అనుమానాలన్నీ పటాపంచలు

Saipadam Antarvedam 3 special - Sakshi

సాయిపథం – అంతర్వేదం 3

ఓ పనిని కార్యరూపం దాల్చేలా చేయాలంటే స్థిరమైన నమ్మకం, చెక్కు చెదరని ఓపికా ఉండాలి కదా! ఆ రెంటితోనే అన్నా సాహెబు స్వయంగా సాయి దర్శనం కోసం, గ్రంథ రచనకి ఆమోదం పొందడం కోసం షిరిడీకి బయల్దేరాడు. షిరిడీలో సాయి దర్శనానికి వెళ్లాలనే గట్టి కోరికని అన్నా సాహెబుకి కలిగించిన వాళ్లు నానా సాహెబు, కాకా సాహెబు అనే ఇద్దరు మిత్రులు. అన్నా సాహెబు షిరిడీకి బయల్దేరగానే స్నేహితుని పుత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే వార్త వినిపించింది. అంతే! షిరిడీ ప్రయాణం మాని స్నేహితుని ఇంటికి వెళ్లాడు అన్నా సాహెబు. ఔషధాలు వాడారు. ఎందరెందరో మంత్రాలు పఠించారు. సాక్షాత్తూ ఆ కుటుంబమంతా గురువుగా భావించే ఓ మహనీయుణ్ని రప్పించి వ్యాధిగ్రస్తుని పక్కనే ఉంచారు – ఆయన తన మహిమలతో కాపాడగలడని. ఇన్ని చేసినా ఆ స్నేహితుని పుత్రుడు మరణించనే మరణించాడు.  అంతే! నా స్నేహితుని పుత్రుణ్నే కాపాడలేని ఈ గురు సంప్రదాయం మీద నాకు విశ్వాసమెందుకు? అనుకుంటూ అన్నా సాహెబు తన షిరిడీ ప్రయాణాన్ని మానేయడానికి నిశ్చయించుకున్నాడు. 

భగవంతుడు భక్తుణ్ని పరీక్షించే విధానం ఇదే. తనవద్దకి బయల్దేరిన భక్తుణ్ని కాస్తా – ప్రయాణం మానేద్దామనే ఆలోచనకి గురిచేయడం ఎందుకంటే – మరింత భక్తి విశ్వాసాలు అతనిలో కలిగించాలనే సంకల్పమే కారణం కాబట్టి. అన్నా సాహెబు తిరిగి వెళ్లిపోబోతుంటే మిత్రుడొకడు వచ్చి – ‘షిరిడీకి పో!’ అని కోపంతో పలికి షిరిడీ ప్రయాణానికి సంకల్పం కలిగేలా చేశాడు. లోకంలో భక్తులకు కూడా ఇలాంటి అనుభవాలే కలుగుతాయి. ప్రస్తుతమున్న పరిస్థితిలో ఎలా వెళ్లగలం? అనుకుంటూంటే అంతలోనే ఎవరో వచ్చి ‘వెళ్లు! మానతావేం!’ అని మళ్లీ ప్రయాణానికి సన్నద్ధుల్ని చేస్తారు. షిరిడీ వెళ్లొచ్చాక పొరపాటున షిరిడీ ప్రయాణాన్ని మాని ఉంటే ఎంత నష్టపోయి ఉండేవాళ్లం? అనే అనుభూతి కలుగుతుంది. అన్నా సాహెబు మళ్లీ ప్రయాణానికి సిద్ధపడి రైల్లో కూచోగానే ఒక సాయెబు వచ్చి – ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ‘షిరిడీకి’ అనగానే – నవ్వి – నువ్వు ఫలానా స్టేషన్లో దిగు! నువ్వు వెళ్లాల్సిన స్టేషన్లో ఈ బండి ఆగదు సుమా! – అని చెప్పి వెళ్లిపోయాడు. దైవ విచిత్రాలన్నీ ముందు తెలియవు. ఆ తర్వాత అర్థమవుతాయి. అన్నా సాహెబెవరో? ఎక్కడికి వెళుతున్నాడో? ఆ ప్రశ్ననే ఎందుకు వేశాడో? వేసి అలా ఎందుకు సూచించాడో? – అదంతా అన్నా సాహెబుకి తర్వాతగానీ అర్థం కాలేదు. దీన్ని ఓ మహత్తుగానూ గొప్ప సంఘటనగానూ అప్పటికి మనసులో భావించని అన్నా సాహెబు, అలాగే ఆ సాయెబు చెప్పిన స్టేషన్లోనే దిగాడు. ఆ సాయెబే గనుక అలా వచ్చి చెప్పి ఉండని పక్షంలో తాను తాననుకున్న స్టేషన్లో దిగి నానా యాతనలకీ గురయి షిరిడీకి చేరలేకపోయేవాడు. అదీకాక స్నేహితుల పుత్రుణ్ని రక్షించలేని గురువు ఒక గురువా? అనే అభిప్రాయంతో ఉన్న తాను పూర్తిగా షిరిడీ ప్రయాణాన్ని మానివేసే వాడేమో కూడా! 

