అవకాశమే మహాప్రసాదం!

special  chit chat with k.viswanath - Sakshi

నేను  నా దైవం

కళాతపస్వికి జీవితమే ఓ తపస్సు!
క్రమశిక్షణ, కార్యదీక్ష ఉచ్ఛ్వాసనిశ్వాసలు!
మనకు పూజంటే ధూప దీప నైవేద్యాలే
కాని, ఆయనకు కళారాధనే ప్రార్థన.

విశాలమైన ఆవరణ, ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లు, కొమ్మల చివరన విరిసిన రంగుల పువ్వులు.. ఆ ఆహ్లాద ఆవరణలో కూర్చోవడానికి అనువుగా అరుగులు, వాటికి అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు.. కళకళలాడుతున్న ఆ లోగిలిని చూస్తూ మెట్లు ఎక్కి పై అంతస్తుకు చేరుకున్నాక ఊయలలో కూర్చొని అభిమానులతో మాట్లాడుతూ కనిపించారు కళాతపస్వి కె.విశ్వనాద్‌. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని వారి నివాసంలో కలిసి దైవం గురించి అడిగితే ‘నా జీవితమే దైవ కృప’ అంటూ వివరించారు. 

88 ఏళ్ల మీ జీవితం దైవాన్ని ఏ విధంగా చూసింది? 
తల్లి గర్భంలో బీజంగా చేరి బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ బిడ్డకు రెండు చేతులు ఉండాలి, ఆ చేతులకు పది వేళ్లు ఉండాలనే నిర్ణయం ఎక్కడ జరిగింది. ఈ అవయం ఇక్కడే ఉండాలనే ఏర్పాటు ఎలా జరిగింది. ఆ పువ్వులను చూడండి. వాటికి ఆ రంగే ఉండాలని ఎవరు నిర్దేశించారు. ఈ పండులో ఈ రుచే ఉండాలని ఎవరు చెప్పారు. మనం పీల్చే గాలిలోనూ, చూసే కళలోనూ అంతటా ఆ దైవ శక్తి ఇమిడి ఉంది, నా బంధుమిత్రుల్లో కొందరు నాస్తికులు ఉన్నారు. కానీ, వారిలోనూ దైవత్వం కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాతో పనిచేసిన ప్రతివారిలో మంచిని చూశాను. లైట్‌ బాయ్‌ కావచ్చు, నాయకుడే కావచ్చు. స్థాయి బేధాలు లేవు. మంచి చిత్రాన్ని ఇవ్వాలి, మంచి నటన ఇవ్వాలి అనే నా తపనకు ఎందరో చేయూతనిచ్చారు. వారిందరిలో దైవత్వం ఉందని భావించాను. చూసే మనసును బట్టి దైవం కనిపిస్తుంది. మనం ఓ శక్తిని నమ్ముకుంటే అనుక్షణం ఆ శక్తి మనతోనే ఉంటుంది. అది ఏ రూపంగానయినా కావచ్చు. 

మీ పేరులోనే శివుడున్నాడు. ఈ పేరు వెనుక సంఘటన ఏమైనా ఉందా? 
నేను మా అమ్మ గర్భంలో ఉండగా మా తాతగారు కాశీలో ఉన్నారట. అప్పుడు ఆయనకు ఈ శుభవార్త తెలిసి ఆ పరమశివుడికి నమస్కరించుకున్నారట. స్వామీ, నీ సన్నిధిలో ఉండగా ఈ వార్త తెలిసింది. పుట్టబోయే వారికి నీ పేరే పెట్టుకుంటాను అనుకున్నారట. ఆ విధంగా నాకు విశ్వనాథ్‌ అని పెట్టారు. మా ఇంటి పేరుతో కలిసి కాశీనాథుని విశ్వనాథుడు నా పేరులో కలిసిపోయాడు. 

కళారంగానికి రావాలనుకున్నది మీ అభీష్టమా? దేవుడి నిర్ణయమేనంటారా?
ముమ్మాటికి దైవనిర్ణయమే! యాదృశ్చికంగా ఈ రంగంలోకి వచ్చాను. ముందు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ని కావాలనుకున్నాను. ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ ఒక ఆఫీసర్‌ హోదాలో ఉండాలనుకునేవాణ్ణి. కానీ, ఇలా వచ్చాను. అయితే, ఈ రంగంలోకి వచ్చినందుకు ఎక్కడా విచారం లేదు. ఇందులో ఒకటీ రెండు కాదు దైవం ఎన్నో అవకాశాలను ఇచ్చింది. ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని శ్రద్ధగా వాడుకున్నాను. ఆ పనితో మమేకం అయ్యాను. అదే నన్ను ఇలా మీ అందరి ముందు నిలిపింది, 

మీ సినిమాలో దైవానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఏవైనా ఊహించని ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయా?
సినిమాలో పలానా సన్నివేశం, ఫలానా నటుడి నటన అద్భుతమని ప్రేక్షకుడికి అనిపించాలి. అలా దర్శకుడిగా, నటుడిగా నా పనికి నేను న్యాయం చేయాలి. ఊహించని సన్నివేశాలతో అద్భుతం అనిపించాలి. అలా శ్రద్ధగా చేశానే తప్ప ఇదో మిరాకిల్‌ అన్నవి లేవు. ఈ ఫొటో చూడండి (ఆఫీసు గదిలోని తన ఫొటో చూపిస్తూ) బెంగుళూరులోని ఓ కళాకారుడు అద్భుతంగా చిత్రించి, ఫ్రేమ్‌ కట్టించి ఇచ్చాడు. ఇదిగో ఈ కళారూపం మా అమ్మనాన్నలది. ఓ చెక్కమీద అందంగా చెక్కి కళాకారుడు బహుకరించాడు. కళాకారుyì గా మా పనులకు జీవం పోయడానికే తపన పడుతుంటామే తప్ప అందులో అద్భుతాలను ఆశించం. 

