అది ప్రశ్నకు తలదించుకోవడమే

Special Conversation With Jukanti Jagannadham - Sakshi

 సంభాషణ

నాలుగు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో ఉన్న జూకంటి జగన్నాథం 14 కవితా సంపుటాలు, ఒక కథల సంపుటి తెచ్చారు. జూన్‌ 20న ఆయన 65వ పుట్టినరోజు సందర్భంగా ఒక సంభాషణ.

►మీరు సాహిత్యంలోకి రావడానికి దోహదం చేసిన పరిస్థితులు?
నేను ఐదవ తరగతి చదివేటప్పుడు నా సహాధ్యాయి రాజ్యలక్ష్మి వాళ్ళనాన్న తెలుగు పండితుడు. వాళ్లింటికి చందమామ, బాలమిత్ర, ఆంధ్రప్రభ వస్తుండేవి. వాటిని అడుక్కొని చదివేవాణ్ణి.  మా ఊళ్లో చలికాలంలో హరికథలు, ఎండాకాలంలో పటం కథలు, వరినాట్లు వేసిన తర్వాత ‘పాండ’ కతోల్లు పాండవుల బాగోతం ఆడేవారు. ఇవే బీజాలు వేశాయనుకుంటా.
►మీ ఊళ్లో సాహిత్య కొనసాగింపు ఎలా జరిగింది?
మానేరుకు ఇవతలి ఒడ్డున తంగళ్లపల్లి మా వూరు. అవతలి ఒడ్డునున్న సిరిసిల్లలో 1972–73 ప్రాంతంలో సాహిత్య వాతావరణం విరాజిల్లుతుండేది. అప్పుడు సినారె సహచరుడు కనపర్తి లక్ష్మీనర్సయ్య, అతని అనుయాయి జక్కని వెంకటరాజం తదితరులతో పరిచయమేర్పడింది. వెంకటరాజం సార్‌ తన గ్రంథాలయ కార్డ్‌ ఇవ్వడమే గాక, కనపర్తి సార్‌ సొంత గ్రంథాలయంలోని పుస్తకాల్ని చదివే ఏర్పాటు చేశారు. వీటి ప్రభావంతో శ్రీపాద, గురజాడ, నుండి  చలం బుచ్చిబాబు నుండి వట్టికోట, దాశరథి సోదరులు, శ్రీశ్రీ, దిగంబర కవుల వరకు అధ్యయనం చేశాను. సినారె అంతేవాసులైన వారు రేడియో లలితగీతాలకు పరిమితమయ్యారు. నేను కూడా మొదట్లో లలిత గీతాలు రాశాను. కానీ మెల్లగా సాహిత్యంలో మిళితం అయ్యాను. నాది కాలేజి మెట్లు ఎక్కని ఎండకాలం చదువు.
►ఆధునిక కవిత్వంలో మీ ప్రయాణం?
అంతవరకు ఏవేవో రాసిన నేను ‘చీకటి దారి’ నుంచి 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత నాటి స్థల, కాలాల ప్రభావం వలన ఏది సరియైన వెలుగుదారో వెతుక్కున్నాను. జక్కని వెంకటరాజం సాహచర్యంలో చేసిన అధ్యయనం ఒక ఎత్తయితే, మిత్రుడు నిజాం వెంకటేశం పరిచయం మరో ఎత్తు. ఒక్కసారి వెలుగు దర్వాజ నాలోకి తెరుచుకున్నట్టు అయింది. మరోవైపు ఉత్తర తెలంగాణ– అణిచివేతకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటానికి సన్నద్ధమౌతోంది. నా ఆలోచనా విధానంలో గొప్ప మార్పుకు ఆస్కార మేర్పడింది. అలా మొదలైన నా కవిత్వం నదీప్రవాహంలా సాగుతూనే ఉంది.
►రెండు దశాబ్దాల తెలుగు కవిత్వ దశ దిశ?
ఉద్యమ కాలంలోనే గాక అంతకు ముందు నుంచే ‘తెలంగాణ కవి’ అని సరిహద్దు గీతల్ని గీస్తున్నారు. రాయలసీమ, కళింగాంధ్ర సాహిత్యకారులను కూడా కుట్ర పూరితంగా ఆ ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. వ్యవహారిక భాష విషయంలోనూ ఇదే అంటరానితనాన్ని వర్తింపజేస్తున్నారు. సాహిత్యానికి ప్రయోజనం ఉందా, లేదా? అనే శషభిషల్లోకి కొందరు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా ఉద్యమాలు వెనుకంజ వేయడం, ప్రపంచీకరణలో మనిషి మనుగడ ప్రమాదంలో పడటం కారణాలు. ఇదంతా ప్రశ్నకు తలదించుకు పోవడమే గాక, వర్తమాన సంక్షోభాలను ధిక్కరించలేక గతంలోకి పారిపోవడమే. ఇప్పుడు తిరిగి తెలుగు సాహిత్యం ఒక కుదుపు రావడానికి పురిటినొప్పులు పడుతోంది.
ప్రపంచీకరణపై ముందుచూపుతో ఎలా రాయగలిగారు?
దేశంలో 1980 నుండే ప్రపంచీకరణ చాపకింది నీరులా ప్రవేశించినా, ఆ దుష్పరిణామాలు 1990లో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నన్ను అవి ఉక్కిరి బిక్కిరి చేశాయి. మనిషి జీవిత విధ్వంసాలను  కథలలో చిత్రీకరించాను. తక్షణ çహృదయ స్పందనలను కవిత్వంలో నమోదు చేశాను. 
బహుజన రచయితల నినాదంపై మీ పరిశీలనలు?
ఈ పదబంధాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల నుంచి ఎదిగివచ్చిన సృజనకారులందరినీ కలిపి అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంటరీ విధానంలో, ఉపాధి రంగాలలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పించబడ్డాయి. మైనార్టీలు రాజ్యాన్ని అనేక రూపాలలో బార్‌గెయిన్‌ చేస్తున్నారు. వీరి అవసరం రాజ్యానికి ఓట్ల రూపంలో కలదు. కానీ బీసీ రచయితలు ఒక అగమ్యగోచరంగా ఉన్నారు. సంఖ్యా పరంగా గణనీయంగా ఉన్నప్పటికి అనైక్యంగా వున్నారు. వీరు ఏకం కాకుంటే ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.
-మోతుకుల నారాయణ గౌడ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top