బాబా గురించిన చరిత్రని వ్రాయదలిచిన అన్నా సాహెబు తనకు తానుగా వెళ్లి సాయిని దర్శించి తన మనోభిప్రాయాన్ని తెలిపే కంటే, సాయికి సన్నిహితులైన వారి ద్వారా తన ఆలోచనని సాయి సమక్షంలో ఉంచడం మంచిదని భావించాడు. సాయి తన భక్తులందరికీ దర్శనమిచ్చే ప్రదేశం సాఠేవాడా. అన్నా సాహెబుకి షిరిడీలో దిగగానే అన్నింటికంటే ముందుగా సాయిని దర్శించాలనే ఆత్రుత తీవ్రమయింది. స్నానం చేయకుండా రాత్రంతా ప్రయాణించిన ఆ వస్త్రాలతో అలాగే దర్శించవచ్చునా? అనే అనుమానం కూడా లోపల కలిగింది. చిత్రమేమిటంటే అన్నా సాహెబుకి సాయి నుండి తిరిగి వస్తున్న మాల్కరు అనే భక్తుడు కనబడి ‘ఇప్పుడే వస్తున్నా సాయి దర్శనాన్ని చేసి. ఆయన అదుగో సాఠేవాడా దర్శన స్థలంలోనే ఉన్నారు. వెంటనే ధూళిదర్శనం (ఎలా ఊరి నుండి వస్తే అలా చేసే దర్శనం) చేసి రా!’ అన్నాడు. బాబా లీలలు ఇవే! వెంటనే చూడాలనేది ఓ తపన అవుతూంటే, ఇలా అశుభ్ర వస్త్రాలతో స్నానం చేయని శరీరంతో దర్శించవచ్చునా? అనేది మరో అనుమానమవుతూంటే, భక్తుడైన మాల్కరు ద్వారా సాయి ఆ రెండు ప్రశ్నలకీ సమాధానాన్ని ఇప్పించాడు – ధూళి దర్శనం చేసి రా అనీ – అలా చేయవచ్చుననీ. అంతేకాదు, మరో ప్రశ్నకి అవకాశం లేకుండా – ఎలాగూ దర్శనం ముగించాను కదా అని మానేయకుండా ‘స్నానానంతరం మళ్లీ దర్శనానికి రా!’ అని కూడా చెప్పించాడు బాబా అనిపించింది అన్నా సాహెబుకి. మనం అడిగితే దానికి ఏదో సమాధానాన్ని చెప్పేవాళ్లు కొందరుంటారు. మనకి రాబోయే సంశయాన్ని తమకి తామే ప్రశ్నగా వేసుకుని మనకి ఇక అనుమానమే లేకుండా, రాకుండా ఉండే సమాధానాన్ని చెప్పేసేవాళ్లు కొద్ది సంఖ్యలో ఉంటారు. వీటన్నిటికంటే మన మనోభిప్రాయాన్ని గమనించి వారి ఆలోచనకి అనుగుణంగా మనని నడిపించేవారు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. అలాంటివాడు సాయి అని గ్రహించగలిగాడు అన్నా సాహెబు. ఆ ఆలోచన నిజం కాబట్టే షిరిడీకి ప్రయాణం – ఆపుదల – రైలుబండిలో సాయెబు సూచన – షిరిడీకి రాక – ధూళిదర్శనం... ఇవన్నీ జరిగాయని భావించాడు. 

