‘టాప్‌ స్పోర్ట్స్‌పర్సన్స్‌’లో హిమ ఒకరు. కరోనాను పరుగెత్తించేందుకు ఆమె కూడా తను ఇవ్వగలినంత ఇచ్చారు. తన ఒక నెల జీతాన్ని అస్సాం ప్రభుత్వానికి ఇచ్చారు. గౌహతిలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌లో హెచ్‌.ఆర్‌.ఆఫీసర్‌గా ఉన్నారు హిమ.

సింధు ఐదు ప్లస్‌ ఐదు
తెలుగు రాష్ట్రాల క్రీడాజ్యోతి పి.వి.సింధు (20) ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్‌ ఫండ్‌కు పది లక్షల రూపాయలు ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ బాడ్మింటన్‌ చాంపియన్‌.. కరోనాపై పోరులోనూ చాంపియనేనని తన విరాళం ద్వారా నిరూపించుకున్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటంతో ఆమె అభిమానులు నిరుత్సాహపడినప్పటికీ ఆమె మాత్రం... ‘‘ముందు జీవితం. తర్వాతే ఈవెంట్స్‌’’ అన్నారు.

మిథాలీ పది లక్షలు

రైట్‌ హ్యాండ్‌ బాట్స్‌ఉమన్, వన్డే ఇంటర్నేషనల్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (37) కరోనాకు ముక్కు పగిలే షాటే ఇచ్చారు. ప్రధాని ఫండ్‌కి 5 లక్షలు, తెలంగాణ సీఎం ఫండ్‌కి 5 లక్షలు. ‘కొద్దిగా మాత్రమే ఇవ్వగలుగుతున్నాను’ అని ట్వీట్‌ కూడా చేశారు మిథాలి. పదిలో, ఐదులో లేదు విలువ. ‘ఇవ్వడం’లో ఉంది. భారత మహిళా క్రికెట్‌ జట్టులోని ఈ సీనియర్‌ హ్యాండ్‌.. ఆటలో తనకెదురైన సమస్యల్ని గుండె నిబ్బరంతో డీల్‌ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా కావలసింది అలాంటి నిబ్బరమే.

దీప్తి శర్మ లక్షన్నర

బ్యాటింగ్‌లో లెఫ్ట్‌ హ్యాండ్, బౌలింగ్‌లో రైట్‌–ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ ప్రావీణ్యాలు గల టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఆల్‌ రౌండర్‌ దీప్తి శర్మ (22) కరోనాకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ వాయించడానికి తన వైపు నుంచి వెస్ట్‌బెంగాల్‌ స్టేట్‌ ఎమర్జెన్సీ ఫండ్‌కి 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కాకుండా, పి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి, యు.పి. రిలీఫ్‌ ఫండ్‌కి కలిపి లక్ష రూపాయలు ఇచ్చారు. దీప్తి ఆగ్రాలో పుట్టారు. తండ్రి రైల్వేస్‌లో చేశారు. అలా ఆమెకు యు.పి.తోనూ, పశ్చిమ బెంగాల్‌తోనూ అనుబంధం ఉంది.

ప్రియాంక పది వేలు
ప్రస్తుతం బెంగాల్‌ జట్టుకు యు–19 కోచ్‌గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెట్‌ ప్లేయర్‌ ప్రియాంక రాయ్‌ (32) బెంగాల్‌ కరోనా రిలీఫ్‌ ఫండ్‌కి పది వేల రూపాయలు ఇచ్చారు. బ్యాటింగ్‌లో రైట్‌ హ్యాండ్, బౌలింగ్‌లో లెగ్‌ బ్రేక్, కోచింగ్‌లో.. ‘హెడ్స్‌ అండ్‌ షోల్డర్స్, నీస్‌ అండ్‌ టోస్‌’లా ఉండే ప్రియాంక.. విరాళం మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. లాక్‌డౌన్‌లో ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి రాకుండా మోటివేట్‌ కూడా చేస్తున్నారు.

పూనమ్‌ రెండు లక్షలు
ఇటీవలి ఉమెన్‌ టి20 వరల్డ్‌ కప్‌లో దుమ్ము రేపిన స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (28) కరోనా కొమ్ములు వంచడం కోసం పి.ఎం.–కేర్స్‌ ఫండ్‌కి, యు.పి. సీఎం ఫండ్‌కి కలిపి 2 లక్షల రూపాయలను ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలో ఎదురైన తట్టుకోలేని పరిస్థితులకు నిరుత్సాపడి క్రికెట్‌ను వదిలేసినప్పుడు తండ్రే ఆమెలో ఫైటింగ్‌ స్పిరిట్‌ నింపి, మళ్లీ క్రికెట్‌లోకి పంపించారు. ఆర్మీ ఆఫీసర్‌ ఆయన. పూనం జీవితంలోంచి ఇప్పుడు మనం తీసుకోవలసింది ఇదే. కరోనాపై ఆర్మీ స్పిరిట్‌తో పోరాడాలని.

మేరీ కోమ్‌ కోటీ లక్ష
కరోనాకు ఇవ్వవలసిన పంచ్‌నే ఇచ్చారు బాక్సర్‌ మేరీ కోమ్‌ (37). రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన కోమ్‌ ఎంపీ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ నుంచి కోటి రూపాయలను కరోనాపై పోరుకు విడుదల చేశారు. రాజ్యసభ సభ్యురాలిగా తన ఒక నెల జీతాన్ని పి.ఎం. నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేశారు.

రీచా.. మనూ.. అపూర్వీ
ఉమెన్‌ టి20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఆల్‌ రౌండర్‌ పదహారేళ్ల రీచా ఘోష్‌ లక్ష, ఎయిర్‌ గన్‌ షూటింగ్‌ ఒలింపియన్‌ మనూ భాకర్‌ (18) లక్ష, షూటర్‌ అపూర్వీ చండేలా (27) 5 లక్షలు.. విరాళంగా అందించారు. టెన్నిస్‌ తార సానియా మీర్జా (33) ప్రతిరోజూ దినసరి కార్మికులకు ఆహార దినుసులు పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎంత ఇచ్చారని కాదు. క్రీడారంగంలోనైనా, మరే రంగంలోనైనా విరాళంగా మహిళలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమూల్యమైనదే. క్రీడల్లో ఆ విరాళం మరింత విలువైనది. ఈవెంట్‌లలో పురుషులకు వచ్చినంత రెమ్యునరేషన్‌ మహిళలకు రాదు. అయినా వారు తాము ఇవ్వగలిగినంత ఇస్తున్నారంటే.. ఇచ్చే ఆ మనసును చూడాలి.

ఏప్రిల్‌ 6
సరిగ్గా ఈరోజునే నూట ఇరవై నాలుగేళ్ల క్రితం 1896 ఏప్రిల్‌లో గ్రీసు రాజధాని ఏథెన్స్‌లోని పనాథినైకో స్టేడియంలో తొలి ఒలింపిక్‌ క్రీడల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఏప్రిల్‌ 6 నుంచి ఏప్రిల్‌ 15 వరకు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో 14 దేశాలు పోటీపడ్డాయి. 241 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళలు లేరు. ఆ తర్వాతి  (1900) ఒలింపిక్స్‌ నుంచి మహిళల ప్రవేశం మొదలైంది. తొలి ఒలింపిక్స్‌ మొదలైన ఏప్రిల్‌ 6ను  2014 నుంచి ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ స్పోర్ట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌’గా గుర్తిస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top