కష్టాన్ని అధిగమించడానికి దైవాన్ని ఆసరా చేసుకున్న సందర్భాలు.. 
ఈ జీవితంలో దక్కాలనుకున్నది దక్కుతుందని ఓ నమ్మకం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారికి ఏడుపు ఉండదు. కష్టం అనిపించదు. కష్టం వచ్చినప్పుడు నేనేం పాపం చేశాను అని దేవుణ్ణి నిందించడం సరికాదు. అలాగే కాలం కలిసొచ్చినప్పుడు అంతా తమ ప్రతిభ అనుకోవడం సరికాదు. అలాంటి రెండు సందర్భాలు నాకు లేవు. కష్టానికి కుంగిపోయి, సుఖాలకు పొంగిపోయిన సంఘటనలు అస్సలు గుర్తులేవు.

దైవం గురించి బాల్యంలో అమ్మనాన్నలు పరిచయం చేసినదానికి, ఇప్పుడు అర్ధం చేసుకున్నదానికి చాలా తేడా ఉంటుంది...
మీరన్నట్టు అనుభూతి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కో విధంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏదో చేశాడు అనుకుంటాం. దేవుడంటే భయంగా ఉంటాం. పెద్దవుతున్న కొద్దీ మన ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అవగాహన విస్తృతమవుతుంది. మనుషుల రూపంలోనే దేవుడు వస్తాడు సాయం చేయడానికి అని చాలా సందర్భాలలో తెలుస్తుంది. అయితే, దేవుడు దేవుడే! చిన్నప్పుడు నే చూసిన బాలాజీ అలాగే ఉన్నాడు. ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అవే పూజలు, అభిషేకాలు. ఎప్పటికీ ఆయన అలాగే కనిపిస్తాడు. 

తరచూ దేవాలయ సందర్శన చేస్తుంటారా? ఏ దేవాలయం మీకు అమితంగా నచ్చుతుంది? 
అష్టోత్తర నామాలలో ఏ నామం నచ్చుతుందంటే ఏమని చెబుతాం. ఆలయాలు కూడా అంతే! అయితే, ఫలానా చోటుకి వెళుతూ ఈ దరిద్రం ఏంటి అనుకుంటే స్వర్గమైనా నరకంలాగే ఉంటుంది. అంతా భగవతేశ్చ అనుకుంటూ స్మశానికి వెళ్ళినా ఆ అనుభూతి అలాగే ఉంటుంది. ఒక్క శివుడు అనేకాదు అన్ని దేవతలను ఆరాధిస్తాను. అన్ని దేవాలయాలను సందర్శిస్తాను.  అంతేకాదు చర్చి, మసీదులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఏ మతమైనా దేవుళ్లంతా ఒక్కటే.

మీ మనవళ్లకి, మనవరాళ్లకి దైవారాధనను ఎలా పరిచయం చేస్తుంటారు? 
మనం చెప్పింది వాళ్లు వినరు. మనం ఆచరించింది వాళ్లు చేస్తారు. మా అమ్మనాన్నలు విధిగా చేసిన కార్యక్రమాలను నేను ఆచరణలోకి తెచ్చుకున్నాను. ఆ ఆచరణ ఎలా ఉంటుందంటే వారి ఆశీర్వచనాలు ఇప్పటికీ నాతోనే ఉంటాయనే భావన కలిగిస్తుంది. మనసును దృఢం చేస్తుంది. అందుకే మన పెద్దలు పూజలను ఒక ఆచారంగా మనకు అందించారు. మనం భవిష్యత్తు తరాలకు అందించాలి. 

మీ దినచర్యలో  ప్రార్థనాసమయం?
 అమ్మనాన్నలు నేర్పించిన లక్షణాలలో పూజ ఒకటి. సంధ్యావందనం చేయనిదే  ఎలాంటి పదార్థమూ తీసుకోను. పూజామందిరంలో దీపం వెలిగిస్తాం. అంతకు మించి పూజలు ఉండవు. మా ఇంటికి దగ్గరలో శివాలయంలో అభిషేకాలకు  వెళుతుంటాను. 

సంగీతం, నృత్యం దైవారాధనకు దగ్గరి దారి అంటారు. మీ సినిమాలో సంగీతం, నృత్యం ప్రధానాంశంగా ఉంటాయి. ఈ కళను ఎలా వంటపట్టించుకున్నారు? 
 ప్రేమ, స్నేహం దగ్గర కావాలనుకున్నప్పుడు మనలో వారి కోసం ఓ తపన ఉంటుంది. ఆ అవసరం, తపన మనల్ని ప్రయత్నించేలా చేస్తుంది. అదృష్టం అంటే ఎక్కణ్ణుంచో రాదు. దేవుడు నీకు అవకాశాలు కల్పిస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే అదే అదృష్టంగా నిన్ను వరిస్తుంది. మన ఎంచుకున్న వృత్తికి మనం నూటికి నూరు శాతం న్యాయం చేయాలి. అలా అనుకుంటే మనకేం అవసరమో అవే వంటపడతాయి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top