సాయిచరిత్ర ఒక కథ కాదు. నిత్యజీవన చరిత్ర. అందరు భక్తులకీ ఇవే తీరు అనుభవాలు జరుగుతూ ఉంటాయనేది నిజం. భక్తుడైన మాల్కరు అలా సూచించగానే సాయిబాబా వద్దకి వెళ్లి సాష్టాంగ పడ్డాడు అన్నా సాహెబు. నేలమీది ప్రతినీటి బిందువునీ ఆకాశం వరకూ తన కిరణాలతో వాయురూపంగా మార్చి మేఘాన్ని సృష్టిస్తే ఆ మేఘం ఒక్కసారిగా వర్షిస్తే ఎంత చిన్న నీటి బిందువు ఎంత పెద్ద వర్షంగామారిందో, అలా తనకున్న సామాన్య ఉత్సాహం, ఆత్రుత కాస్తా సాయి పాదాలని స్వయంగా పట్టేంత అనుగ్రహానికి అవకాశాన్నిచ్చాయని అనుకున్నాడు అన్నా సాహెబు. సాయి అంటాడు ఒకచోట – పిచ్చుక కాలికి దారాన్ని కట్టి అది ఎక్కడికి ఎంత దూరంగా, ఎంత ఎత్తులో ఎగురుతున్నా ఆ తాడునిపట్టి కిందికి లాగి తన వద్దకి రప్పించుకుంటా అని. నిజమే కదా! సాష్టాంగాన్ని చేసి సాయి పాదాలని స్పృశించిన వేళ అన్నా సాహెబు తన శరీరాన్ని తాను మరచిపోయాడు. పాలకోసం దూడని తల్లి వద్దకి పంపాక, తిరిగి వెనక్కి లాగాక, పాలు పితకడం జరుగుతున్నప్పుడు దూడ ఎలా తన వంతు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తూ తహతహలాడిపోతుంటుందో అలా తపన పడ్డాడు అన్నా సాహెబు, సాయి దర్శనం కోసం. దర్శనం మాత్రమే కాదు, స్పర్శనం కూడా అయింది. భక్తిలో సంతృప్తి కలగడమంటే ఏమిటో అర్థమయింది. సాయిచరిత్రని రాసి తీరాల్సిందే! అనే అభిప్రాయం దృఢమయింది. తొమ్మిది నెలలపాటు గర్భంలో మోసి, అతికష్టంతో ప్రసవ వేదనని అనుభవించి ప్రసవించిన మరుక్షణంలో ఆ తల్లితనాన్ని పొందిన గృహిణి తన బిడ్డని చూసి ఎంతెంత ఆనందాన్ని అనుభవిస్తుందో, అప్పటివరకూ పది నెలలపాటు అనుభవించిన అంత బాధనీ అలా గాలికి ఎగిరిపోయేలా చేస్తుందో అంత ఆనందమైంది అన్నా సాహెబుకి సాయి దర్శనం – పాద స్పర్శనం. 

