సాహిత్య బాటసారి శారద

Prathidwaninche Pustakam, Smruthi Shakalalu - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

‘‘అది 1937వ సంవత్సరం. చలికాలపు ఓ ఉదయం. పన్నెండేళ్ల పిల్లవాడు తెనాలి రైల్వేప్లాట్‌ఫాంపై కాలుమోపాడు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎక్కడో పుదుక్కోటలో పుట్టి, మద్రాసులో పెరిగి, జానెడు పొట్టకోసం తెనాలి వచ్చాడు.  హోటల్‌ కార్మికుడిగా చేరి తెలుగు నేర్చుకున్నాడు. అతనికి చదువు ఒక వ్యసనం. తనలోని తీవ్రమైన భావావేశాన్ని ప్రకటించడానికి రచనను ఆశ్రయించాడు. తోటి హోటల్‌ కార్మికులమైన మాకు తెలుగుతోపాటు తమిళ అక్షరాలు కూడా నేర్పాడు, పుస్తకాలు చదివించాడు. తను రాయడమే కాకుండా, నాచేత, ప్రకాశరావు, అబ్బరాజు నాగభూషణరావు, ముక్కామల మల్లికార్జునరావు చేత రాయించి మమ్మల్ని రచయితలను చేశాడు’’ అంటూ ఆలూరి భుజంగరావు తన జీవిత చట్రం నుంచి శారద జీవితాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు’. ఈ పుస్తకం 1985లో వచ్చింది.
 
శారద తుపాను వేగంతో సాహిత్యంలోకొచ్చాడు. అంతేవేగంతో జీవితం నుంచి నిష్క్రమించాడు. బతికినంత కాలం హోటల్‌ కార్మికుడిగానే బతికాడు. ఒక చేత్తో రచనలు చేస్తూనే, మరో చేత్తో రోడ్డుపక్క మసాలా గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మాడు. బస్సుల్లో నిమ్మకాయ మజ్జిగ, రోడ్డుపక్క పాతపుçస్తకాలు అమ్మాడు. అసలు పేరు ఎస్‌. నటరాజన్‌.  శారద, గంధర్వుడు, శక్తి అన్న పేర్లతో వందకుపైగా కథలు రాశాడు. అపస్వరాలు, మంచి–చెడు, ఏదిసత్యం, సరళాదేవి హత్య, మహీపతి, అందాల దీవి వంటి ఆరు నవలలు రాశాడు.  ముప్ఫై ఏళ్లే జీవించాడు.

‘‘అది 1947 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు. నేను, శారద పనికోసం తెనాలి వీధులన్నీ తిరిగాం. మాకు పనులు ఇవ్వని హోటల్‌ యజమానులు, మమ్మల్ని కొట్టిన యజమానులు, మా జీతాలు ఎగ్గొట్టిన యజమానులు ఆరోజు జెండాల్ని ఎగరేశారు.  ఆరోజు మా పొయ్యిలో పిల్లి లేవలేదు. నేను, శారద, అమ్మ కటిక పస్తులు పడుకున్నాం’’ అంటూ  భుజంగరావు చెప్పిన విషయాలు కంటతడి పెట్టిస్తాయి.
‘‘ఆనాటి హోటల్‌ వృత్తి అవగుణాల నిలయం. పొద్దుగూకులూ బండెడు చాకిరీ చేయాల్సి ఉండేది. నాలుగు డబ్బులు చేతికి వచ్చిన రోజున ఏ చీట్లాటకో, తాగుడుకో, దొమ్మరిగుడిసెలకో వెళుతుండేవారు.  అంతటి కల్మషంలో బతుకుతున్నా కూడా కథలు రాయాలన్న అపురూప ఊహ కలిగించినవాడు శారద.’’

‘‘ఆరోజు ఆగస్టు 17, 1955వ సంవత్సరం. ‘కాఫీకి రారా బుజ్జీ’ అని శారద కేకవేశాడు. ‘నేను రానురా కథరాసుకుంటున్నా’ అన్నాను. తలెత్తి గేటువేపు చూశాను. అదే ఆఖరి చూపు. రాత్రి తొమ్మిది గంటలకు ‘శారద చనిపోయాడు’ అన్నారెవరో! మర్నాడు శవసంస్కారానికి బజారున పడ్డాం చందాలకు. అప్పటికతనికి ఇద్దరు పిల్లలు. భార్య నిండు గర్భవతి.’’
‘‘శారద కథ రాయాలంటే అరకప్పు కాఫీ తాగి,  æతాజ్‌ మహల్‌ బీడీకట్ట దగ్గర పెట్టుకుంటేనేగానీ కలం కదిలేది కాదు. పరిచయమున్న వారందరినీ కాఫీకి, బీడీలకు అణాడబ్బులడిగేవాడని అపప్రధ ఉండేది. ఎక్కడో తమిళ దేశంలో పుట్టి, తెనాలికొచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగు జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శారదకు కాఫీ కోసం, బీడీల కోసం ఎన్ని అణాలిస్తే అతని రుణం తీర్చుకోగలం!’’  అన్న భుజంగరావు మాటలు మనల్ని వెంటాడుతాయి.        
- రాఘవ శర్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top