ఓ యధార్థాన్ని గుర్తించాలి ఇక్కడ. ఓ సముద్రాన్ని ఎందరో దర్శిస్తారు. చిన్న పిల్లలకి ఆ ఒడ్డున ఇసుకతో పిచ్చుక గూళ్లు కట్టుకునే ప్రదేశంలా అనిపిస్తుంది సముద్రం. జీవితంలో బాధలని ఒకదాని మీదట ఒకటి అనుభవిస్తున్న వానికి కెరటాలు బాధల రూపంలో కనిపిస్తూ – అన్ని బాధలూ తన వద్దకి మాత్రమే వస్తున్నట్లనిపిస్తుంది. ఒక శాస్త్రవేత్తకి భూమి పైకీ కిందకీ కదులుతూంటే కలిగే నీటి కెరటాల సమూహమనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికవేత్తకి కాలకూటం, కల్పవృక్షం, చంద్రుడూ, లక్ష్మీదేవీ, ధన్వంతరీ, చివరికి అమృతం లభించిన జలనిధిలా అనిపిస్తుంది. ఒక వేదాంతికి ఈ నాలుగు యుగాలలో కూడా ముంచెత్తే ప్రళయానికి కావలసిన ముడి వస్తువైన జల సమూహంలా కనిపిస్తుంది. అదే తీరుగా సాయిదర్శనం కూడా కొందరికి ఓ మహనీయుని దర్శనం లాగా, కొందరికి తమ కోరిక తీరిన పక్షంలో నమ్ముదామనుకునే మహా పురుషునిలాగా, మరి కొందరికి ఎందరో భక్తులని సమీకరించుకోగల సిద్ధుని దర్శనమనిపిస్తే, అన్నా సాహెబుకి మాత్రం ఆ దర్శనం తన పూర్వజన్మ దుష్కర్మలని పూర్తిగా తొలగించగలిగిన భగవంతునిలానూ, ప్రపంచమంతా ఆవరించగల విశ్వరూపిగానూ అనిపించింది.  అంతటి మానసికానందంతో ఉన్న అన్నా సాహెబు బాబాకి అతి సన్నిహితులూ, పరమభక్తులూ అయిన శ్యామాని ప్రార్థించాడు – సాయిచరిత్రని రాయడానికి అనుమతిని ఇప్పించవలసిందని. శ్యామా నేరుగా సాయితో –  ‘‘బాబా! దేవా!! ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రని బాగా తెలుసుకుని ఉన్నాడు. ఆ ఆనందంతో దాన్ని ఒక గ్రంథంగా చేయాలని ఉబలాటపడుతున్నాడు. ఏదో బిచ్చమెత్తుకుంటూ ఫకీరుగా జీవించే వీడి చరిత్ర లోకానికి అవసరం లేదంటూ పలకకుండా, మీరు అంగీకారాన్ని తెలియజేస్తే ఆయన రాయడానికి సిద్ధంగా ఉన్నారు. తనకి తానే వ్రాయచ్చుగా! అంటారేమో.. తమ దయ, ఆశీర్వాదం లేనిదే అది సాధ్యం కాదనీ, జయప్రదం కాబోదనీ ఆయన అభిప్రాయం. అందుకే అనుమతి కోసం వేచి ఉన్నారు’’ అని స్పష్టంగా చెప్పాడు. 

దీన్నే శాస్త్ర పరిభాషలో ‘శరణాగతి’ అంటారు. తనకెంత శక్తి ఉన్నా భగవంతుణ్ని శరణు వేడటం కోసం వెళ్లడమే శరణాగతి. ‘నాకు పాండిత్యముంది. ఒక విషయాన్ని రాయగల శక్తి ఉంది. వివరించి చెప్పగల యుక్తి ఉంది. అన్నింటికీ మించి శీఘ్రంగా ముగించగలిగినంత సమయం కూడా ఉంది’ అనే ధోరణితో కనిపిస్తారు ఎందరో. ఇక్కడ సాయిచరిత్రాన్ని రాయడానికి సాయిచరిత్రలోని సంఘటనలూ, శైలీ.. వంటివి ముఖ్యం కాదు. సాయి అనుగ్రహం ముఖ్యం. దీన్నే దైవానుకూల్యం అంటారు. కేవలం రామునివల్ల కార్యం జరగదు. కేవలం లక్ష్మణుని వల్ల పని పూర్తి కాదు. అలాగే కేవలం కృష్ణుడు కౌరవసంహారం చేయలేడు. పాండవులు మాత్రమే కౌరవవధని నెరవేర్చలేరు. ఇటు పాండవులూ, లక్ష్మణుడూ అనేవాళ్లు మానవ ప్రయత్నానికి సంకేతాలౌతూంటే, అటు రాముడూ, కృష్ణుడూ అనేవాళ్లు దైవ అనుకూల్యానికి సంకేతాలు. కాబట్టి మానవ ప్రయత్నం దైవ సహాయం అనే రెండూ ఉన్నప్పుడే – రెండు రెక్కలతో మాత్రమే పక్షి ఎగరగలిగినట్లు – కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నమాట. ఈ య«థార్థాన్ని గమనించినవాడు అన్నా సాహెబు అయినందువల్లనూ, ఆ స్థితికి తాను ఎదుగగలిగినందువల్లనూ, తాను సాయిచరిత్రాన్ని రాయడానికి కావాల్సిన సమాచారాన్ని తన వద్ద కలవాడే అయినా, సాయి అనుగ్రహం గాని లేకపోతే రాయలేనే లేడని తెలిసి సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకి పూనుకున్నాడన్నమాట. 

ఈ తీరు మౌలిక సత్యాన్ని తెలిసినవాడు అన్నా సాహెబు అని గ్రహించిన సాయి, శ్యామా ద్వారా అన్నా సాహెబు గురించి తెలుసుకుంటున్న వానివలె వింటూ, శ్యామా చెప్పిందంతా విన్నాక అన్నా సాహెబుకి అర్థమయ్యేలా ఇలా చెప్పబోతూ ఊదీ (విభూతి) ప్రసాదాన్నిచ్చాడు స్వయంగా – అనుగ్రహ ఆమోద సూచకంగా. ‘శ్యామా! అన్నా సాహెబుని నా చరిత్రనీ అనుభవాలనీ బాగా సంగ్రహించవలసిందని చెప్పు. కొన్ని కొన్ని సందర్భాల్లో కంటికి కనబడే విషయాలని నేనే వివరిస్తాను. తాను రాయబోయే గ్రంథం ఏదో సామాన్యంగా రాసేసే లౌకిక గ్రంథాల వంటిది కాదు. కొన్ని కోట్లమంది భక్తుల కష్టాలని కడతేర్చగల దివ్యౌషధం వంటిదది. వ్యాధిగ్రస్తుల వ్యాధినీ వ్యాధులనీ తీర్చాలంటే వైద్యుడు ఎంత శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతలతో మాత్రమే ఔషధాన్ని సమకూర్చాలో (తయారు చేయాలో) అలాంటి దివ్యౌషధ సమానమైన సాయిచరిత్రాన్ని రాయదలచిన ఈ భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా నా పాదాల దగ్గర ఉంచెయ్యాలి. వాడు నా హృదయ భక్తుడు. అందుకే నేను వాడి మనసులో ప్రవేశించి నా కథలనీ బోధలనీచెప్పుకుంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే నా కథని నేనే రాసుకుంటాను. లోక దృష్టిలో రాయించుకుంటాను. లోకంలో కనిపించే భక్తుల ఆలోచనలని పరిగణనలోనికి తీసుకుని వాడికి తోచిందాన్ని నిర్ధారణ చేయవద్దని చెప్పు. ఇతరుల అభిప్రా యాల్లో ఏవి సరైనవో అవి నాకు తెలుసు. వాటిని తిరస్కరించడం గాని, తేలిక చేయడం గాని వద్దే వద్దు అని వానికి చెప్పవలసింది’ అన్నాడు సాయి.చివరగా ఒక్క మాట అంటూ – ‘ఏ విషయం మీదనైనా ఇది మంచీ ఇది చెడూ ఇది యదార్థం ఇది అసత్యం – అని నిర్ధారించే విధానం గాని, వివాదం గాని వానిని చేయవద్దని చెప్పవలసింది’ అని ముగించాడు సాయి. ఈ మాటలన్నింటినీ బాబా ఉపదేశంగా భావించి దాన్నే మహా ప్రసాదమనుకుంటూ అన్నా సాహెబు సాయిచరితాన్ని రాయడానికి తిరుగులేని నిర్ణయాన్ని తీసుకున్నాడు. బాబాకి సంపూర్ణ భక్తుడైపోయాడు కూడా. అంతటి మహనీయుణ్ని దైవంగానే భావించుకుని ఆయన చరిత్రాన్ని అందించగల మహదవకాశం తనకి దక్కడం – తనకి మాత్రమే దక్కడం – పూర్వజన్మ సుకృత ఫలంగా భావించాడు. ఈ సందర్భంలో సాయి స్వయంగా అన్నా సాహెబుని చూస్తూ – హేమాడ్‌ పంత్‌ – అని పిలిచాడు. హేమాడ్‌ పంతా? ఆయనెవరు? ఇంతకీ ఆ పేరుతో తనని సాయి పిలవడంలో అంతరార్థమేమిటి? అదీ కాక ‘రోహిల్లా జోలికి పోవద్దు’ అని కూడా హెచ్చరించాడు. రోహిల్లానా? అదెవరు? వాని జోలికి పోదలచడమేమిటి? పోకూడనిదెందుకు? (సశేషం...) 
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top